సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము
పెంకిదయ్యెనది ఆ పెంపకాన
సవతి కూతిరినెల్ల సాధింప వేధింప
పనిమంతురాలయ్యె పసితనాన
గారాల పట్టికి మారాజు కావలె
ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు
సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ
ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ
ఆ. వె. అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు
వరుల వేటజేయబట్టె తానె,
మగని తోడులేని బండమ్మ, గుండమ్మ
అన్న గారి సాయమందు కొంచు
కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే..
ఆ. వె. పైకి మంచి వాడె మంచి మాటలు పల్కి
బుట్టలోన వేసి బురిడి కొట్టి
చెల్లి ఆస్తి నెల్ల గుల్లచేయు పధక
మ్ముల మునిగిన మేక తోలు నక్క
పాపం నలిగిపోయేది అణిగిమణిగి ఉండే సవతి కూతురు..ఇంతలో, ఆమె కష్టాలని తీర్చడానికే వచ్చారా అనే విధంగా..
సీ. గుండమ్మ నేర్వగ గుణపాఠమొక్కటి
చెప్పుటే ధ్యేయమై చెంత చేరి
రామలక్ష్మణుల తలపులకు దెచ్చుని
ద్దరు సహోదరులు పన్నిరి కలిసి చ
తుర ఛలము, ధనవంతుడొకడయెను పని
వాడుగనొకడు, భామల మనసుల
దోచిరి, అణచవలసిన గర్వములణ
చిరి, మంచివారకు చేసి మేలు
తే. గీ. తలచుకున్న కార్యముల సఫలము చేసి;
కొడయి బృందావనముల గొడవ లేక
ప్రేమయాత్రలు వలచిన భామల చెంత
హాయి హాయిగా చేయ సుఖదాయకమయె.
ఇదీ గుండమ్మ కధ. విడుదలై ఎభై ఏళ్ళు కావస్తున్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే తీరుగా ఉండి, తరతరాల..
తే. గీ. ఆంధ్ర ప్రేక్షకాదరణలనందుకొన్న,
ఆణిముత్యమాద్యంతమాహ్లాదమొలుకు,
విజయవారి, వెండితెరకు వెలుగునొసగు,
డాగులన్నవి లేని, గుండమ్మ గాధ
అందుచేత తెరమీద చూడడానికైనా లేక డీవీడీ కొని చూసినా, ఖర్చుపెట్టిన
ఉ. సొమ్ము వసూలె కాక (మనసొప్పగ తీరిచిదిద్దగా కధాం
శమ్ము భలే తయారయి పసందగు హాస్యపు చిత్రమయ్యె గుం
డమ్మ కధావిశేషము. బడాయి లడాయిల నవ్వు పువ్వులా
కమ్మటి ఆటపాటల సుఖాంతము) లాభము ముట్టు బేరమే.
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
టోపీలు తీసి విసిరి పారేశాం. భేషో భేష్! పద్యఖండికలకు శుభారంభమే చేశారు. మొదటి సీసపద్యం అన్నింటికన్నా బాగా వుంది. మొదటి ఆటవెలదిలో పెళ్లికొచ్చినట్టి బదులుగా యీడుకొచ్చినట్టి అంటే ఇంకా అర్థవంతంగా వుంటుందేమో కదా! మధ్యలో వచనం చేర్చి దీన్నొక బుఱ్ఱకథలాగా పాడుకునేట్లు చేశారు. మొదటి తేటగీతి "ప్రేమయాత్రలకు, ఎంత హాయి" పాటలను గుర్తుచేసింది. "రామాయణం పాడినా విన్నా పుణ్యం వస్తుంది" అని కథా కాలక్షేపం చివర్లో చెప్పినట్లు ముగించడం దివ్యంగా వుంది. అభినందనలు. రాస్తూనే వుండండి నిరంతర పద్య స్రవంతి. :)
తమరు ఉత్త గిరి కాదు స్వామీ పద్యగిరి! పద్యాల్ని అలా పూయించి కాయించండి. పద్యగిరుల్ని దర్సిస్తూ ఆ పద్యఫలాలు ఆస్వాదిస్తూ ఉంటాం.
అదేంటో చిత్రం చదువుతున్నంతసేపూ నా మనసులో మెదిలిన మాటలన్నీ రానారె రాసేశాడు!
గిరీ - చాలా బాగా రాశారు.
వావ్ గిరి గారు అదరగొట్టుతున్నారు. చాలా బాగున్నాయి సీస పద్యాలు నిజంగా హైలేట్ చాలా అద్భుతుంగా వ్రాశారు. నేను మీ పద్యం చదివిన వేంటనే నిలబడ్డాను.
గిరి గారూ
బ్రహ్మాండంగా ఉన్నాయి.. గో ఎహెడ్
రానారె గారు, చాలా సంతోషం.
'ఈడుకొచ్చినట్టి' అంటే సహజంగా ఉంటుంది నిజమే - అయినా నేను మరో విధంగా మార్చాను, చూడండి.
వికటకవి గారు, కొత్తపాళీ గారు, బ్లాగేశ్వరా, కృష్ణమోహన్ గారు, ధన్యవాదాలు.
గిరి గారు,
చాలా బాగున్నాయి.చాలా వేగంగా, చాలా హృద్యంగా రాస్తున్నారు.
టోపీలు తీశాం.
గిరి గారు ,
చిన్న సందేహం
"మ్ముల మునిగిన మేక తోలు నక్క"
అంటే యతి గిట్టినట్టే నా?
ఊకదంపుడు గారు,
గీతపద్యాలలో ప్రాసయతి చెల్లుతుంది, అందువల్ల మీరు సూచించిన పాదము (దాని పై పాదానికి కూడా)యతి సరిపోయినట్లే.
గిరి
Post a Comment