Monday, October 22, 2007

Missamma కు మత్తకోకిలలు

కస్సుబుస్సుల టెక్కులాడికి గట్టి పిండము చేరువై
మిస్సుమేరిని లక్ష్మికమ్మనె పెళ్ళి నాటకమాడగా
తస్సదియ్య ఇదేమి చోద్యము, నవ్వులాటల నాటకం
అస్సలేమిటి కల్లబొల్లులు, యంచు అచ్చెర పోతిరా?

కాసు కోసము కొల్వు కోసమె, కల్ల లాటలు ఆడడం;
వేసిరిద్దరు వేషధారణ, మిస్సు-అమ్మను బొమ్మకై
చూసి పొట్టలు చెక్కలే మరి, చూడ చక్కని చిత్తరం
వీసమైనను వాసి తగ్గని, వీర నవ్వుల విడ్డురం


మిస్సమ్మ గురించి తెలుగువాళ్ళకి వేరే చెప్పనవసరం లేదేమో. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అందం గురించి ఇదివరకే
రాసాను. విజయా వారి అలనాటి ఆణిముత్యాలలో, అందులోనా సంపూర్ణ హాస్యభరిత చిత్రాలలో ఇదొక్కటి. నటులు ఒకరికొకరు పోటాపోటిన నటించారా అనిపించే విధంగా పాత్రపోషణ చేయడం ఒక ఎత్తు అయితే, రెండు మతాలు కూడుకుని ఉన్న కధని ఎంతో సున్నితమైన శైలిలో రాసి, నవ్వులు గుప్పించిన పింగళి వారి సంభాషణలు ఇంకో ఎత్తు. ‘ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే’ లాంటి పింగళి వారి పలుకులు సామెతల స్థాయికి వెళ్ళిపోయాయంటే అతిశయోక్తి కాదు.

సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతానికి ఘంటసాల గాత్రం లేని లోటును ఏ ఎం రాజా బాగానే తీర్చారు. ‘ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే’, ‘కావాలంటే ఇస్తాలే’, ‘రావోయి చందమామ’ లాంటి పాటలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తాయి.. విన సొంపైన ‘రాగసుధారసా’ అనే త్యాగరాయ కృతి కూడా ఉందిందులో.

ఎస్వీరంగారావు గారి నటన కూడా అద్భుతం. ఆయన, ఆయన భార్యగా వేసిన ఋష్యేంద్రమణి మధ్య సాగే సంభాషణలు చాల నవ్వుని తెప్పిస్తాయి. మచ్చుకకి ‘ఏమోయ్, అమ్మాయిని చూస్తూంటే తప్పిపోయిన మన మహాలక్ష్మి గుర్తుకొచ్చింది. నన్ను ఫాదర్ అని కూడా అంది’ అని ఆయనంటే ఆవిడ ‘ఫాదర్ అంటే?’ అని అడగడం.

ఇంకా ‘మీకు మీరే మాకు మేమే’ అనే పాటను నాగేశ్వరరావు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, జమున ఎన్టీఆర్ లని చూసిన ఉడుకుమోత మిస్సమ్మ, ఇలా నవ్వు తెప్పించే సంభాషణలు విషయాలు చెప్పుకుంటూ పోతే మొత్తం చిత్రాన్నంతా కవర్ చేసేయచ్చు.. అందుకనే ఇక్కడ ఆపుతాను.

మిస్సమ్మలో మీకు నచ్చినది ఏమిటి?

20 comments:

చదువరి said...

పాడుకోడానికి వీలుగా, లయబద్ధంగా ఉన్నాయి

Unknown said...

పద్యాలు చాలా బాగున్నాయి. కానీ మిస్సమ్మ కేవీరెడ్డిది కాదే? మిస్సమ్మ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ కదా?

Anonymous said...

ఈ సినిమాకు కథ-మాటలు చక్రపాణి కాబట్టి చివరి పాదాన్ని ఇలా మార్చొచ్చు: "మిస్సు చేయకు చక్రపాణిది, వీర నవ్వుల విడ్డురం".

