Monday, February 11, 2008

U V Koteswara Rao

చ. గణనములోకి వచ్చుటకు కావలెనన్న సరైన జ్ఞానమూ
పనితనమున్ననూ పనికిమాలిన దారుల పోవుచుండగా
కనబడి, శ్రధ్ధతో చదువుకై కృషి చేసిన క్లిష్టమైనదౌ
గణితము పిండికొట్టడము కష్టము కాదని, దీక్షబూనితే
వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై
కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా
తునకలు కాకమానదని త్రోవను చూపిన విజ్ఞుడా, సదా
ఋణపడియుందు, నాదు అభివృధ్ధికి కారకుడా, నమోనమః


పై పద్యానికి నాలుగు పాదాల మూలమిది..
చ. గణితము పిండికొట్టడము కష్టము కాదని, పట్టుబట్టితే
వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై
కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా*
తునకలు కాకమానదని నూరిన కోవిదుడా నమోనమః


రామయ్యగారి వద్ద ఐఐటి పరిక్షకై చదువుకున్న వారికి కోటేశ్వరరావు గారి గొప్పదనం గురించి వేరే చెప్పనవసరం లేదు. క్రితం వారం హైదరాబాదు వెళ్ళినప్పుడు హిందు దినపత్రిక తిరగేస్తుంటే గుండెపోటు వల్ల ఆయన మరణించారని వార్త చదివి చాలా బాధ పడ్డాను. కాల్క్యులస్ బోధించడంలో ఆయనకి ఎవరూ సరిరారని నా అభిప్రాయం; పాఠాల మధ్యలో తెలుగు సామెతలు, "ఎంసెట్" కోసం బట్టీ పట్టే వాళ్ళ మీద విసుర్లు ఆయన trademark పధ్ధతి. గణిత శాస్త్రంమీద నాకు అభిమానం పెంచిన ఆయనని నేను ఎప్పటికి మరచిపోలేను.

(*ఆయన కాల్క్యులస్ లో లిమిట్స్ గురించి చెపుతూ లెగ్రాంజెస్ సిధ్ధాంతాన్ని ఓ తెలుగు గణితశాస్త్రవేత్త అడకత్తెరలో పోకచెక్క సిధ్ధాంతము అని మహ బాగా అన్నాడని చెప్పడం నాకు గుర్తుండిపోయింది)

3 comments:

కొత్త పాళీ said...

ఒక గొప్ప ఉపాధ్యాయుణ్ణి స్మరించుకుని మాకూ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
పద్యం మహబాగా కుదిరింది, ముఖ్యంగా, "అడకత్తెరలో పడు పోకచెక్కలా".
చివరి పాదంలో నూరిన అంత బాలేదు.

గిరి Giri said...

కొత్తపాళీ గారు,
ఆయన బోధనా శైలికి ప్రభావితులైనవారు చాలామంది ఉన్నారు.

నూరిన పదం అతకనేదని చివరి పాదం మార్చి మరో నాలుగు పాదాలు జతచేర్చాను.

గిరి

Anonymous said...

deep condolences... kigga kigga anedi madhusudhana rao leka koteswara rao!!!