Monday, December 29, 2008
Madagascar 2
గఱువ చారల-తురగమ్ము ‘మార్టి’
మృదు మెతక జిరాఫు, ‘మెల్మాను’ యనువాడు
‘గ్లోరి యా’ను నీటిగుఱ్ఱ మొకతె
వీరి గాధలేను వేరుకథలు గావు
మీకు చెప్పుచుంటి నేక బిగిన
Sunday, December 28, 2008
సెక్యులరిజము సొల్లు
(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)
హైందవ పండితులం దండితుల జేసి,
తరిమికొట్టుట పెద్ద తప్పుకాదు
దేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,
దాడుల గూల్చిన తప్పులేదు
ఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,
పెచ్చరిల్లుట కాదు పెద్ద మాట
మతఛాందసుల వల్ల మనతల్లి భారతి,
తల్లడిల్లిన పెద్ద తంతు కాదు
'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుట
శాంతి భద్రతలకు చావుదెబ్బ'
సెక్యులరిజమంచు
చెల్లు కబురులు గార్చు
మతపక్షపాత భ్రమణమతులు
ప్రజకు హక్కులంచు,
ప్రగతి పథములంచు
ఎన్నికలను దెచ్చి,
ఎన్నొ కలలు చూపి,
ప్రజల కోర్కె చూచి,
ప్లేటులు ఫిరాయించి
తిక్క మాటలెంచిరేల?
ఉగ్రవాదం పెరగడం కాదు, ఎన్నికలలో మందంజ వేసిన పార్టి వల్ల భయపడాలనేది ఆజాద్ సొల్లు వాగుడు. ఏంటో ఈ గోల?!
Friday, December 26, 2008
Oye Lucky! Lucky Oye!
సొంతము కాదని చూసుకోడు
మెచ్చిన వస్తువు నచ్చినరీతిన
చంకనవేసుకు జారుతాడు
బాకులు కత్తులు పట్టని చోరుడు,
మాయలు నేర్చిన మాటకారి
తీయని తేనెల మాయల మాటల
మూటలు మోసిన మోసగాడు
ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ
బూటకాల నల్లు ఆటగాడు
రెప్పపాటులోపె తప్పుకు పోతాడు
హుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’
వివరాలు ఇక్కడ చదవండి.
Saturday, December 13, 2008
Rab ne bana di jodi
కం. నిచ్చెనిదే స్వర్గానికి
తెచ్చితినోయ్ చూడమంటు తెర చూపంగా
అచ్చెరువొందిన సుజనులు
వచ్చిరి తచ్చన తెలియక పరువిడి వడిగా
కం. మురిపెము ముచ్చట మీరగ
బిరబిర మూగిన జనమిక బిమ్మిటిగొనగా
అరచేతిలోని స్వర్గము
తెరకెక్కదనే నిజమ్ము తెలిసెను తొరగా
వివరాల కోసం ఇక్కడ నొక్కండి త్వరగా
Sunday, October 12, 2008
ఏడాది నిండింది
నేను చూస్తున్న చిత్రాలను గూర్చి వ్రాసిన మొదటి ఉత్పలమాల తరువాత, అమెరికాలో నా కారు నడపడం ఓ కొత్త మలుపున పడిందనే చెప్పచ్చు - సాధారణంగా ఎన్పీఆర్ లేక పాత తెలుగు పాటలు వినేవాణ్ణి పద్యాలల్లడంలోనే గడపడం ప్రారంభించాను. అక్టోబరు, నవంబరు నెలల్లో వీలు దొరికినప్పుడల్లా, మనసుకి నచ్చిన విషయం అందినప్పుడల్లా పద్యాలు కూర్చడానికి ప్రయత్నాలే. ఉల్లాసంగా దొర్లిపోయిన కాల మది.
ఆ ప్రవాహం సింగపూరుకి చేరిన కొత్తలో కొంచెం కుంటువడినా ఇప్పుడు మళ్ళీ వ్రాయడానికి ఉత్సాహం, అవకాశాలు, వ్రాయగలనన్న నమ్మకం ముప్పిరిగొన్నాయి. ఈ సమయంలోనే రెండు అభినవ భువనవిజయంలో పాల్గొనడానికి అవకాశమిచ్చి నా ఉత్సాహానికి ప్రోత్సాహాన్ని అందజేసిన పొద్దు సంపాదకవర్గానికి నా కృతజ్ఞతలు.
