భూకైలాస్ లో సంగీత సాహిత్య పరంగా అన్నీ గొప్ప పాటలే; సముద్రాల రాఘవాచార్య రాసిన పాటలు ఎంతో బావుంటాయి. అందులోనూ "రాముని అవతారం" పాటంటే నాకు చాలా ఇష్టం..ముఖ్యంగా ఆయన
"అదిగో చూడుము బంగరు జింకా,
మన్నైచనునయ్యో లంకా,
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింకా"
చరణంలో ప్రాసని చాలా బాగా కుదిర్చారనిపిస్తుంది.
కొన్ని రోజులనుంచి నన్ను తిప్పలు పెడుతున్న చరణం కూడా ఈ పాటలోనే ఉంది.
"కపట నాటకుని పట్టాభిషేకం,
కలుగును తాత్కాలిక శొకం,
భీకర కానన వాసారంభం,
లోకోద్ధరణకు ప్రారంభం"
అని శ్రీరాముని వనవాసప్రారంభం గురించి చరణం అది.
ఇంతకీ ఇక్కడ కపట నాటకమెవరిది? కైకేయిదా అనుకుంటే మరి పట్టాభిషేకం తనది కాదు; భరతునిదా అనుకుంటే మరి భరతుడికి కపటం లేదే. "కపట నాటకంతో కైకేయి కుదిర్చిన పట్టాభిషేకమని" అర్ధమని సరిపేట్టుకోవాలా?
14 comments:
కపట నాటకుడు అంటే విష్ణుమూర్తి.
కపటనాటకుని పట్టభిషేకం అంటే శ్రీరాముని పట్టభిషేకం.
లలిత గారూ అక్కడ శ్రీరామునికి పట్టాభిషేకం జరగట్లేదుగా? నాకయితే ఈ సినిమాలో "దేవ దేవ ధవళాధర"అన్న పాట చాలా ఇష్టం.
కపట నాటకుడని శ్రీరాముని సూచిస్తున్నారు. "జగన్నాటక సూత్రధారి" అనే బిరుదు శ్రీకృష్ణునికి వర్తించడం చూస్తాం ఎక్కువగా. ఇక్కడ సన్నివేశంలో నారదుడు పరమ వైష్ణవుడు, రామావతారంలో ఇలా జరగబోతున్నదని దివ్యదృష్టితో చెబుతున్నాడు. అంటే ఆ అవతారంలో జరిగే విశేషాలన్నీ సర్వాంతర్యామీ, సర్వ ఘటనాఘటన సమర్ధుడూ అయిన శ్రీ మహావిష్ణువు లీలయే గాని వేరు కాదు. అయ్యో ఈ పట్టాభిషేకం ఆగిపోయిందే అని దిగులు పడక్కర్లేదు. ఆ పట్టాభిషేకం ఆగాలి. తాత్కాలిక శోకం కలగాలి - ఆ తరవాత రావణ వధ అనే మహా యజ్ఞం జరగటానికి.
అదీ కథాసూక్ష్మం.
కొత్త పాళీ గారు వివరణ బాగా ఇచ్చారు.
రాధిక గారూ,
నేను ఆ రెండు ముక్కలూ రాసేసిన తర్వాత
అదే ప్రశ్న వస్తుందని ఊహించాను. వివరణ ఇవ్వడానికి బధ్ధకం కొంచెం, సరైన మాటలు దొరకడానికి కష్టం కొంచెం అనిపించి అంతటితో వదిలేసాను.
ఇక మీరన్న పాట "దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా..."
చాలా బాగుంటాయి భూకైలాస్ పాటలు. అవి గుర్తు చేసినందుకు
గిరి గారికి thanks.
లలిత.
కొత్త పాళీ గారూ,
మీ వివరణ మళ్ళొక్క సారి చదివాను.
కథా సూక్ష్మం బాగా వివరించారు.
