Thursday, October 04, 2007

ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు

గమనిక: ఈ టపా ఏ ఒక్క కవినీ ఉద్దేశించి రాసినది కాదు.

పద కవితా పితామహుని ‘పలుకు తేనెల తల్లి పవళించెను’ గురించి కొత్తపాళీ గారి వివరణలు చదివిన తరువాత నాకు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాల వివరణే నా ఈ టపా.

తెలుగు మీద బాగా పట్టు ఉన్న వాళ్ళు రెండు రకాలు ఉన్నారనిపిస్తోంది - ఒకరు, కవులు, పండితులు, సినిమాలన్నా, వాటి crass commercialization అన్నా కిట్టని వాళ్ళు. సినిమాల జోలికి వారు పోరు. రెండు, పాండిత్యం ఉన్నవారే కానీ మసాల పత్రికలకి, సినీ సాహిత్యానికి చేరువగా ఉన్నవారు.

రెండవ తరహా కవులని ఒక క్షణం విద్యార్థులు అని అనుకుందాం. అదే నిజమైతే వారున్న తరగతి ఎలాంటిదంటే - అక్కడ ప్రతి ఒక్కడు నకలు చేసే వాడే, చీటిలు పెట్టేవాడే. సంగీతపు విద్యార్ధి విదేశాల, స్వదేశపు ఇతర భాషల పాటలని నకలు కొడుతాడు. దర్శకపు విద్యార్ధి దేశ భాష పరిమితులు లేకుండా హిట్టైన సినిమా అంటే చాలు డివిడిని కెమెరా పక్కన పెట్టి సినిమా లాగించేసే సత్తా ఉన్న వాడు. నిర్మాత విద్యార్ధి, ఇక వాడి సంగతే వేరు - బాగా డబ్బున్న వాడు, చదువు అబ్బ లేదు కాబట్టి ఎవడు బాగా నకలు కొట్టగలడో వాడిని చేరదీస్తాడు, డబ్బు వెదజల్లుతాడు. ఇలాంటి మహామహులందరి చుట్టూ ఉంటూ నకలు కొట్టాలని అనిపించని వారు ఎంత మంది ఉంటారు చెప్పండి? So, సినీ కవులకి నకలు కొట్టాలనే ఆలోచన ఎప్పుడో అప్పుడు రానే వస్తుంది.

మరి అలా అనిపిస్తే వారికి ఉన్న దారులేవి? ఒకటి పరభాష సాహిత్య చౌర్యం. ఇదంత సులభమైన విషయం కాదు, వేరే భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఉంటే మాత్రం నిక్షేపంగా నెట్టుకొచ్చేయచ్చు. రెండు, సొంత ఇంటి ఇనప్పెట్టికే కన్నం పెట్టడం. సొంత ఇంటి ఇనప్పెట్టంటే, తెలుగు భాషలోనే ఉన్న కవితా సంపద. ఇదివరకటి కవులలో ఎంతో మంది మహామహులున్నారు - వారి కావ్యాలు చదివి, వాటిలో ఉపమానాలని, పద విన్యాసాలని మోసుకొచ్చేయచ్చు. పరభాసా చౌర్యమంత కష్టమైన పని కాదు ఇది.

ఒక సామాన్య సినీ ప్రేక్షకుడు నాలాంటి వాడే ఐతే, శ్రీనాధుని శృంగార వర్ణనలని కొట్టుకొచ్చేసిన కవి సినీ సాహిత్యాన్ని విని (అది శ్రీనాధునిదని తెలియక) ఈల వేయడం రాదు కాబట్టి, చేతులు నెప్పెట్టే దాక చప్పట్లు కొడతాడు,. పక్క వాణ్ణి చూసి వాడికి అర్ధం కాలేదనే అనుమానం వస్తే, ‘హు, వీడికి కవి హృదయం అర్ధం చేసుకునేంత సీను లేదు’ అని పన్లో పనిగా ఒక చిన్న చూపు కూడా పడేస్తాడు. అవునా?

చిక్కు ఎక్కడ వస్తుందంటే, ఇంటి దొంగ కవులని పట్టగలిగిన వారు, మొదటి రకం కవులు. కానీ ముందే చెప్పుకున్నాంగా, వారికి సినిమాలంటే కిట్టవని. కధ మొదలుకు..

