Tuesday, November 06, 2007

అప్పుల తిప్పలు

నిన్న రాయడానికి ఏదీ తట్టక, రాయాలను కోరిక చావక

మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా
పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో
ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే
మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ

(* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి)

అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు,
మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి దెబ్బ వల్లే ఆయన కంపెనీకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఆయనెలాగూ మంచి డబ్బుమూటతోనే బయటకి వెళ్తాడు, మరి అప్పుల ఊబిలో చిక్కుకున్నవారి గతి ఏమిటి పాపం అని ఆలోచిస్తుండగా...

వారికి ఏమీ ఇవ్వలేను, పదహారు అణాలు కాకపోయినా కనీసం పదహారు పాదాల పద్యమాల ఇద్దామనిపించి, ఇదిగో ఇది రాసాను.


ఉ. తప్పని కష్టనష్టముల ధాటికి కుప్పగ కూలబడ్డ వా
రెప్పుడు భీతిచెందుచు భరింతురు కట్టడులెట్టివైననూ
అప్పు తనంతతానుగ అయాచితమై జనియించి చేరగా
తప్పునులే ధనార్తియని నమ్మిక పుట్టగ వెర్రివారలై;
అప్పుల ఊబిలోనపడ ఆరడులాగవు ఎంతమాత్రమూ
తప్పుల తుప్పలో తుదకు తప్పని తిప్పల పాలుపడ్డ వా
రప్పుడు నేర్తురెంతటి చిరాకుల చీదరయో ఋణేచ్చకం
చప్పున ఉచ్చులాగునది, జాడ్యము, తెచ్చునదే వినాశనం
తప్పులు తేటతెల్లమవు నాటికి ఆగత కష్టకాలముల్
కుప్పల తెప్పలై పెరిగి గుత్తగ వాలు దివాళ తంతులున్
ముప్పులు ముంచిదెచ్చునిల ముంగిట, ఆస్తులు జప్తులవ్వగా
అప్పుడు కంటినీటి తడి ఆర్పదు మండెడి అప్పుచిచ్చులన్
ఒప్పులు తప్పులున్ తఱచి ఓర్పుగ చూడగ తెల్లమవ్వదా
గొప్పల అప్పుసేతలకు కూలును వడ్డికివడ్డి కూడ, పై
కప్పులు జప్తు వేలముల, కావున చేయకు అప్పులూరికే
చెప్పగనేమిలేదు ఇక చెప్పితినంతయు పద్యరూపమున్

5 comments:

Anonymous said...

"అప్పుడు కంటినీటి తడి ఆర్పదు మండెడి అప్పుచిచ్చులన్"
MaMci abhivyakti.

చదువరి said...

పద్య యజ్ఞం చేస్తున్నారండీ!

బ్లాగేశ్వరుడు said...

పద్యములొ ఒక్క అణా కూడా లేదు. సుమారుగా పదహారు అ'ప్పు'లు ఉన్నాయి.


మీ పద్యాలు ఎనిమిదో తరగతి గద్యవిభాగములొ ఒక పాఠ్యాంశము గుర్తు వస్తోంది.ఆంధ్ర దేసములొ భవభూతి, కాళిదాసు ఒక రహదారి పై వెళ్ళుతూ తాంబూలము వేసుకోవడానికి తమలలు ? వక్క ల కోసము ఒక ఈంటికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని తాంబూలము తెచ్చి పెట్టమంటారు. మొదటగా కాళిదాసు ఒక శ్లోకములొ తాంబూలము తెచ్చి పెట్టమంటాడు., తరువాత భవభూతి మరో శ్లోకము తో తాంబూలము తెచ్చి పెట్టమంటాడు. ఆ అమ్మాయి తరువాత అడిగినా భవభూతికే తాంబూలం మెడట ఇస్తుందిట, కారణము తెలుసా???

గిరి Giri said...

బ్లాగేశ్వరా,
ఏడవ పాదంలో ఒక్క అణా ఉంది..

మీరన్న పాఠం నాకు గుర్తే, శ్లోకాలు గుర్తులేవు..భవభూతి చదివిన శ్లోకంలో ఎక్కువ అణాలవల్లే ఆ 'పదహారణాల' తెలుగమ్మాయి (ఆ కల్పిత) కధలో అలా ప్రవర్తిస్తుంది, కదా?

rākeśvara said...

నిజంగా వావ్.
ఎప్పటినుండో మంచి మత్తకోకిల వినాలని వుండేది. కోరిక తీర్చారు. నేను మత్తకోకిల వ్రాద్దామనుకున్నా గానీ, అంత తేలికగా తట్టలేదు.

మనలో మన మాట. మీకు (మీ కంపెనీ వారికి) quantitative analyst కావలసివస్తే నాకు ఒక వేగు పంపగలరు :)