Monday, March 26, 2007

NTR అందం

ఐదారేళ్ళ క్రితమనుకుంటా ఎంటీవీ లో సైరస్ వేసిన ఎన్ టీ ఆర్ వేషం చూసి నేను, స్నేహితులు పగలబడి నవ్వుకున్నాము. యమగోల లోదేమో ఒక సన్నివేశాన్ని బెల్ బాటం పాంటు, పైబొత్తాలు పెట్టని చొక్కా, విగ్గేకాని ఇంకేదీ కాదని కనిపించే జుత్తు - నుదుటిన పడి మెలిక తిరిగిన రెండు వెంట్రుకలూ, వీటితో పాటు కనుబొమలు ఎగరేస్తూ "అమ్మా అమ్మా" అంటూ పరుగెట్టి వస్తున్న సైరస్ ని చూసి మనవాళ్ళూ అస్సలు ఎన్ టీ ఆర్ లో ఏమి చూసి అంత ఆకాశానికెత్తేసారని అనుమానము కలిగింది. పౌరాణికాలలో శ్రీకృష్ణుడి పాత్రల వలనేమో అని సరిపెట్టుకున్నా.

అంటే పాత సినిమాలు దూరదర్శన్ "తప్పదు రా భగవంతుడా; నాన్నకి ఇవి ఎలా నచ్చుతాయిరా బాబు" అనుకుంటూ చూడడం వల్లో, లేక పేర్లలో "స్టంట్స్" లేని సినిమాలేవీ సరిగ్గా చూడకపోవడం వల్లో - మిస్సమ్మ లాంటి గొప్ప సినిమాలు పెద్దగా గుర్తు లేవు మరి.
==
మళ్ళీ మిస్సమ్మ చూసి రెండు వారాలయ్యింది.
"కావాలంటే ఇస్తాలే, నావన్ని ఇక నీవేలే" పాటలో ఎన్ టీ ఆర్ ని చూసి అర్ధమయ్యింది - మామ్మలు, బామ్మలు, పెద్దత్తలు, పెద్దమ్మలు ఆయనది "చంద్రబింబం" లాంటి ముఖమని ఎందుకంటారో. మరంతటి అందగాడు డెబ్భై,ఎనభై దశకాలలో అంతటి మోటు వేషాలు ఎందుకు వేసాడో అని బాధ కూడా కలిగింది.
==
నాలాగే మీరూ ఐదారేళ్ళ క్రితం ఎంటీవీ చూసి నవ్వి ఉంటే - "మిస్సమ్మ" తప్పకుండా చూడండి. మీ opinions కొద్దిగా మారవచ్చు.

5 comments:

Anonymous said...

Just look at the charisma of anna garu - here

http://diversityintelugu.blogspot.com/2006/05/blog-post_20.html

వెంకట రమణ said...

ఆ రోజుల్లో బెల్ బాటమ్ ఫాంటులు ప్యాషన్ కాబట్టి అలాంటి వేషదారణలో కనపడి ఉండవచ్చు. నేను యమగోల 3-4 సార్లు చూసిఉంటాను దానిలో అతని వేషదారణ నవ్వుతెప్పించేదిగా ఏమీ అనిపించలేదు.

ఇక 70-80 దశకాలలో మీరన్న మోటు వేషాల విషయానికి వస్తే ఆరోజుల్లో సాంఘీక సినిమాలు బాగా ఆడుతూడడం వల్ల అలాంటి వాటిలో నటించి ఉంటారు. జనాలు ఆయన పౌరాణికాలను ఎంతగా ఆదరించారో సాంఘీకాలను కూడా అలానే ఆదరించారనేది అందరికీ తెలిసిన విషయమే.

కొత్త పాళీ said...

