Thursday, November 01, 2007

Useless comments - తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి

మత్తే. ఎవడో ఓ చెడు దృక్పథం మనసులో ఏ వంకనో పెంపుచే
సి, వశంతప్పెటి రీతి కచ్చి కలిగించే పిచ్చి ప్రేలాపనల్ బ్లాగు వ్యాఖ్యానముల్
-అవతారాన్ని అనామకం ముసుగులాటాడించి- వ్రాయించగా
అవకాశం మనదెప్పుడాయని అవే ఆవేదనల్ చెందుటే

ఆ.వె. నెరుగుదును కనుకనె తెలుపుచుంటిని మీకు
చూసి చూడనట్టు చొప్పదంటు
వేగునెటుల వదిలివేతురో అటులనే
చేయ వాడికదియే చిత్రహింస

చెప్పదలచుకున్నదేమిటయ్యా అంటే, అనవసరపు ప్రేలాపనలు వ్యాఖలుగా వస్తే వాటిని పట్టించుకోకండి. స్పాంని ఎలా పట్టించుకోమో అదే విధంగా ఈ వ్యాఖ్యలని, అనవసరపు టపాలని పట్టించుకోకపోతేనే మేలు.
చెత్త వ్యాఖ్యలు చదివి మనసు పాడుచేసుకోవడమో, ఇక రాయడమే మానేస్తాననడమో చేయనవసరం లేదు. ఏమంటారు?

16 comments:

Unknown said...

విహారి గారు వ్రాసిన ఒక టపాలో వ్యాఖ్యాలను చూసి కుళ్ళుకునే బ్లాగ్మహాశయులు ఉంటారంటే నమ్మలేదు నేను.

teresa said...

takes all kinds of people to make this world! :)

కొత్త పాళీ said...

1. ఇంతకు ముందు తరంలో జాషువా, కరుణశ్రీ ప్రభృతులు, మొన్నీ మధ్య వరకూ ఉత్పల సత్యనారాయణాచార్య వంటి కవులూ సమకాలీన సాంఘిక విషయాల మీద చక్కటి పద్య ఖండికలు రాశారు. గిరీ, మీరు వృత్త ఛందస్సులో దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే ఇదే దారిలో ఇంకో మంచి కవి తయారవుతాడు అనిపిస్తోంది.
2. మొదట్లో శ్రీరాముడు, రానారె, ఆ తరవాత రాకేశ్వరుడు పద్యాల మీద ఉత్సాహం చూపించినప్పుడు "ఎందుకొచ్చిన పద్యాలు, మీరందరూ చక్కటి వచనం రాస్తున్నారు, వైవిధ్యమున్న విషయాల మీద రాస్తున్నారు, అదే కొనసాగించండి" అని ఉచిత సలహా ఇచ్చా. ఐనా వాళ్ళు పద్యాలు రాయడం మానలేదు, కొన్ని మంచి పద్యాలు రాశారు కూడా.
3. ఈ మధ్య ఎదురైన టాపిక్ మీదల్లా ఒకటో రెండో పద్యాల్లో సమర్ధవంతంగా మీరు చేస్తున్న విషయ వ్యక్తీకరణ చూస్తుంటే .. జాషువా ప్రభృతుల శైలిలో మన బ్లాగులనించి ఒక సమకాలీన పద్య ప్రభంజనం పుట్టుకొస్తుందా అని ఒక ఆశగా ఉంది. పద్య రచనలో ఆసక్తి ఉన్నవాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయమే.
4. మీరంతా ఎలాగూ పద్య రచన అంటే ఉత్సాహపడుతున్నారు కాబట్టి ఒక కొత్త ఉచిత సలహా - జాషువా మొదలగు వారు సమకాలీన విషయాల మీద రాసిన ఖండికల్ని అధ్యయనం చెయ్యండి. ఒక విషయాన్ని ఐదు నించి పది పద్యాల్లో ఎలా రాయవచ్చు, ఎలాంటి భావాలకి ఎలాంటి వృత్తాల్ని ఉపయోగించారు - ఇవి గమనించండి. రాసేది కవిత్వం .. కవితాత్మ ఉండాలి. ఛందస్సు కోసం దాన్ని వొదులుకోవద్దు.
ఔత్సాహిక పద్య కవులందరికీ అభినందనలతో ..

రాఘవ said...

ఇది నిజంగా చాలా అమూల్యమైన సందేశం. ఇంకేం... పదండి ముందుకు పదండి త్రోసుకు.

Anonymous said...

5/10

గిరి Giri said...

తెలుగువీరా, మీరంటున్న విహారి గారి టపా ఏదో నాకు తెలియకాని - troublemakers అన్ని చోట్లా ఉంటారు..

సావిత్రి గారు..కొన్ని రకాల వారిని పట్టించుకోకపోవడమే మంచిది.

