Thursday, October 18, 2007

దిగిన ముద్ద

ఇదివరకు ఇక్కడ లైబ్రరీ వాళ్ళు నా చేతికందించిన రీళ్ళ గురించి చెప్పానుగా.

ఉ. పెట్టిరి చేత రెండు కడు పెద్దవి పెట్టెలు ఒక్కసారిగా
పెట్టితి నేను నోరునట వెళ్ళ ఇవేమిటి ఇంతవింతనీ
తట్టెను బుఱ్ఱకాయకటు తప్పిదమెవ్వరు చేయలేదనీ
పెట్టెలు నేను కోరినవి పిక్చరు రీళ్ళని తెల్సి తేటగా

రీళ్ళని చూడకుండానే తిరిగి ఇచ్చేద్దామనుకున్న తరుణంలో, కాల్ చేస్తానన్న లైబ్రరీ ఆయన చేసాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో శాఖలో ప్రొజెక్టరు ఉందని, వాళ్ళని కనుక్కొమ్మని చెప్పడు. వాళ్ళతో మాట్లాడితే తెలిసింది, ప్రొజెక్టర్ ఉంది కాని, దాన్ని ఇరవై ఏళ్ళ పాటు ఎవరు వాడకపోవడంవల్ల నేను వాడుకుంటానంటే వాళ్ళు ఒక గది, బల్ల, చూడడానికి తెర లాంటి సదుపాయాలన్ని ఇవ్వగలరు కాని, ప్రొజెక్టరు నడిపించడంలో మాత్రం సహాయం చేయలేరని. నాకు కాసేపు
సినిమా పారడీసో లో టొటొలా అయిపోవాలనిపించింది.

అయినా అప్పుడప్పుడు పాత ప్రొజెక్టర్ నడపడం లాంటి కొత్తవి నేర్చుకోకపోతే బ్రతుకులో స్పార్కు ఎక్కడుంటుందని ఇతర సగం అనడంతో పట్టుదల కలిగింది. ప్రొజెక్టరు, గది కావాలని శాఖవారికి చెప్పాను. వాళ్ళు వీలున్న రోజు చూసి, ఆ తేదిన రమ్మనారు.

ఒక రోజు ఆ రోజు రానే వచ్చింది. రీలొకటి పట్టుకు వెళ్ళాను. ఒకావిడ నాకు ప్రొజెక్టరు ఇచ్చి చల్లగా జారుకుంది. ప్రొజెక్టరు తెరిచి చూద్దునా, ఏదెటు వెళ్తుందో ఒక్కింతైనా అర్ధం కాలేదు. ముప్పావుగంట ట్రైనింగులేని వాడు విమానం మీటల ముందు కష్టపడ్డట్టు కుస్తీ చేసాను. విమానం ఒక్క అంగుళం కదలని విధంగా ప్రొజెక్టరు కూడా మొరాయించింది. నిరాశతో ఇంటి ముఖం పట్టాను.

మొదటి రోజు నా ప్రయత్నాలు ఇవిగో. చివరకు సాధించింది ఆ ఖాళీ తెరొక్కటే.కధంతా విన్న ఇతర సగం ఇంకోసారి ప్రయత్నిద్దామంది. ఇలాంటి వింటేజ్ పరికరాలు కొద్దిగా కష్టపెడతాయనీ, వాటిని అదుపులోకి తెచ్చుకుంటే ఉండే ఆనందమే వేరని అంది. తన మాటులు విన్న నాకు అబ్బురమేసింది. కొంచెం తొందరగానే ఓటమిని ఒప్పుకున్నానేమో అనిపించి, శాఖ వారికి మళ్ళీ కాల్ చేసి ఇంకో రోజు కావాలని అడిగాను. వాళ్ళు ఇంకో తేది ఇచ్చారు.

