Monday, November 19, 2007

Bee Movie

నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు తేనెనెంత "రుచికరంగా" చూపించారంటే చూస్తున్నంతసేపూ ఇంటికి రాగానే ఒక చుక్క నాకితీరాలిరా బాబు అనిపించింది). కొన్ని చోట్ల సైన్ ఫెల్డ్ మార్కు జోకులు పేలాయి. కాని చిక్కల్లా అలాంటి సందర్భాలు ఎక్కువలేకపోవడమే. తమ తేనెనంతా భుక్కుతున్నారని కోపంతో మనుషులపై దావావేసి నెగ్గే ఒక తేనెటీగ కధే ఈ చిత్రం. నిలు గీతలా సూటిగా, ఎక్కడా మలుపులు లేకుండా, సాగిపోతుంది కధనం ఆసాంతం. చిన్న పిల్లలుంటే వాళ్లని తీసుకెళ్ళచ్చు. థియేటర్లో చప్పట్ల జోరంతా వారిదే.

బీ మూవీ మీద పదహారు పాదాల మత్తకోకిలిదిగో..

మ.కొ. తీయతీయని తేనెపట్టుల తేనెటీగలు ఏకమై
“ఓయి మానవ, తేనెచౌర్యము ఒప్పబోమిక మేము, కా
దోయి భావ్యము, చిన్నవారల దోచి పీల్చుట పిప్పిగా
మాయచేసితివెన్నొ మారులు, మాకు చెందిన తేనెలే
వాయువేగమె వట్టిదౌవిధి వాయినాలుగ మెక్కుతూ
కాయకష్టము చేయువారము కయ్యమాడము వట్టిగా
హాయిహాయిగ బానిసత్వపు ఆటపాటల తేలుతూ
రేయిపొద్దులు రాణికోసమె లేచిసాగుటె మాపనోయ్
చేయి సాయము చేయగల్గిన జిత్తుసేతలు మానుకో
సాయమందుచు మమ్ములీగతి చౌకబారుగ చూస్తివే
రాయి రప్పలు తప్పనిల్వవురా, మరెక్కడ భూమిపై
చేయమంటిమ పాలినేషను చెట్టుచేమలే మాయమై
ఓయి మానవ, కోర్టు కేసని, ఉత్తిమాటలు మానవోయ్
మాయమాటల లాయరాటలు మాకు రావని నమ్మకం
మాయమవ్వగ మీకుతెల్వగ వాగ్వివాదము చేసెదం”
తీయమాటలు మాని పల్కెను, తిట్లవర్షము గుప్పుతూ

5 comments:

బ్లాగేశ్వరుడు said...

మేష్టారు ఏమిటీ స్పీడు
ఇంట్లో మీరు వచనాలు మాని పద్యాలతో మాట్లాడుతున్నారా?

రాటా-టూ-ఇ చూశారా???

గిరి Giri said...

బ్లాగేశ్వరా, Ratatouille చూశాను - కాని అంతగా నచ్చలేదు..ఇది చదవండి

బ్లాగేశ్వరుడు said...

ఇంకొద్దిగా కరుణా రసము జోడీంచవలసినది మత్తకోకిలకు

Spandana said...

చాలా బాగా వ్రాసారు. తెలుగు ఛందస్సు చదివి 15 సంవత్సరాలు అయినా, మొన్న మొన్ననే శ్రీ శ్రీ "మహా ప్రస్థానం" చదివే అవకాసం దొరికింది. అయా తరువాత జయప్రభ/ పీ వీ నరసింహ రావు గార్ల "Unforseen Affection and Other Love Poems" చదివిన తరువాత మల్లి తెలుగు మీద అభిమానం తిరిగింది. మీ పద్యాలూ చదివి చాల తృప్తి కలిగింది. చాల Thanks.

గిరి Giri said...

బ్లాగేశ్వరా, ఇదివరకే చెప్పానుగా, కొత్త పిచ్చికి పొద్దెరగని రీతి ఇదని. కరుణరసమా? ఎందుకు?

స్పందన/వేలిచాయ్, Thanks. మీ "మళ్ళీ, అవకాశం" పదాలలో వర్ణక్రమ దోషాలు దొర్లాయండి :)