Saturday, October 13, 2007

ఆడ్ కపుల్ చూసారా? (చంపకమాల, సమీక్ష)

చం. ఇరువురు సఖ్యులే; సతుల ఇష్టము నెయ్యము కుళ్ళబెట్టి యుం
దురునొకనింట; పొందిక కుదుర్చుకొనంగను
వీలుకాని చీ
దరయు చిరాకులున్ పెరుగ దుర్భరమవ్వును కొత్తజీవితం;
తెరచుకొనున్ కనుల్ పెనము దిగ్గి పడిండ్రని పొయ్యిలోపలన్

ఇదీ Neil Simon’s Odd Couple లో జరిగే ప్రహసనం. నీల సైమన్ వి ఇప్పటివరకు నేను చూసినవి ఆరు సినిమాలే అయినా, అతను రాసిన కొత్త (అంటే నేను చూడని) సినిమా నాకు చుప్పిస్తానంటే కళ్ళుమూసుకుని (ఉర్ఫ్ నిస్సంకోచంగా!) చూడడానికి ఎప్పుడైనా సిధ్ధమవుతాను.

అరవైల్లో వచ్చిని ఆడ్-కపుల్ రెండొవ భాగం తొంభైల్లో తీసారు, కొద్దిగా నవ్వులాటగా ఉన్నా అది అంత బాగా ఆడలేదు. కాని మొదటి భాటం మటుకు నవ్వులు, కాసుల జల్లులు రెండు కురిపించి నిర్మాతలని ప్రేక్షకులని అలరించింది. ఎనెన్నో రీమేకులుకు తావిచ్చింది.

వాల్టర్ మాతౌ, జాక్ లెమన్ కలిసి నటించిన పలు హాస్యభరిత చిత్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది చిత్రాలలో ఇదొకటి. వారిద్దరి నటనే కాక బ్రాడ్వే నాటిక నుంచి మలచబడిన కధ కాబట్టి, చమత్కార సంభాషణలకి కొదవ ఉండదు..

“nature didn’t intend poker to be played like this”
“who writes his will on a toilet paper?” “Felix, that’s who”
“what do you say to a man crying in your bathroom”
“childhood sweethearts, were you?” “Oh no, they are my kids”
“in other words, you are saying…” “NO, those are the exact words”

ఇవే కాక ఇలాంటివి ఎన్నెన్నో చెణుకులు చిత్రం నిండా ఉంటాయి, మళ్ళి మళ్ళి చూసినా నవ్విస్తూ ఉంటాయి.

ఆస్కర్, ఫిలిక్స్ ఇద్దరూ పెళ్ళాలతో గొడవ పడిన వాళ్ళే. ఆస్కర్ విడాకులు తీసుకుని చాలరోజులయ్యి ఒంటరిగా ఉండడం అలవాటు. ఫిలిక్స్ కి ఇటీవలే పెళ్ళి పెటాకులయ్యింది. ఉండడానికి ఎటు పోదామా అనుకుంటున్న తరుణంలో ఆస్కర్ ఆదుకుని తన ఇంట్లో తలదాచుకోనిస్తాడు. ఆస్కర్ కి శుచి శుభ్రత అంటే ఎంటో కూడా తెలియదు. ఇల్లు ఒక చెత్త కుండిలా ఉన్నా పట్టించుకోడు. ఫిలిక్స్ కి శుభ్రత పిచ్చి, పైగా రోగభ్రాంతి ఎక్కువ - ఎదైనా తనకి నచ్చిన విధంగా లేక పోతే ఆ ఆదుర్దా వల్ల తుమ్ములో దగ్గులో మొదలు.. ఆస్కర్ కి ఆడవాళ్ళని ఇంటికి తీసుకు రావాలని మోజు, ఫీలిక్స్ ది ఇంకా భార్యని మర్చిపోలేని పరిస్థితి, ఇంటికి వచ్చిన ఆడవాళ్ళతో ఇంకేమీ మాట్లాడడానికి లేక తన గోడు వెళ్ళబుచ్చి ఆస్కర్ వేసిన పధకాలనన్ని మట్టి కలిపిస్తుంటాడు.

చివరకి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోలేని పరిస్థితి వచ్చి పడుతుంది. పెళ్ళాలని వదిలి వచ్చినా, మళ్ళి పెళ్ళాలే దొరికినట్టు అవుతుంది వారికి. మనకేమో వీరిద్దరి పెళ్ళిళ్ళు అసలు ఎందుకు పెటాకులయ్యాయో తెలుస్తుంది.. ఇవన్నీ వెరసి నవ్వుల వర్షం.

తప్పక చూడాల్సిన హాస్యభరిత చిత్రం.

2 comments:

Anonymous said...

Odd Couple కథని '70-'75 మధ్య టీవీ సిట్కామ్ గా కూడా తీసారు. దానీ రీరన్లు (పునః ప్రదర్శనలు?) ఇప్పటికీ అక్కడక్కడ వస్తుంటాయి. అది original run లో కన్నా సిండికేషన్లో ఎక్కువగా ఆదరణ పొందింది. Jack Lemmon, Walter Matthau కలిసి మళ్లీ "Grumpy Old Men", దాని sequel "Grumpier Old Men" లో కూడా నటించారు.

గిరి Giri said...

పద్మ గారు,
సిట్కాముల గురుంచి విన్నా గాని చూడలేదు.

మీరు చెప్పిన రెండు సినిమాలు చూసాను..బావుంటాయి. రెండవ దాంట్లో జాక్ లెమన్ తండ్రిలా వేసిన పండు ముసలివాడు చాలా నవ్విస్తాడు.

వీరిద్దరు కలిసి నటించిన 'ఫార్ట్యున్ కుకి', 'ఫ్రంట్ పేజ్' చిత్రాలు కూడా అమోఘం..ఫ్రంట్ పేజ్ కుడా చాలా సార్లు రీమక్ చేయబడింది.నలభైలలోని కారి గ్రాంట్ 'హిస్ గర్ల్ ఫ్రైడె'ది అదే కధ.