ఓటమిలోనే విజయానికి మెట్లు పడతాయన్నారెవరో, అలానే అయ్యింది. మొదటి సారి తీసిన ఫొటోల వల్ల తెలిసింది ప్రొజెక్టరు ‘బెల్ అండ్ హొవెల్’ వారిదని. గూగులమ్మని బుజ్జగించి చూసాను. ముందు ఈబె లో అలాంటి ప్రొజెక్టరుని అమ్మాలనుకునే వాళ్ళ ప్ర
కటనలే తప్ప ఇంకేమీ కనబడలేదు. నానారకాలుగా ప్రయత్నించిన తర్వాత ఒక లంకె తగిలింది. మోడలు అదే కాక పోయినా, ‘బెల్ అండ్ హొవెల్’ వారి ప్రొజెక్టరు నడపడం గురించి వివరాలందులో ఉన్నాయి.

రెండవ సారి వెళ్ళినప్పుడు, ఇతర సగానిదే పైచేయి. ముందు నుంచి, చంటి పిల్లని నా చేతికిచ్చేసి, తను ముందడుగేసేసింది. పావుగంటలో ప్రొజెక్టరు నడవడం, చక్కగా తెర మీద బొమ్మలాడడం మొదలు. మా ఇద్దరి ఆనందానికి హద్దు లేదంటే నమ్మండి. (ఇదిగో ఇక్కడ చూడండి. బొమ్మ తెరమధ్యలో పడలేదు కాని, you get the picture, right? బొమ్మ డ్రంకెన్ ఎంజెల్ లోనిది. డాక్టర్ గా తకాషి షిముర, పక్కన తొషిరో మిఫునె)

నిన్న పది మంది స్నేహితులని ఆహ్వానించి, సంజురో సినిమా చూపించాను. మాకు తప్ప అందరికి, జపనీయుల చిత్రాలతో అదే మొదటి పరిచయం. వీలైనంత మేరకు కురొసావ, మిఫునెల పూర్వరంగం, వారి గొప్పదనం గురించి చెప్పాను. అందరికి ఇక చూడాలని ఉత్సాహం హెచ్చడంతో నా మాటలు కట్టిపెట్టి, ప్రొజెక్టరు నడిపించాను.

అందరం పాప్కార్ను, చిప్సు తింటు హాయిగా ఓ రెండు గంటల పాటు సంజురో చూసి ఆనందించాము.


ఎట్టకేలకు ముద్ద దిగింది.

4 comments:

కొత్త పాళీ said...

Bravo!
మీ వీరనారీమణికి ప్రత్యేకాభినందనలు

Sriram said...

గిరిగారూ, నా బ్లాగుకొచ్చి పలకరించినందుకు నెనరులు! ఈ మధ్య బ్లాగులోకంలో వెనకబడడంతో మీ మాలలు చూడలేదు. మంచి బాగా రాస్తున్నారు మీదైన శైలిలో. మేగీమీద మీ భావనలే నావికూడా. ఇంకా సినిమాలమీద రాయడం కూడా బాగుంది. మిమ్మల్ని చూసి నాకూ ఉత్సాహం వస్తోంది. కొ.పా. గురువుగారు గేంగ్ ఆఫ్ ఫోర్ అని పిలిచే ఈ వృత్తాలంటే నాకు బాగా సరదా. నా బ్లాగులో కొన్ని ఉన్నాయి చూడండి.
బ్లాగు పద్యరచయితల సంఘంలోకి మీకు ఇదే ఆహ్వానం.

చేతన_Chetana said...

Wow.. congratulations!! The whole thing might've been awesome experience. Though I have been in awe of akira kurasowa since a while, never got to see any of his work until very recently. మీరు, సౌమ్యా వ్రాసిన రివ్యూలు, అవి ఇచ్చిన push కారణంగా నేనూ ఈమధ్య వరసగా రెంట్ చేయటం మొదలుపెట్టా. అదృష్టం కొద్దీ ఇంటిదగ్గెర blockbuster వాడు కొత్తగా అకీరా మూవీస్ ఒక్కొక్కటి బయటపెడ్తున్నాడు. మిగిలినవన్నీ blockbuster queueలో పెట్టేశా..

బ్లాగేశ్వరుడు said...

చిన్నప్పుడు నాకు ప్రొజెక్టర్లంటే తెగ పిచ్చి ఉండేది. నేను చిన్నప్పుడు ఒక స్లైడు ప్రొజెక్టరు కూడా తయారు చేశాను. మీరు చెప్పిన సంగతులు నా చిన్ననాటి రోజులు గుర్తు చేశాయి.