యాభై ఏళ్ళు పైబడినాక పాతికేళ్ళ కుర్రవాడిలా గంతులు పెడితే ఎబ్బెట్టుగానే ఉంటుంది. కానీ దానిలో కూడా తనదైన స్టైలుని సాధించుకున్న ఘనత ఎన్టీఆర్ దే. అడవి రాముడు, యమగోల, వేటగాడు ఇవన్నీ అప్పటి రికార్డులని బద్దలు కొట్టి విజయవంతమైనాయన్నది మరువలేని సత్యం. తెలుగు చలన చిత్ర రంగంలో బహుశా ఏ హీరోకీ జరగని విధంగా రామారావు అందం రికార్డు చెయ్యబడింది - కొన్ని మచ్చుతునకలు: నర్తనశాల లో మొదట ఇంద్ర సభలో, చివర కౌరవుల మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడూ అర్జునునిగా; శ్రీకృష్ణపాండవీయంలో రుక్మిణిని చేపట్టటానికి విదర్భకి వచ్చి గుడి బయట నిరీక్షిస్తున్న శ్రీకృష్ణునిగా, అదే చిత్రంలో మయసభని తిలకించ వచ్చిన దుర్యోధనునిగా, రామాంజనేయ యుద్ధం లో పట్టాభిషేకం రోజున వంది మాగధులు మేలుకొలుపులు పాడగా కనులు విప్పుతున్న శ్రీరామునిగా - ఇవన్నీ నటన గురించి కాదు, కేవలం రామారావు అందానికి ఉదాహరణలు మాత్రమే.
ఈ తరం ప్రేక్షకులు ఇదికూడా గుర్తుంచుకుంటే మంచిది - చిరంజీవికి యాభై నిండాయి. నాగార్జున ప్రభృతుల వయసుకూడా ఆ వైపుకే కాని ఈ వైపుకి మొగ్గట్లేదు. వీళ్ళు శ్రియ ఇలియానాలతో వేసే గంతులు ఎన్టీఆర్ గంతులకంటే అసహ్యంగా ఉంటున్నాయి. ఠాగూర్ చూసిన ఓ స్నేహితురాలు ఉవాచ - ఇదేదో child abuse కేసు లాగుంది!

రాధిక said...

డబ్బై,ఎనభై దశకాలలో రామారావు,నాగేస్వరరావూ ఇద్దరూ అలానే వుండేవారు.విగ్గులు,ఓవర్ మేకప్,డ్రెస్సింగ్ అంతా పగటి వేషగాళ్ళ మాదిరి వుంటుంది.ఆ సినిమాలు హిట్ అయిన్నా కూడా వాటిలోని వారిని చూస్తే నాకు నవ్వు వస్తూనే వుంటుంది.ఆ మహా నటుల ఇద్దరి అందం చూడాలంటే బ్లాక్ అండ్ వైట్ కాలం లోని సినిమాలను చూడాలి.నేను కూడా వాళ్ళ మాస్ సినిమాలు చూసి వీళ్ళ గురించేనా మనవాళ్ళు ఇంత ఇదయిపోతారు అనుకునేదానిని చిన్నప్పుడు.ఎన్ టి ఆర్ గారి "దేవత" సినిమా చూసి అప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను.ఆ అందమే అందం.ఆ అందాన్ని చూస్తే నాకు ఆనందం.[అమ్మో కవిత్వం వచ్చేస్తుంది]

గిరి Giri said...

మహేష్ గారు,
మీ రాతలు కొన్ని చూసాను. ప్రత్యేకంగా "తెలుగు పనికిమాలిన భాష అవుతుందా" - మీతో పూర్తిగా ఏకీభవిస్తా.

వెంకట రమణ గారు,
యమగోల నాకు నచ్చిన సినిమాలలో ఒకటి..కాని అందులో కొన్ని పాటల్లో హేరో, తనకి కూతురిలా కనిపించే జయప్రదతో చేసే సరసం, ఎబెట్టు వ్యవహారంలా ఉంటుంది. సైరస్ చేసిన పారడీ అదే సినిమాలోదో కాదో నాకు సరిగ్గా తెలియదు.

కొత్త పాళి గారు,
మన హీరోలకి "ఏజింగ్ గ్రేస్ ఫుల్లీ" అనేది తెలియదు. చిరంజీవి, నాగార్జున తమ కొడుకులని తెర మీదకి తోసిన తెరువాతనైనా కనీసం చైల్డ్ అబ్యూస్ ఆపుతారేమో :)

రాధిక గారు,
మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను దేవత సినిమాలో పాటలు చూడడము, ఇంట్లో వాళ్ళ నుంచి కధ వినడమే కాని, సినిమా చూడలేదు. అందులో ఎస్.పీ.కోదండపాణి గారు కూర్చిన "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి.." అనే పాట నాకు చాలా ఇష్టం.