ఒక సందేహం. శ్రీ రాముడు విష్ణుమూర్తి అవతారమని, విష్ణుమూర్తిని జగన్నాటక సూత్రధారి అంటారు అని, ఆ జరగబోయి వాయిదా పడే పట్టభిషేకం విష్ణుమూర్తి అవతార రూపమైన శ్రీరామునికి అని చెప్పొచ్చు కదా. శ్రీ రాముణ్ణి విష్ణు మూర్తి అవతారం అనడానికి సందేహమా? ఇందులో నారద ముని వైష్ణవత్వం గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది?
సందేహం తీర్చగలరు.
లలిత.
నా సందేహం తీర్చినందుకు లలిత, కొత్త పాళి గార్లకి కృతజ్ఙతలు.
లలిత గారు, మీ సందేహం తీర్చగలిగిన వారు సముద్రాల గారే :)
శ్రీ రాముని అవతారంలో మహ విష్ణువు కపట నాటకత్వం చాల తక్కువేనని చెప్పవచ్చు.
రాధిక గారు, "దేవదేవ ధవళాచలమందిర గంగాధరా హర నమో నమో" పాట చాలా బావుంటుంది. అవకాశం దొరికితే మిగతా పాటలు వినండి (ఇక్కడ)
కొత్త పాళీ గారూ థాంక్స్ అండి.లలిత గారి సందేహానికి కూడా మీరు సమాధానం చెప్పగలరని అనుకుంటున్నాను
గిరి గారూ,
అరె, నేనా ప్రశ్నను కొత్తపాళీ గారికి వేశాననుకున్నానే?
శ్రీ రాముడి అవతారంలో కపట నాటకాలు అని కాదు నా ఉద్దేశం.
సముద్రాల వారి ఉద్దేశం కూడా, శ్రీమన్నారాయణుని గురించి మాత్రమే "కపట నాటకుడు" అన్న సంబోధన అనుకుంటాను, అవతార పాత్ర వర్ణన కాదు అది అని నా అభిప్రాయం.
ఇందులో నారదుడు శ్రీరామ అవతారం వర్ణిస్తున్నా, ముఖ్య పాత్రను విష్ణుమూర్తి గురించే పాడుతున్నాడు అన్నది నాకర్థమైనది.
నేను ఈ వ్యాఖ్యతో అనవసరంగా సంవాదం పొడిగిస్తున్నానేమో అని అకూడ అనిపిస్తోంది. ఇక ఆపేస్తాను.
లలిత.
లలిత గారు,
నేను మొదట మీ ప్రశ్న చదివి నారదుడు విష్ణువుని పాటలోకి ఎందుకు లాగుతున్నడా అని అడిగారనుకున్నా (అందుకే సముద్రాల గారిని లాగి సమాధానపరుద్దామనుకున్నా); కాని ఇప్పుడు కొత్త పాళి గారు నారదుని వైష్ణవత్వాన్ని సమాధాంలోకి ఎందుకు లాగుతున్నారో అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనిపిస్తోంది. కొత్త పాళి గారికే ఒదిలేస్తున్నాను.
నా సమాధానం మిమ్మల్ని ఆపాలన్న ఉద్దేశ్యంతో చెప్పింది కాదు; సందేహమున్నత వరకు బ్లాగేయడమే, చర్చను లాగేయడమే మంచిదన్నది నా పద్దతి.
కవి అభిప్రాయం భరతునిదే కపటనాటకం అని తెలుస్తున్నదిగదా? మరి పై వ్యాఖ్యాతలది కపటనాటకము కదా?
Ajit,
భరతునిది కపట నాటకమైనట్లైతే పాదుకా పట్టాభిషేకం జరిగేదేకాదు. ఇక కవి అభిప్రాయం గురించి చెప్పలంటే, అదే చరణంలో "భరతుని కోరిక తీరుచు కోసం, పాదుకలొసగే ప్రేమావేశం" అని రాసారు కదా?