నేను వ్రాసిన పద్యాలను మెచ్చుకుని, తప్పులుంటే నిర్మొహమాటంగా తెలిపి కొత్త విషయాలు తెలిపిన బ్లాగ్మిత్రులైన - కొత్తపాళీ గారు, వాగ్విలాసం రాఘవ (కొన్ని టపా వ్యాఖ్యల్లో రాఘవతో ఆడిన గొలుసు వృత్తాల ఆటలు నాకిప్పటికీ గురుతే.), వికటకవి, చదువరి, రానారె, శ్రీరాం, రాకేశ్వర రావు, ఊదం, బ్లాగేశ్వరుడు -వీరందరికీ వేవేల నెనరులు.
పదేళ్ళ పాటు, ముందు పైచదువుల వలన అటుపై వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశం బయట నివసించడం వల్ల - ఇంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు తప్ప- తెలుగులో సంభాషించే అవకాశాలు లేక, నెమ్మదిగా తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోయిన నాలో స్వభాషాభిమానాకి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులే చెందుతుంది. వీరికి నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు.
నేను మొదట నేర్చుకున్న ఛందస్సులో తప్పులు ఈ మధ్యనే అవగత మయ్యాయి. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, భైరవభట్ల కామేశ్వర రావుగారు, చింతా రామకృష్ణారావు గారు - ముఖ్యంగా ఈ మువ్వురి చలువవల్ల నాకు కొత్త విషయాలు నేర్చుకుని, తప్పులని సరిదిద్దుకునే అవకాశం లభించింది. వీరికి నా వందనాలు.
ఇక వీలు దొరికినప్పుడు పూర్వం వ్రాసిన పద్యాలలో దొర్లిన తప్పొప్పులను సరి దిద్దాలనుకుంటున్నాను.
ప్రస్తుతానికి నేను వ్రాసిన వాటిల్లో నాకు కొద్దో గొప్పో సంతృప్తినిచ్చిన పద్యాల లంకెలివిగో.
౧. గణాధిపతి కి నమస్సుమాంజలులు
౨. మిస్సమ్మకు మత్తకోకిలలు
౩. గుండమ్మకి సీసాలు
౪. మాగీకో మాల
౫. తేట తెలుగు పలుకు
౬. పదహారు పాదాల అప్పుల తిప్పల ఉత్పలమాల
౭. పదహారు పాదాల బీ మూవి మత్తకోకిల
౮. మా లెక్కల మాస్టారికి చంపకమాలాంజలి
౯. ఒబామకి ఆంగ్ల వృత్తం
Tuesday, September 30, 2008
గూగుల్ వార్తలు
కడు గర్మాగరమైన* వార్తలను సౌకర్యమ్ముగా సేకరిం
చెడి గూగుల్ మన భాషలో విడుదలై శ్రీకారమీరోజునే
చుడితే వార్తల గూటికై, భళిభళీ చూడండనే గోల చే
యడమే నా పని, బాగుబాగనుచు సాయంచేయడం మీ పనీ
गरमा गरम
Saturday, September 13, 2008
జన్మ నక్షత్రము
సత్ప్రవరంపు* జనుమం బ్రసాదించుం దా
తత్ప్రవృతులం* బ్రవృధ్ధిం
చిత్ప్రౌఢిమ లొసగు రిక్క* సిరుల ధనిష్ఠా
సత్ప్రవరము - మంచి గుణము గల
ప్రవృతులు - వరము పొందిన వారు
రిక్క - నక్షత్రము
Saturday, September 06, 2008
కత్రినా కోశి
