Saturday, April 26, 2008

మనమా..

రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన మరో సమస్యకి నా పూరణలివిగో.

మొదటిది

మ. మన కో ఒద్దికనేది లేదనికదా, మర్యాదగా చాలుచా
లని దూరమ్ముగ నుండిపోతిమిటు, దూరాలింత ఏకాంత చిం
తను ప్రేమాతిశయమ్ము చేయ, వినదే నా గుండె నామాటనే,
“మనమా వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా”

రెండవది


మ. సినిమా పాటలదో అథోగతి సుమా, ఛీకొట్టి చెండాడనా?
“గుణమేలేని ఇలాంటి రొంపిన పడినా, గోలెందుకోయంచు యే
మనమా?” వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా
యననా, భాషను చంపుతున్న కవులూ, ఆగండి, యన్జెప్పనా?

Saturday, April 19, 2008

రామ పదాబ్జముల్

రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన సమస్యకి నా పూరణ ఇదిగో - రావణుడికి హనుమంతుని హితబోధ ఇది.


శా. కామాగ్నుల్ హరియించి పోవు తృటిలో, కైంకర్య మందేనురా,
రా, మాయమ్మను భక్తితత్పరుడవై రామయ్యకందించగా
రా, మా రామ పదాబ్జముల్ కొలువరారా, కీర్తి మిన్నందురా
నీ మాన్యంబిక లోకమందు వెలుగున్ దేదీప్యమానంబుగా

Thursday, April 10, 2008

పొలో!

ఈ వారం పని మర్చిపోయి, సరదా ఎంజాయిమెంట్లో పడే
పోవాలంటు, మరేమి బాధ్యతల బర్వూ లేని స్వేఛ్ఛాయువే
కావాలంటు, యధేఛ్చగా తిరుగుతూ కాలం వృధా చేస్కునే
ఆవారా పనిలో పడాలనుకునే, అయ్యాను సిధ్ధం! పొలో!!


వచ్చే వారమంతా నేను హైదరాబాదులోనే ఉంటాను. ఈ మధ్య పెరిగిన పని వత్తిడి నుంచి కొంత విముక్తి కూడా - వీలు దొరికినప్పుడు విశాలాంధ్రాకి వెళ్ళి మంచి పుస్తకాలు కొన్ని కొనుక్కోవాలని అనుకుంటున్నాను, అంతకు మించి ఇంకేమీ పనులు పెట్టుకో దలచు కోలేదు. ఎవరైనా బ్లాగ్మిత్రులు ఈ సమయంలో సమావేశాలేవైనా పెట్టుకోవాలనుకుంటుంటే తెలియజేయమని మనవి. రావడానికి తప్పక ప్రయత్నిస్తాను.