రానారె said...

మత్తకోకిలలు భలే ఉన్నాయండి పాటల్లాగ. ఈ రెండు పద్యాలూ చూస్తూంటే మీరు పద్య రూపకాలే రాయగలరు అనిపిస్త్తోంది. చిన్న సందేహం - రెండవపద్యం రెండవ పాటంలో 'వేసిరిద్దరును వేషధారణ' అని రాసారు కదా, 'ను' అవసరమా!? అని. మిస్సమ్మ సినిమాలో నాకు నచ్చనిది ఏదీ లేదు. ప్రత్యేకించి మిస్సమ్మలో నాకు నచ్చినది - ఆమె ఆత్మాభిమానం. పరిస్తితి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఎలాగైనా గౌరవంగా నెట్టుకురావాలనే పోరాటస్ఫూర్తి అంత చిన్నవయసులో అలవడటం నాకు బాగా నచ్చిన విషయం.

Anonymous said...

బాగున్నాయండీ.
-ఊకదంపుడు

Anonymous said...

అబ్బో, కోకిలల్ని కూడ కూయించగలరనమాట మీరు. భేష్!

కొత్త పాళీ said...

1. గిరివరా, తమరింక తమబ్లాగునామాన్ని తెలుగులో తప్పటడుగులు తీసేసి "పద్యాల పరుగు పందే"లనో, "వృత్తాల ఆవృత్తా"లనో పెట్టాలి.
2. రానారె వ్యాఖ్యలో తనకి నచ్చిన పాయింటు నాకూ నచ్చింది. సావిత్రి పాత్ర వయసు ఆ సినిమా కథలో ఇరవై! ఆ వయసుకే అట్లాంటి ఆత్మగౌరవం కలిగి ఉండటం గొప్పవిషయమే. పద్యంలో "ను" అక్కర్లేదని నాక్కూడా అనిపించింది.
3. మాయా బజారు తరవాత నిర్మాణంలో ఎక్కడా ఎత్తి చూపటానికి లేని తెలుగు సినిమా ఇది అని నా ఉద్దేశం. ఐనా .. రెండు తప్పులు (more like goofs) కనిపించాయి నాకు .. మీక్కూడా ఏవన్నా కనిపించాయా??

గిరి Giri said...

చదువరి గారు,
మత్తకోకిల నడక పాటలకు బాగా నప్పుతుంది...ఉదాహరణకి ‘ఆలసించక జాగుచేయక ఆదుకోవగ రావయా!’ లాగ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.

సుగాత్రి గారు,
మీరన్నది కరక్టే. నాదగ్గర ఉన్న తొంభైతొమ్మిది రూపాయల షాలిమార్ విసిడి వాడు కెవిరెడ్డి అని కవర్ మీద రాస్తే అది నమ్మి అలాగే రాసేసాను. రాసేటప్పుడు కూడా ఒక చిన్న నక్షత్రం చుక్క పెట్టి “మీకు కావాలంటే నాగిరెడ్డిది, చక్రపాణిది లేక పింగళికృత’ అని పెట్టుకోమని రాద్దామనుకుని మర్చిపోయా. తర్వాత గమనించా చివరి పాదంలో “స్స” వల్ల ప్రాస కుదరదని. అందుకని చివరి పాదాన్ని పేర్లు అవసరం లేకుండా మార్చాను. చూడండి.

రానారె గారు,
మీరన్నది సరైనదే. ఒక ‘ను’ తప్పుగా పడింది, తీసేసాను. “మత్తకోకిల మత్తకోకిల మత్తకోకిల కోకిల” లాగ సాగిపోయే ఈ వృత్తం మీరుకూడా ప్రయత్నించండి. ఈపాటికే మీరు కూనలమ్మ లాంటి గూగులమ్మలు రాసేస్తున్నారు, అక్కడా లయబధ్ధ నడకకి ప్రాధాన్యతని ఇస్తున్నారు కదా, ఇక్కడా అంతే, ఏమంటారు?
ఇక సినిమా విషయానికొస్తే సావిత్రి పాత్రకి ఉన్న ఆత్మాభిమానం గొప్పదే.