కత్రినా యుప్పెన కట్టలు ద్రెంచుచు
క్రౌంచ భూమండలి ముంచిదేల్చి
చెప్పిన గుణపాఠ మిప్పటికి గురుతే
కనుకనే గుస్తావు కనకరించె
తొల్లి తల్లడివడె తల్లి మన భరతా
వని వెల్లువల వెల్లి* వాతబడుచు
గురుతుండ వివిగాన గుడ్డిమాలోకాన
కడివోయె* కోశి శోకములుదెచ్చి
ముందు దెబ్బమోది నుడువ* మొగ్గుజూపు
దండ భేద నీతుల నమ్మియుండు గండ
కొన్ని కయ్యాల కొనిదెచ్చుకొన్న జార్జి
బుస్సుమంటు పైకురికెడి బూచిగాడు
మిగుల నపకీర్తి నార్జింప దగిన వాడె
ముందు తాజేసిన తలతిక్క దిగువాయి
పనుల సరిదిద్దె బగ్గీజి* పట్టణంపు
ప్రజకు జతగ నిల్చె వరదబాధ బాపి
ఈ సారి గుస్తావు నేలతాకక మునుపే (ఫీమాతో సహా) అందరినీ సమాయత్తం చేసి సిధ్ధంగా ఉంచాడు జార్జి బుష్షు. హోంవర్కు చేసుకొచ్చిన వాడి పుస్తకం మాస్టారు తనిఖీ చేయనట్టు, గుస్తావు వీరి సంసిధ్ధతని పరిక్షించలేదు. మనవాళ్ళు ఇలాగ హోంవర్కు చేసి ఎన్నాళ్ళయ్యిందో - ఇంకా ఎన్నాళ్ళు పకృతి మేష్టారి దెబ్బలు తినాలో?
లాలు లాలూచిగాడని ఱాలు ఱువ్వు
చేతగాని వాడని గ్రుచ్చిచెప్పు నిశిత
బుద్దిశాలి నితిశుడేమి బొడిచె నీట
మునుగుచుండ బీహారి యూళ్ళు నగరములు
నితిశ్ సంగతి అటుంచితే, మన మన్మోహను డేమి ఒలక బెట్టాడు?
ఒకానొకప్పుడు,
విత్తపు మంత్రి పదవియం
దుత్తముడు ప్రగతికి దోహదుండయి గమనం
బత్తమిలకుండ సతతం
బుత్తలపడువాడు సత్తముండయి జనియెన్
తదనంతరము,
సాటియె లేడెవ్వడతని
పాటికి రాడెవ్వడనుచు పాటవమున నా
రాటము మీఱగ పీఠం
బేటలు వేయక* నొసగుటె బీజంబయ్యెన్
ఠక్కున నిర్ణయాలు తీసుకోలేని ఓ తోలుబొమ్మ దేశానికి ప్రధాని అయి కూర్చుని యుండడానికి.
నోట నాలిక లేదయె వేటికైన
సోనియా తల్లి దీవెనలైన లేని
పనుల ముట్టని మన ప్రధాని నిమిషాల
మీద నిర్ణయా లెటుల తర్ఫీదు చేయు?
వెల్లి: పరంపర
కడివోయె : చెడ్డదయ్యెను
నుడువ : మాటలాడ
బిగ్గీజి : బిగ్ ఈజి, కొత్తార్లియన్సుకి మారు పేరు
ఏటలు చేయక: గొడవ చేయకుండా
Twinkle twinkle little star
మినుకు మినకను చిఱు తార
మింటిన నిను కనుగొని యెపుడు
ఎవ్వరీ ఘన మణిమయమై
వెలుగుల గనియని మైమరపు
మినుకు మినుకను చిఱు తార..
మినుకు మినుకు తార..
తే.గీ. మినుగు మినగను చిఱుతార మింటిన నిను
కనుగొని యెపుడు ఎవ్వరీ ఘన మణిమయ
మై వెలుగుల గనియని మైమరపు మినుగు
మినుగను చిఱుతార మినుగు మినుగు తార
Tuesday, September 02, 2008
పప్పులో బ్రిస్టల్ కాలు
కాలుని పట్టుకుని జాన్మెకైనుని కుమ్మే
య్యాలని కుత్సిత మొద్దని
తాలిమి విలువని తెలిపిన స్థైర్యమొ బామా