కొత్తపాళీ గారు,
మీ ఈ వ్యాఖ్యని రానారె, శ్రీరాం, రాకేశ్వరుడు, చదువరి, ఊకదంపుడు గార్లు చదువాలని నా ఆకంక్ష.

మీరు చెప్పినవి చదవడానికి తప్పక ప్రయత్నిస్తాను..పద్యాలు అల్లడమే కాని, కవితా భావం ఇంకా పెరగలేదండి, క్రితం తపాలో మీరు వ్యాఖానించినట్టు అభ్యాసం ఇంకా ఎంతో చేయాలి . మీరు ఉద్దండుల పేర్లు చెప్పుకుపోతుంటే కొంచెం బెరుకు కలుగుతోంది. ప్రోత్సాహానికి ఎంతో కృతజ్ఞుణ్ణి.

రాఘవ గారు "కోటినట్టు" త్రోసుకు పోదాం ముందుకు.

చచు గారు,

నిజం చెప్పాలంటే ఈ పద్యం రాసాక నాకు ఎక్కువ సంతృప్తి కలగలేదు. మొహమాటం లేకుండా ముందుముందు పద్యాలని రేట్ చేయండి. వివరణ వ్యాఖ్యలు రాయగలిగితే ఇంకా మంచిది.

గిరి

Solarflare said...

ఎందుకులెండి, ఇలాంటి సలహా ఇచ్చినందుకు ఆయ్! కోపంరాకుండా ఎలా ఉంటుంది అని నా మీద విరుచుకుపడ్డ సంధర్భాలున్నయి

పద్యం చాలా బావుంది.

రానారె said...

పద్యాలపైన ఆసక్తి వున్నా ఈ విషయంలో గిరిగారికున్నంత వేగం లేదు. నేను చాలా నిదానం.

సమకాలీన విషయాలపై ఇటీవల వచ్చిన పద్యకవితల గురించి పరిచయం చేస్తూ గురువుగారు ఒకటిరెండుమూడు టపాలు రాయగలిగితే ఈ దిశగా అవసరమైన ఆసక్తి కలుగుతుందనుకుంటున్నాను.

ఒక కథల పుస్తకం చదవాలంటేనే నాకు కనీసం నెలరోజులు పడుతుంది. ఒక కథ మధ్యలో ఒకో వాక్యం ఎన్నెన్నో ఆలోచనలను రేపుతుంది, ఎన్నో జ్ఞాపకాలను కదుపుతుంది, ఆ వాక్యం రాసేటప్పుడు రచయిత ఏమాలోచించి వుంటాడో ... ఇలా ... ఆ ఒరవడిలో కొట్టుకుపోవడం చాలా ఆనందంగా వుంటుంది. మళ్లీ కథలోకొచ్చేటప్పటికి చాలా సమయం గడచిపోతుంది. ఇది నా బలహీనత. (ఇది బలహీనత కాదేమో కూడా) వేగంగా చదివి ఆకళింపుచేసుకోవడం ఎలాగో ముందుగా నేను తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కువ పుస్తకాలు చదవడం సాధ్యపడుతుంది. అప్పుడు "అధ్యయనం" చేయడమనేది అప్పుడు సాధ్యమౌతుంది. పుస్తకాలను అలా చదవి జీర్ణించుకోగల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఎలాగ?

Anonymous said...

గిరి గారు,
చదివానండీ.
కొత్తపాళీ గారు,
నా సంకల్పాన్ని మీరు బయటపెట్టారు. ఓ విషయం మీద ౧౨/౧౫ పద్యాలు కట్టాలని ప్రయత్నం, ఎంతవరకు సాగగలనో చూద్దాం.
రానారే,
గరికపాటి వారి సాగరఘోష మంచి ఆరంభం అని నేను అనుకొంటున్నాను, సుజనరంజని వారు నెలనెలా 'ఆడియో' కొంత పెడుతున్నారు, గరికపాటి వారు స్వయానా వ్యాఖ్య చెయ్యటం తో కవి ఉద్దేశ్యం నా బోంట్లకు అర్ధం అవుతోంది. పుస్తకమూ సి.డి, హైదరాబాదులో దొరుకుతాయానుకుంటా.

చదువరి said...

