Monday, February 18, 2008

చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..

శా. ఏంట్రా నీకిది కొంచెమైన సబబా? ఇట్లాంటి సాహిత్యమా?
కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై
కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా
వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.

11 comments:

Anonymous said...

అబ్బో అసాధ్యులండీ మీరు! అలవోకగా భలే వాయించారు భడవల్ని.

రానారె said...

అసాధ్యులండీ మీరు - ఇదే మాట చెబుదామని చూస్తే వికటకవి అదేమాటన్నారు. :))

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వ్యావహారికంలో వృత్తరచన బావుంది. ఇందుకు సరైన వృత్తాన్ని (శార్దూల విక్రీడితాన్ని) ఎంచుకున్నందుకు అభినందనలు. నిజమే, వ్యావహారికంలో గురువులెక్కువ. గ్రాంథికంలో తక్కువ. కాబట్టి వ్యావహారికానికి గురువులు ఎక్కువగా ఉండే వృత్తాలు కావాలి. కందం కూడా పనికొస్తుంది.

కం. చాలా బాగా రాశా
రాలోచన ప్రశంసనార్హ మిలాగే
వేలాది రాసి మన ప
ద్యాలకు చెయ్యండి ప్రాణదానం గిరిధర్ !

(ఏదో-మిమ్మల్ని చూసి నేనూ ఒక ప్రయత్నం చేశాను.అంతే.)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మన్నించాలి. ఒక ముఖ్యమైన పదం ఎగిరిపోయింది. ఇలా చదువుకోండి :

కం. చాలా బాగా రాశా
రాలోచన కడు ప్రశంసనార్హ మిలాగే
వేలాది రాసి మన ప
ద్యాలకు చెయ్యండి ప్రాణదానం గిరిధర్ !

గిరి Giri said...

వికటకవి, రానారె, బాలసుబ్రహ్మణ్యం గార్లు, ధన్యవాదాలండీ.
బాలసుబ్రహ్మణ్యం గారు, నేను ఇంతవరకూ వృత్తాల మోజులోపడి కందం రాయలేదు. త్వరలో ప్రయత్నిస్తాను..

చంద్ర మోహన్ said...

గిరిధర్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. కాకుంటే చిన్న పొరబాటు దొర్లింది. చివరి పాదంలో మొదట మగణానికి బదులు రగణం పడింది చూడండి ("వెంట్రుకే..." లో ట్రు లఘువే, గురువు కాదు. తప్పులు వెదకాలని వ్రాయలేదు. తప్పైతే క్షమించండి.

- చంద్ర మోహన్

గిరి Giri said...

చంద్రమోహన్ గారు, అయ్యో క్షమార్పణలెందుకు, మీరు ఎత్తి చూపిన తప్పు తప్పే. నా పద్యాలలో తప్పులు వెతికి పట్టి నాకు మీరు మేలే చేస్తున్నారండీ - ఇలాగే మన్ముందు చేస్తే నేను సంతోషిస్తాను, తప్పులు సరిదిద్దుకుంటూ ఇంకా నేర్చుకుంటాను.
ప్రస్తుతానికి చివరి రెండు పాదాలు సరిదిద్దాను, చూడండి.

Anonymous said...

వ్యాకరణాన్ని పక్కన పెడితే నాకు ఈ పద్యం ఎందుకో నచ్చలేదు (నాకు వ్యాకరణం మీద పట్టు లేదనుకోండి)
తెలుగు సినీ కవిని తిట్టాలంటే మనం వారికన్నా గొప్ప సాహిత్యం లో తిట్టాలని నా అభిప్రాయం
పెద్దలందరికీ నచ్చింది కాబట్టి నేను ఇంతకన్నా ఏమీ రాయలేక పోతున్నాను

rākeśvara said...

భావం ఏదైనా గానీ.. ఇలా వాడుక భాషలో వృత్తాలు! అందులోనూ భారీ వృత్తమైన శార్ధూలం ! ఆతిశయం!

అన్నట్టు మీరు పద్యాలను సృజన కంటే సమస్యలా వ్రాస్తారనుకుంట! ఆశక్తి వుంటే ఎప్పుడైనా భావ కవిత్వం వ్రాయండి. ఆ తరువాత వాటికీ వృత్తాలకీ మధ్యలోనివైన కందాలో, గీత పద్యాలో లేక మాత్రా ఛందస్సు పద్యాలో మంచి బాలెన్సుతో వ్రాయ ప్రయత్నించవచ్చు. ఆసక్తి వుంటే శబ్దాలతోనే కాకుండా అర్థాలతోఁకూడా పద్యాలను అలంకరించ ప్రయోగాలు చేవచ్చు అని మీకో అవిడియా ఇస్తున్నానంతే.

Anonymous said...

వ్యాకరణాన్ని ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది నాకు. భాషని దుర్వినియోగం చేస్తూ సాహిత్యం యెక్క ప్రాణం తీస్తున్న భడవల్ని మంచి ప్రయోగంతో మందలించారు. మీ మరియు వ్యాఖ్యలు వ్రాసిన అందరి టాలెంటుకి జోహార్లు.

గిరి Giri said...

బ్లా.వి గారు,
మీరన్నది నిజమై ఉండవచ్చు, తిడితే అవతలవాడికి అర్ధమవ్వాలి కదా అని రాసాను - అదీ ఓ అరగంటలో. ఇదేమీ శ్లాఘించదగ్గ ప్రయత్నం కాకపోయినా నా కోపాన్ని వెళ్ళగ్రక్కడానికి పనికివచ్చింది.

రాకేశ్వరా,
సృజన బదులు సమస్య - బాగానే పట్టావు.
శార్ధూల విక్రీడితాన్ని భారీ వృత్తమని అనడానికి కారణమేమిటి? భావకవిత్వము కందాలకి దగ్గరా మరి వృత్తాలకి దూరము, ఎందుకు? నాకు మటుకు మత్తేభము భారీగా (కష్టముగా) అనిపిస్తుంది.
ఇప్పడు నేను పద్యాలు చెప్పే నేర్పులో అట్టడుగు స్ధాయిలో ఉన్నాననే నమ్ముతాను, స్వరాలు వల్లె వేస్తున్న వాడిని ఓ కీర్తనందుకోమన్నట్లు, గణాలని శాంతింప ప్రయత్నిస్తూ నేను నచ్చిన రీతి తట్టిన భావాలు రాస్తున్నాను, నన్ను అప్పడే భావ కవిత్వం వైపు తోయకు:) - నా పద్యాలు కవిత్వం అని నేను పరిగణించడంలేదు. అభ్యాసం చేయగా చేయగా కవిత్వం కూడా అబ్బుతుందేమోనని ఆరాటం మాత్రం పడుతున్న మాట నిజమే.

నువ్వుశెట్టి సోదరలారా, నెనరులు