1943లో విడుదలైన ఫ్రాంక్ కాప్రా, కారీ గ్రాంట్ ల ఆర్సెనిక్ అండ్ ఓల్డ్ లేస్ నాకు తెగ నచ్చే హాస్యభరిత చిత్రాలలో ఒకటి. సినిమాగా విడుదలవ్వక మునుపు ఇది ఒక నాటికగా బ్రాడ్వే లో ప్రదర్శితమయ్యి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పటికి పలు కాలేజిలలో (ఇండియాలో కూడా) దీన్ని స్టేజికెక్కించే వారున్నారు. ఎన్నో మలుపులతో, నవ్వుతెప్పించే సంభాషణలతో, మంచి నటుల నటనతో కూడి ఉండి చూసిన ప్రతీ సారి నాకు ఆనందాన్ని కలిగిస్తుందీ చిత్రం.
ఒక్క ముక్కలో చెప్పాలంటే- ఒక వెర్రికొంపలో కొత్తగా పెళ్ళైన ఒక వెర్రివాడు (ఈ వెర్రి ముందు వెర్రి వేరు) పడే కష్టాల పరంపర - ఈ కధ. మార్టిమర్ బ్రూస్టర్ ఒక పేరున్న రచయిత, వివాహ ద్వేషిను. అలాంటివాడు పక్కింటిపిల్ల ఎలేన్ మీద మనసుపారేసుకోవడమూ, ఆమె దాన్ని ఆత్రంగా ఏరేసుకోవడమూ జరిగిపోతాయి. పెళ్ళి కూడా చకచకా జరిగిపోతుంది (పెళ్ళి నమోదుల ఆఫీసులో జరిగే పెళ్ళిళ్ళకి రెండు సంతకాలే కదా కావలసింది?)
హనీమూన్ కి నయాగరకి వెళ్దామని నిర్ణయించి ఇంటికి వెళ్ళి సామనంతా తెచ్చుకోవడానికి వచ్చినప్పటినుంచి మొదలవుతుంది అసలు హాస్యపుతంతు. మార్టిమర్ ఇంట్లో ఉండేది, ఇద్దరు పిన్నులూ (ఎబి,మార్తా) ఒక అన్నయ్య టెడి..అన్నకి వంద వేపగింజలంత వెర్రి, వాడికి తాను రాష్ట్రపతి రూస్వెల్ట్ అని భ్రమ. మాటిమాటికీ "చార్జ్" అని పెద్దగా కేకలు పెడుతూ, యుధ్ధానికి వెళ్తున్న సేనాధిపతిలా మెట్లమీద పరుగెడుతూ ఉంటాడు.
ఇంటికి చేరిన కొద్ది సమయంలోనే దివాన్లో మార్టిమర్ కి ఓ ముసలాడి శవం కనబడుతుంది. కాసేపు నోటమాట రాక, చివరకి తేరుకుని పిన్నులని ఇదేమిటని అడగగానే వాళ్ళు, పెద్దగా పట్టించుకోకుండా, “నీ వయసుకి ఇంత ఆదుర్దా మంచిది కాదురా’ అంటారు. వాళ్ళకి ఇదేమీ తెలియదని, పిచ్చి ముదిరి టెడి ముసలాడిని చంపేసాడని అనుకుంటాడు, ఇక ఆలస్యం చేయకుండా టెడిని హాపీడేల్ సానిటోరియంలో చేర్పించాలని నిర్ణయించుకుంటాడు. హాపీడేల్ కి చేసిన ఫోన్ కాల్ సన్నివేశం చాలా నవ్వు తెప్పిస్తుంది. అక్కడి అధికారి, “ఇప్పటికే మాకిక్కడ చాలమంది రూస్వెల్టులు ఉన్నారు, ఈ మధ్య నెపోలియన్ లు తక్కువైయ్యారు మీవాణ్ణి నెపోలియన్ అవ్వమనగలరా?” అని అడుగుతుంటే ఎవరికి నవ్వు రాదు?