పాటల బాణీలు, సినిమా కధలు అంతర్జాలం పుణ్యమా అని ఎక్కడి నుంచి కొట్టుకొస్తున్నారో కనిపెట్టగలం. పాటల సాహిత్యాన్ని ఎలాగ పట్టడం? కష్టమే.. నేను, నాలాంటి వారు, మహా కవుల కావ్యాలు తిరగేస్తే కానీ ఇలాంటివి కనిపెట్టలేము. ఏమంటారు?

9 comments:

కొత్త పాళీ said...

ఈ మాత్రం దానికి అంత మాటెందుకు లెండి. అలా "స్ఫూర్తి" పొందుతుండటం సినిమాల్లో మామూలే. ఒకానొక కాలంలో ఒక మల్లాది రామకృష్ణశాస్త్రి, ఒక ఆత్రేయ ఉంటుండే వాళ్ళు. మల్లాది వాడిన అచ్చ తెలుగు నుడికారాలు చాలా వరకు మనకి అర్ధం కాలేదు. ఆయన అనామకుడిగా మిగిలిపోయాడు. ఆత్రేయ పాటల్లో ఉన్న ఆర్ద్రత పట్టించుకోవాలని మనకి అనిపించ లేదు (మనసు గతి ఇంతే, తేట తేట తెలుగులా ..) కొన్నిట్లోని బూతు చమత్కారమే మనకి ప్రియమైంది..ఆయన బూత్రేయగా మిగిలాడు.

వీలుంటే ప్రాణహితలో సుద్దాల అశోక్ తేజ ఇంటార్వ్యూ చదవండి. పాత సాహిత్యాన్ని ఎండుకు చదవాలో సోదాహరణాంగా చక్కగా చెప్పాడు.

గిరి Giri said...

అయ్యో, ముఖస్తుతి నా ఉద్దేశం కాదు. ఐనా ఇబ్బంది ఎందుకని చివరి వాక్యాన్ని తొలగించాను. చక్రం సినిమాలోని ఒక పాట మీద మీ విశ్లేషణ కుడా చదివాక, గుడ్డిగా (ఈ నాటి) సినీ రచియితల పాండిత్యాన్ని పొగడగం సబబు కాదేమో అనిపించి ఇది రాసాను..

వీలు దొరికినప్పుడు సుద్దాల అశోక్ తేజ ముఖాముఖి చదువుతాను. (ఆయన పేరు వినగానే నాకు మొట్టమొదట గుర్తుకొచ్చే పాట 'నిన్నే పెళ్ళడుతా'లో "నా మొగుడు, రాంప్యారి":-)

Anonymous said...

@గిరి,

చాలా పెద్ద అభాండం ఆధునిక కవుల మీద వేశారనిపిస్తోంది. వాల్మీకి రామాయణాన్ని ఆధారం చేసుకొని కొన్ని వందల రామాయణాలు అనువాదాలుగా, అనుకరణలుగా, మరింకొన్ని వివిధ రకాలయిన రామాయణాలుగా తర్వాతి కాలంలో వచ్చాయి. మొల్ల అయితే ఏకంగా, రోజూ తినే తిండే అని భోజనం చేయటం మానేస్తామా? అలానే రామాయణం మళ్ళీ మళ్ళీ రాయటమున్నూ అని చెప్పనే చెప్పింది.

వాల్మీకి ఒక సంఘటనని వర్ణించినది కొందరికి నచ్చకపోవచ్చు. అంచేత కొందరు వారికి నచ్చిన వ్యాఖ్యానం చెయ్యొచ్చు. పది మంది మళ్ళీ మళ్ళీ రాసినా ఏ వర్ణన గొప్పతనం దానిదే. కాకపోతే, కొన్ని గొప్పవిగా నిలబడతాయి, మిగిలిన వాటిమీద.

అలానే, అన్నమయ్య యొక్క ఆ శృంగార కీర్తన, సిరివెన్నెల కాస్త సంస్కృతీకరించి మరింత బాగా రాద్దామనుకున్నాడేమో. దానికి ఏకంగా ఆయన్ని కాపీ రచయిత అనటం సబబు కాదు.అదేదో ఆవు వ్యాసంలాగా అంతా మళ్ళీ సిరివెన్నెల చుట్టూ తిరుగుతోంది.

విద్యాసాగర్ "తూనీగ తూనీగ.." యధాతధంగా పట్నాయక్ కొట్టాడు చూడు అది కాపీ అంటే, ఇది మాత్రం ఖచ్చితంగా కాదు.

Anonymous said...