భరతుడికేం పాపం తెలుసు పాపం! వట్టి అమాయకుడు. రాజ్యం భోగించే అవకాశం వచ్చినా పాదుకలకే అవకాశం ఇచ్చి వాటి దాసుడిగా మిగిలినవాడు.
ఇక రాముడా, ఆయన జగన్నాటక సూత్రధారి అంశే అయినా జగన్నాటకాలు నేర్పడానికి అవతరించలేదు (అది ఇంకో పాత్ర, కృష్నుడు). ఇక్కడ రాముడు ఉత్తమ పురుషుడికి వుదాహరణ. ఈయన కపట నాటకాలు ఆడకూడదు. కూడనే కూడదు.
--ప్రసాద్
http://blog.charasala.com
ఈ పాటని అర్థం చేసుకోవడానికి కొన్ని సంగతులు గుర్తుంచుకోవాలని నేననుకుంటున్నాను.
1. అసలు సినిమా కథ రావణుడి గురించి - అందులో కథా నాయకుడు రావణుడు.
2. రావణుడు పరమ శివభక్తుడు. దీనికి counter point గా నారదుని విష్ణుభక్తి ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు తారసిల్లిన ప్రతి సారీ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. రాధిక గారు ఉదహరించిన దేవ దేవ ధవళాచల మందిర పాటలోనే ద్వితీయార్ధం నారదుడి చేసే విష్ణు స్తుతి.
3. శివుని వర మహిమ వలన రావణుడి చేతిలో బందీగా ఉన్న పార్వతీ దేవిని అనునయించడానికి నారదుడు ఈ కథ చెబుతున్నాడు. ఈ కథ మామూలుగా చెప్పిన రామాయణ కథ కాదు. ఒక ప్రయోజనం కోసం ఒక దృక్కోణం నించి ఒక లాంటి మనోభావాలున్న పాత్ర తన వ్యాఖ్యానంతో సహా చెబుతున్న కథ.
నారదుడి వైష్ణవం ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే ఆయన దృష్టిలో విష్ణువే పరమాత్ముడు. ఈ భక్తుడి గొంతు పాట మొదటినించీ చివరి దాకా స్పష్టంగా వినబడుతుంది.
"ద్వార పాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో .. రాముని అవతారం .. రవికుల సోముని అవతారం"
ఇలా ఎత్తుగడ దగ్గర్నించీ ప్రతి ఘట్టంలో, ప్రతి చరణంలో తన వ్యాఖ్యానంతో పరమాత్మ రూపంగానే చెపుతాడు.
దీనికి తులనాత్మకంగా "అహో రామ కథ", "ఏమి రామ కథ శబరీ శబరీ", లవకుశ సినిమాలోని మూడు రామాయణం పాటలనీ గమనించండి. అవన్నీ రాముణ్ణి మనిషిగా, కథానాయకుడిగా చూస్తాయి. పాడిన వారు రామ భక్తులే గానీ పరమ వైష్ణవ తత్వాన్ని తెలుసుకున్నవారు కాదు. అదీ నారదుడి వైష్ణవత్వం విశేషం.
ఇంకో కథా సూక్ష్మం ఏవిటంటే - రావణుడు హీరోగా ఉన్న సినిమాలో వాడుత్త వెధవ, రాముడు పుట్టి వాణ్ణి చంపుతాడులే అన్నట్టు రామకథ చెప్పటం కథా మర్యాదకి వ్యతిరేకం - మన హీరోని మనమే విలన్ గా చేసుకోవటం కూడదు. అందుకని రావణుడికి counter point గా నారదుణ్ణి పెట్టి ఆయన గొంతుతో రామ కథ చెప్పించారు.
ఇది మీ సందేహాల్ని తీరుస్తుందని ఆశిస్తున్నాను.
Kotta paaLI gaaru,
thanks for the explanation.
My particular doubts about your previous explanation are cleared.
Regards,
lalitha.
Post a Comment