ఊకదంపుడుగారు, వికటకవి గారు,
నెనరులు.

కొత్తపాళీ గారు,
కొత్త పిచ్చికి పొద్దెరగని తరహాలో ఏదో రాసేస్తున్నాను. మీరు చెప్పిన పేరు మార్పులు చేయాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి.

మిస్సమ్మలో నాకు ఏవీ తప్పులు కనిపించలేదు, క్లూ ఇస్తే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను.

రానారె said...

కొత్తపాళిగారు, ఇప్పుడప్పుడే చెప్పకండి దయచేసి. నేను మళ్లీ ఒకసారి సినిమా చూస్తా. తప్పులు పట్టగలనేమో చూద్దాం.

రానారె said...

వీసమైనను వాసి తగ్గని వీర నవ్వుల విడ్డురం... భేష్! ఇప్పుడొస్తున్న సినిమాల స్థాయిని బట్టి చూస్తే మిస్సమ్మ వాసి తగ్గడం కాదుకదా, రోజురోజుకూ పెరిగిపోతోంది.

కొత్త పాళీ said...

ఒకటి చిన్న తప్పు - ఆంగ్లంలో Continuity goof అంటారు. "కరుణించు మేరి మాతా" పాటకి ముందు సీన్లని పరిశీలించండి.

రెండోది (నా దృష్టిలో) బాగానే పెద్ద తప్పు, కథా మర్యాదకి, పాత్ర ఔచిత్యానికి అడ్డమొచ్చే తప్పు. ఎంతో వివేకంతో కథని అల్లే చక్కన్నగారూ, బహు నేర్పుతో సినిమా నిర్మించే ఎల్వీ ప్రసాద్ గారూ ఈ తప్పు అలా వదిలెయ్యడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. క్లూ: ఈ తప్పు సావిత్రి పాత్రకి సంబంధించినది.

Sriram said...

మత్తకోకిలలు బాగా కూసాయి. మంచి వ్యాసం. ఈ సినిమాలో నాకు నచ్చనిది ఏమీ లేదు :)

Anonymous said...

కొత్తపాళీ గారు,

"శ్రీజానకీదేవి శ్రీమంతమనరె" - పాట తరువాత నాయికా నాయకులను నిద్ర చేయమనటం?

గిరి Giri said...

కొత్తపాళీ గారు,
పెద్ద తప్పుగురించి నా ఊహాగానం: సావిత్రిది ఎంతో ఆత్మాభిమానము, కవ్విక్షన్సు ఉన్న పాత్ర; అలాంటిది గబుక్కున చివరకు (పది నిముషాల పరిధిలో) మనసు మార్చుకుని మహాలక్ష్మి ఐపోవడం ఔచిత్యమా?

చిన్నతప్పు: నేను పట్టుకోలేకపోయానండి. మిగతా వారికి వ్యవధినిచ్చి ఆ తరువాత మేరే చెప్పండి

Murali Nandula said...

సావిత్రి పాత్రను పరిచయం చేస్తూ, "... సదాశివ మయమగు నాదోంకారత్రయ..." అని త్యాగరాజ కృతి పాడించి, తరువాత "ఏమో నాకు మటుకు మా ఏసుక్రీస్తుమీదే నమ్మకం.", "పిచ్చి ఆచారాలు, పిచ్చి నమ్మకాలు" అని అనిపించటం?

Nagaraju Pappu said...