"శృతిలయలు" సినిమాలో "తెలవారదేమో స్వామీ.." అన్న సినిమా పాట "పలుకు తేనెల తల్లి.." అన్న అన్నమయ్య సంకీర్తనకి "నీరసమైన అనుకరణ" అని కొత్తపాళీ గారు అన్నది నాకు సమంజసంగా అనిపించదు. ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని సినిమా పాటల రచయితల మీద మీరు మోపిన ఈ పెద్ద అభియోగం కేవలం చర్చ కోసమే అనుకుంటున్నాను. మొన్న మొన్నటి వరకూ వచ్చిన తెలుగు సినిమా పాటలకి, ముఖ్యంగా యుగళ గీతాలకీ, విరహ గీతాలకీ, వగైరా చాలావాటికి --భూతద్దంతో వెతికితే-- ఏ ప్రబంధ కావ్యాల్లో పద్యాలో స్ఫూర్తి అయి ఉంటాయి. అది వింతేమీ కాదు, చాలామంది సినిమా పాటల రచయితలు పాత తెలుగు సాహిత్యం చదువుకున్నవాళ్లే, దాని ప్రభావం వాళ్ల రచనల మీద లేకుండా ఉండదుగదా! కృ.శా ".. మనసు తెలిసిన మేఘమాలా, మరువలేనని చెప్పలేవా.." అంటే అది మేఘ సందేశాన్ని కాపీ కొట్టినట్టు కాదు కదా! అనుకరణ వేరు, అనుసరణ వేరు, స్ఫూర్తి పొందడం వేరు.

మహాకవులూ కూడా అప్పుడప్పుడు ఇలా "స్ఫూర్తి" పొందిన సందర్భాలున్నాయి. పోతన రాసిన "మందార మకరంద మాధుర్యమున దేలు..", "కమలాక్షు నర్చించు కరములు.."
పద్యాలకి పాల్కురికి సోమనాథుడో, మరొకరో స్ఫూర్తి అని భాగవతం పీఠికలో చదివాను. పోతనని "కాపీకారు"డందామా? అన్నమయ్య పాటల్లో చాల పాటల పల్లవులు ("జో అచ్యుతానంద..", గొబ్బిళ్ల పాటలు, అల్లో నేరెళ్ల పాటలు) అప్పటికే ప్రచారంలో ఉన్నాయి-ట.


Back to "తెలవారదేమో స్వామీ..": ఆ సినిమాలో, ఆ సన్నివేశానికి, ఆ పాత్రల స్వభావానికి ఆ పాట, అందులో భావజాలం చాలా సందర్భోచితంగా ఉన్నాయి. కథలో, నాయికానాయకులిద్దరూ భావుకులు, సంగీతం --ముఖ్యంగా అన్నమయ్య కీర్తనలు-- నేర్చుకున్నవాళ్లు (ఈ విషయాలని కథలో అప్పటికే రెండు అన్నమయ్య సంకీర్తనల ద్వారా estblish చేసారు) వాళ్లు ఒకరినొకరు తల్చుకుని పాడుకునే పాటల్లో, (సందర్భోచితమైన) సంకీర్తనలోని భావజాలం చోటు చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? పాటని సందర్భాన్నించి విడదీసి విశ్లేషిస్తే అనుకరణలాగే ఉంటుంది కదా! సినిమా పాట వినగానే అన్నమయ్య కీర్తన గుర్తు వచ్చిందంటే అది విన్నవారి అభిరుచికీ, రాసినవారి సమయస్ఫూర్తికి నిదర్శనం!

వికటకవి గారూ, "రోజూ తినే తిండి అని భోజనం చేయడం మానేస్తామా.." అన్నది మొల్ల కాదు, రామాయణ కల్పవృక్షం అవతారికలో విశ్వనాధ సత్యనారాయణ. ఆ పద్యం ఇది:

మరల నిదేల రామాయణంబన్నచో, నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే చేయుచున్నది, తనదైన యనుభూతి తనది గాన
తలచిన రామునే తలచెద నేనును, నా భక్తి రచనలు నావి గాన

కవి ప్రతిభ లోన నుండును, కావ్య గత శ-
తాంశములయందు తొంబది యైన పాళ్ళు
ప్రాగ్విపశ్చిన్-మతంబున రసము వేయి
రెట్లు గొప్పది, నవ కథా ధృతిని మించి

ఈ పద్యం, అవతారికలోని మరికొన్ని పద్యాలు, విశ్వనాధ పావని శాస్త్రి గారు చదివిన ఆడియో లింకులు teluguworld.org లో ఎక్కడో ఉన్నట్లు గుర్తు.

Anonymous said...