కొత్తపాళీ గారూ, ఈ పద్యాల బాధ గురించి నేను చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. ఇలాగే ఒక విషయం తీసుకుని పద్యాలు రాద్దామని కూచున్నాను. (విషయం: మన దేశ చరిత్రకు సంబంధించి జరిగిన అన్యాయాలు. చరిత్ర దోపిడీ అన్నమాట) ఒకటి రెండు పద్యాలు రాయబోయాను. నా శక్తి చాల్లేదు (ఒకటొప్పుకోవాలి.. ఆ విషయం గురించి వివరంగా రాయడానికి నాకున్న వచనమే చాలదు.) గణశాంతులు చేసేసరికి, పద్యంలో నేననుకున్న అర్థమే రాలేదు. పద్యాల ద్వారా ఒక వృత్తాంతాన్నో, ఒక కథనో వివరించగలిగే స్థాయి నాకు లేదని అర్థమైంది. ఒక్క ప్రయత్నంలోనే వదిలేసానని కాదు, నా శక్తిసామర్థ్యాలు నాకు తెలిసాయి. నిరుత్సాహంతో దాన్నో పక్కన పడేసాను. మళ్ళీ ఇవాళ పొద్దున గిరిగారి కొత్త జాబుపై ఓ పద్యం రాసాను. జాబు చదివిన పావుగంటలో పద్యం తయారై కూచుంది. (నిరుపహతి స్థలం, కప్పురపు విడెము వగైరాలేమీ లేవు మరి :))

గిరి గారూ, కారు అమ్మకానికి సంబంధించిన పద్యాలు బాగున్నాయి. చెప్పదలచినది ఆ పద్యాల్లో చక్కగా ఒదిగింది! మీరింత అలవోకగా, ఇంత అవలీలగా పద్యాలు రాయడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, స్ఫూర్తినీ ఇస్తోంది. ఆ స్ఫూర్తితో నేనూ ప్రయత్నం చెయ్యబోతాను.. కానీ కలం కదలక నీరసం వచ్చేస్తుంది. ఎంతో కొంత తెలిసిన ఛందాలు - కందం, ఆటవెలదులే నేను ప్రయత్నం చేస్తున్నది. వాటిని దాటి మరోదాని జోలికే పోలేదింతవరకు. (ఏమాటకామాటే.. ఈ జాబులోని పద్యాలు అంత బాగా రాలేదు. ఈ విషయమ్మీద నేనూ ఓ పద్యం రాయబోయాను. దానికీ స్ఫూర్తి మీరే! పద్యం రాలేదు గానీ అదేదో.. కవిత లాంటిది వచ్చింది - తిట్టు కవిత్వం అన్నమాట:) ధైర్యం చాలక ప్రకటించలేదు.)

నా పద్యాల బాధలు మరికాస్త వివరంగా మరోసారి రాస్తాను.

Anonymous said...

చదువరి గారు,
కప్పురపు విడెముకు నాకు 'Alternatives' తెలుసు, ఆ పద్యం మొత్తం చెబితే చెబుతాను. అన్నట్టు సుజనరంజని లొ మీ పద్యం చాలా బాగుంది. సమస్యగా ఇచ్చిన ఒక్క పాదంలోనే సాని రెండు సార్లు వచ్చిందనికామోసు, అతికినట్టు ఆటవెలది వేశారు.

గిరి Giri said...

రానారె గారు, కొత్తపాళీ గారు కవిత్వంపై టపాలు రాయాలని నా మనవి కూడా..

చదువరి గారు, మీరన్నదానితో నేను ఏకీభవిస్తున్నాను, ఈ జాబు నాకు పెద్దగా సంతృప్తినివ్వలేదు.
"సుత్తి తో మొదలై ప్రాసకోసం చెత్తలు వాడాల్సి వస్తే, తిట్టుడు కవితలే కదా వచ్చేది" ఐనా నన్ను దూషించకుండా ఉన్నట్లైతే ప్రచురించండి :)

ఊకదంపుడు గారు, మీరు చెప్పిన పద్యాలకి లంకెలివ్వండి - చదవుతాను..

చదువరి said...

ఎంతమాట గిరిగారూ! తిట్టు కవిత్వం అనామకుని మీదండీ!!
ఊకదంపుడు గారూ, (ఏంటో, మిమ్మల్ని ఇలా పిలవాలంటే అదోలా ఉంది.) నెనరులు. పద్యం మీ బ్లాక్కొచ్చి చెబుతా!

Anonymous said...

Very interesting discussion. Why can you people start a discussion on construction of Telugu poems. What are the characterizations of different type of poems. Take a use case a typical poem of each type from a reputed poet and dissect it, why it is so good or why it is not, what else could have been done to make it a better or whatever

Anonymous said...

నాదో ఆలోచన. ఓ సమకాలీన విషయం అంశంగా ఒకరు ప్రతిపాదిస్తే, ఆసక్తిగలవారెవరయినా ఓ నిర్ణీత కాలవ్యవధిలో పద్యాలు రాస్తే అది ఉత్సాహభరితంగా ఉంటుందేమో.

గిరి Giri said...

వికటకవి గారు,
ఊకదంపుడు సాలెగూట్లో మొదలైన టంగు పద్య చర్చ చూసారా? మీరు ప్రస్తావించింది కూడా అలాంటిదే అని నా నమ్మకం..

మీరు కూడా అలాంటి అంశమేదైనా పద్య రూపంగా (సవాలు) పెడితే ఆసక్తి ఉన్నవారు పాల్గొంటారు..