తర్వాత మాటల్లో తెలుస్తుంది, ఈ ముసలాడే కాకుండా ఇంకా పన్నెండు శవాలు ఇంటి భూగృహం (cellar) లో ఉన్నాయని. అదిరిపోతాడు మార్టిమర్. ఆరా తీయగా తెలిస్తుంది, తన పిన్నులు ముసలివాళ్ళని ఇంటికి రప్పించి, వైన్ లో చిటికెడు సైనైడు, మరో రెండు విషరసాయనాలు కలిపి ఇచ్చి వాళ్ళని చంపేస్తున్నారని. టెడికి ఈ చావుల గురించి వివరాలు తెలియకపోయినా, దేశంలో వ్యాధులు ప్రబలుతున్నాయని, పనామా కాలువ వద్ద శవాలని పూడ్చి పెట్టాలని చెప్పి, భూగృహంలో వాడిచేత శవాలను పాతిస్తూ ఉంటారు పిన్నులు. ఒక పిచ్చాడనుకుంటే ముగ్గురు తయారవుతారు మార్టిమర్ ఖర్మకి.
ముగ్గురినీ నొప్పించకుండా సానిటేరియంలోకి ఎలా పంపాలిరా అని ఆలోచిస్తుండగా పానకంలో పుడకలాగ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన జొనాతన్ (మార్టిమర్ కి ఇంకో అన్న), ఒక సహచరుణ్ణి వెంటబెట్టుకుని ఇంటికి వస్తాడు. వాడికి ముదురు పిచ్చి, చిన్నపటి నుంచే కౄరత్వం ఎక్కువ. ఆపాటికే పలు పట్టణాలలో పన్నెండు హత్యలు చేసాడు. వాడికి మార్టిమర్ అంటే అస్సలు పడదు - తన మొహం పోలీసులు గుర్తు పడుతున్నారని గుట్టు చప్పుడు కాకుండా పిన్నుల ఇంట్లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందామని ఒక నాటు వైద్యుణ్ణి వెంట పెట్టుకు వచ్చాడు వాడు. మార్టిమర్ని చూసి పనిలో పని వీణ్ణి టపా కట్టించేద్దామనుకుంటాడు. మార్టిమర్ పీకకి ఇప్పుడు నలుగుర్ పిచ్చాళ్ళు.
ఈ ఆదరా బాదరా లో మధ్య ఎలేన్ వచ్చి నన్ను పట్టించుకోవా అని అడగడం.
ఇలాంటి పిచ్చి గోల నుంచి మార్టిమర్, ఎలేన్లు ఎలా బైట పడతారనేది మిగతా (నవ్వులు పండే) కధ. కారీ గ్రాంట్ కొంచెం అతిగా నటించినా, సన్నివేశాలు సంభాషణల బలం వల్ల నెట్టుకొచ్చేస్తాడు. ఎలెన్ లా నటించిన ప్రిసిల్లా లేన్ చాలా ముద్దుముద్డు గా కనిపిస్తుంది - ఒక వివాహదేషిని పడగొట్టాలంటే కొంతైనా ముద్దులొలకాలి కదా? పిన్నులు గా నటించిన నటీమణులిద్దరూ అదరకొట్టేస్తారు - వాళ్ళ మాటలన్నీ నవ్వు తెప్పించేవే. టెడి వెర్రి కూడా నవ్వు తెప్పిస్తుంది. ఒక సారి పక్కవాడు తుమ్మగానే “హుమ్, మాకు జలుబు చేస్తోందనుకుంటా” అని వాడు అనే వైనం, తాను రూస్వెల్టుననే భ్రమా, తద్వారా పక్కవారికి వాడు ఇచ్చే సలహాలు, సంబంధిత సంభాషణలూ నవ్వు తెప్పించక మానవు.
వడగళ్ళు పడ్డట్టు టపటపమంటూ ఒకదాని తర్వాత ఒకటి, చమత్కారపు చెణుకులు చెవిన పడుతుంటేనే అర్ధమవుతుంది, ఇదో మాంఛి నాటికనుంచే చేయబడిన సినీ సంకలనమని. ఇప్పటికి ఐదారు, సార్లు చూకాననుకుంటా - అయినప్పటికీ ఎప్పుడైనా కేబుల్ లో వస్తే మళ్ళి టీవీకి అతుక్కుపోతా.
No comments:
Post a Comment