పద్మ గారు,

మీరన్నది నిజమే. నేను పొరపాటు పడ్డాను. కనీ మొల్ల కూడా మళ్ళీ రాయటంపై ఓ మాట అంది.

"రాజిత కీర్తియైన రఘురామ చరిత్రము....."

ధన్యవాదములు.

గిరి Giri said...

చాలా ఓపిగ్గా వ్యాఖ్యలు రాసిన వికటకవిగారికి, ఎన్నో తెలియని విషయాలు తెలిపిన పద్మ గారినికి ధన్యవాదాలు.

ఇంతకు ముందు రెండు మూడు సార్లు రాసాను కూడా, ‘తెలవారదేమో స్వామి’ నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటని, సీతారామశాస్త్రి గారంటే నాకు గౌరవం ఉన్నదని.

అన్నమాచార్య సంకీర్తన లాగ ఉన్న ఆ పాటకి రాష్ట్రపురస్కారం ఇచ్చారని తెలిసి ‘అబ్బో’ అనుకున్నాను - ఆయన అడుగుజాడల్లో నడవడమంటే గొప్ప విషయమే అనిపించింది. కానీ, మొన్ననే అలాంటి అర్ధం ఉన్న కీర్తనే అన్నమాచార్యులు రాసారని తెలియగానే, ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే ఇంత ఇంప్రెస్ అయ్యే వాడినా అని అనుమానం, దాని నుంచి టపాలో రాసిన మిగతా అనుమానాలు పుట్టాయి.
నాకు ఏ విధంగా చూసినా (moron in a hurry పధ్ధతిలో చూసినా:-) ఆ పాట అనుకరణ అనిపిస్తోంది.

నేను వేసిన అభాండం ప్రేక్షకుల అజ్ఞానం మీద కూడాను... మన సినీ రంగంలో ప్రస్తుతం ఉన్న క్రియేటివిటిని చూసి కూడా, సినీ కవులు నేను అనుమానించినట్టి ద్రోవలు పట్టరు అని ఖరాఖండిగా చెప్పగలరా? నాకైతే అది అనుమానమే..నా టపాలో ఉన్నది ఆ అనుమానమే.

Sriram said...

గిరిగారూ, "తెలవారదేమోస్వామీ..." పాట "పలుకుతేనెలతల్లి..." పాటకి అనుకరణ అని గురువుగారెందుకన్నారో నాకు తెలీదు కానీ, మీరన్నట్టు అవి రెండూ ఒకే అర్ధమున్న పాటలు కావు.

రెండు పాటలూ శృంగారరస ప్రధానాలు. అంతవరకే.

"పలుకుతేనెల తల్లి..." పాటలో తెల్లవారి చాలా సమయమైనా ఇంకా నిద్రలేవని అమ్మవారి వర్ణన ఉంది.దానికి కారణం రాత్రంతా శ్రీనివాసుడు నిద్రలేకుండా చెయ్యడం అని అన్నమయ్య అంటాడు. పాటలో, నిద్రిస్తున్న ఒక స్త్రీ వర్ణన మాత్రమే ఉంది.

ఇక "తెలవారదేమో స్వామీ..." పాట దీనికి విరుద్ధం. ఇందులో విరహం ముఖ్య విషయం. శ్రీనివాసుడు దగ్గరలేక, అమ్మవారికి క్షణమొక యుగంగా రాత్రి చాలా భారంగా గడుస్తోంది అని కవి భావం.

దీనికీ దానికీ అర్ధం విషయంలో ఎక్కడా పోలిక లేదు. రెండూ అమ్మవారి మీద రచించిన కీర్తనలంతే.

Anonymous said...

కాపీ కొట్టితే తప్పులేదన్నా. అమ్మ నాన్నలు ,గుర్వులు చేసెటి పన్లు కాపీ కొడ్తలేమ. imitation is the best form of flattery అన్నరులె పెద్దోల్లు. ఇలయరాజు కూడ చెప్పిండు. కొత్తగ మేం కనుక్కునేటిది ఏడిదిలేదు అని. మహానుబావులు చేసిచూపించిండేటివి అనుకరిస్తే తప్పులేదన్నా. original ideas భీ ఒక్కోపారి రావచ్చు. intellectual property rights mindset మంచిది గాదన్న.

గిరి Giri said...

అనామకన్నా, మస్తు చెప్పినవ్ తియ్. నీతోని టకఫల్రకోవుడు నాతోని కాదె. కాపి కొట్టెసంటోల్లనేన నేనన్నడిది, ఇంటున్నోల్లని గూడ జోపిన కాద?