నాకేమో మిస్సమ్మలో సావిత్రి వయసుగురించి పెద్ద అనుమానం - ఎలా కూడినా ఆవిడకి కనీసం ఇరవైరెండు సంవత్సరాలు ఉండాలి అనిపించేది, కాని సినిమాలో లెక్కల ప్రకారం ఆవిడ వయసు ఇరవై (తప్పిపోయి పదహారు ఏళ్లైంది, తప్పిపోయినప్పుడు నాలుగు సంవత్సరాలు). కాని, ఆరు సంవత్సరాలప్పుడు స్కూల్లో జాయినయితే, డిగ్రీ పూర్తయ్యేటప్పటికి ఇరవైఒకటి, మధ్యలో ఒక సంవత్సరం రకరకాల ఉధ్యోగాలు చేసింది కదా?
ఒకవేళ ఈవిడకి డబుల్ ప్రమోషన్లతో ముందుగానే చదువు పూర్తి చేసేసెందనుకొన్నా, సావిత్రి వయసు ఇరవై అయితే, జమున వయసు పదిహేనుకి మించి ఉండకుడదు (సావిత్రి తప్పిపోయినప్పటికి జమునింకా పుట్టలేదు కదా) -- కాని అది కూడా నప్పదు.

విజయావారి సినిమాల్లో ఇంకో ప్రత్యేకత ఉంది - ప్రతీసినిమాలోనూ ఎవరో ఒక పెద్ద నటుడుకాని, నటి కాని ఉండరు. మాయాబజార్ లో జమున లేదు, గుండమ్మ కథలో రేలంగి లేడు. మిస్సమ్మలో మిస్సైయింది ఎవరు?

కొత్త పాళీ said...

పాత్ర ఔచిత్యానికి భంగం కలిగించే తప్పు మురళిగారు చెప్పిందే. అంత క్రీస్తునే నమ్మిన పిల్ల కర్ణాటక సంగీతం ఎలా నేర్చుకుంది అసలు? దీనికి మరి కొన్ని చిలవలు పలవలు ఉన్నై .. రామారావుని గురించి జమున సావిత్రి చెరోచెయ్యీ పట్టుకుని లాగినప్పుడు రేలంగి "రుక్మిణి సత్యభామ" అంటే, సావిత్రి "ఎవరండీ వాళ్ళు?" అనడం, సీమంతం అంటే తెలియక పోవడం .. ఇత్యాది.
చిన్న తప్పు వచ్చే వారం చెబుతాను - ఈ లోపల మీ ప్రయత్నాలు చెయ్యండి :-)

నాగరాజుగారు ఎక్కడికీ ఊరకరారు, ఏదో ఒక పితలాటకం పెడతారు. ఉన్నవాళ్ళనైతే ఎలాగో పట్టుకోవచ్చుగానీ లేనివాళ్ళని పట్టుకోవటమెలా మహానుభావా? :-)

రానారె said...

1. మేరి కాలి బొటనవేలిపై పుట్టుమచ్చను గురించి డిటెక్టివ్ రాజు దేవయ్యను అడుగుతాడు. స్వయంగా ఆరాతీయ ప్రయత్నిస్తాడుగానీ తన అత్తయ్యనుగానీ మరదలు సీతాలక్ష్మినిగానీ మాత్రం సాయం అడగడు.

2. లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా జమీందారుగారు మేరిని పిలిచి, భోజనం పెట్టకుండా పంపుతారు. ఇంటికొచ్చి 'నలభీమపాకం' రుచిచూడాల్సొస్తుంది.

ఇలా తప్పులు వెతకడం కోసమే ఇందాకటినుంచీ మిస్సమ్మ సినిమా చూస్తున్నాను. చాలా చేదు అనుభవం. :(

రానారె said...

నాగరాజుగారి ప్రశ్నకు సమాధానం - సూర్యకాంతం. మాయాబజార్, గుండమ్మకథల్లో ఉన్నారుగానీ మిస్సమ్మలో మిస్సయ్యారు.

Anonymous said...

Missamma lo tappu inkotundi. puttinarojuna pilichi alankaram chestaru. missamma intikocchi addamlo choosukuni visukkuntunte ramarao vacchi accham mahalaxmi laga unnaru ante laxmi kadu shakti la unnanu antundi. ade missamma satyabhama, rukminilu evaru ani adugutundi.