Sunday, September 13, 2009

మద్భావజాలావిష్కృతి

ఇక ఇక్కడ తప్పటడుగులు వేయదలుచుకోలేదు. క్రొత్తగూటికి ఈ రోజే శ్రీకారం చుట్టాను, చూడండి

http://bhaavamulona.blogspot.com/

Tuesday, August 25, 2009

వినాయక చవితి


అఘవిఘ్నంబులు మాన్పగా నలుగుబొమ్మై పుట్టినాడీతడే
లఘురూపంబున గోచరించు నలఘ్యాలంఘ్యంబులౌ కార్యధౌ
ర్య ఘనుండీతడె స్యందనంబుగ బిలాధ్యక్షున్ భరించే ఘనా
నఘ దైవంబితడే భవాదులకు మాన్యంబైన ఘృణ్యాకృతిన్
వచ్చి
వడపప్పు పానకాదులు
కుడుములు పరమాన్నమున్ను గుడపిష్టంబున్
కడుపార తిన్న, గిరిపౌ
త్రుడి పూజ జరిపి యే నేడు తుష్టుండైతిన్

Saturday, August 22, 2009

లవ్ ఆజ్ కల్


సిక్కుల మొగవారు సింహశార్దూలాలు
మగతనానికి వారు మారుపేళ్ళు
సిక్కులౌ ముదితలు చక్కెర శిల్పాలే
తియ్యందనానికి తిరుగులేదు
సిక్కుల ముదుసళ్ళు చింతపచ్చళ్ళలా
ఈడెంత వచ్చినా ఈచుపోరు
సిక్కుల చుట్టాలు చింతలు చీకాకు
లు మటుమాయం జేయు లొల్లిగాళ్ళు

సిక్కుల వివాహ మందురా? చెప్పనలవి
కాదె, అదొక హమాప్కె హై కౌను వంటి
దేను, హంగు హంగామాల తీపి కలయి
క, కనులకు పండువ, సినిమా కథలలోన

లవ్ ఆజ్ కల్లో నాకు నచ్చినవి:
1. సంభాషణలు
2. పాటలు
3. కథనము (ఆసక్తికరమైన ఫ్లాష్ బాక్ ని కథలో బాగా చొప్పించాడు దర్శకుడు)

నచ్చనివి:
1. దీపికకి జోడిగా నప్పని పాత్రలో సైఫలీ ఖాన్.
2. పాతచింతకాయ పచ్చడి లాఁటి కథ
3. రెండవ భాగంలో సాగతీత

సిక్కుల జీవనవిధాన్నాన్ని (ముఖ్యంగా వివాహాది మహోత్సావాలని) హింది సినిమాలు భలే రొమాంటిసైజ్ చేస్తాయి, లవ్ ఆజ్ కల్లో కూడా అదే కనిపిస్తుంది. ఈ సినీ పోకడల ప్రభావం వల్ల కొద్దికాలంలో మన కుర్రకారు కూడా ఇళ్ళల్లో పేచీ పెట్టి తమ పెళ్ళిళ్ళు సిక్కుల తరహాలో చేయించుకుంటామంటారేమో అనిపిస్తుంది నాకు!

కమీనే - మహ చెడ్డ చిత్రం (its wicked bro!)

నత్తి తొస్సల అన్నదమ్ములు, నార్కొటిక్కులు, గన్నులూ,
ఉత్తి మాటల మాటకారులు, ఊరడింపులు, ప్రేమలూ,
కుత్తుకోతలు, వెన్నుపోటులు, కుమ్ములాటలు, హత్యలూ,
రిత్తగాళ్ళకి రిత్తచావులు - రెండుగంటల రైడులో

Monday, December 29, 2008

Madagascar 2

గునిసియాడు ‘అలెకి’ యనెడు సింగడొకడు
గఱువ చారల-తురగమ్ము ‘మార్టి’
మృదు మెతక జిరాఫు, ‘మెల్మాను’ యనువాడు
‘గ్లోరి యా’ను నీటిగుఱ్ఱ మొకతె
వీరి గాధలేను వేరుకథలు గావు
మీకు చెప్పుచుంటి నేక బిగిన

Sunday, December 28, 2008

సెక్యులరిజము సొల్లు

(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)

హైందవ పండితులం దండితుల జేసి,
తరిమికొట్టుట పెద్ద తప్పుకాదు
దేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,
దాడుల గూల్చిన తప్పులేదు
ఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,
పెచ్చరిల్లుట కాదు పెద్ద మాట
మతఛాందసుల వల్ల మనతల్లి భారతి,
తల్లడిల్లిన పెద్ద తంతు కాదు
'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుట
శాంతి భద్రతలకు చావుదెబ్బ'

సెక్యులరిజమంచు
చెల్లు కబురులు గార్చు
మతపక్షపాత భ్రమణమతులు
ప్రజకు హక్కులంచు,
ప్రగతి పథములంచు
ఎన్నికలను దెచ్చి,
ఎన్నొ కలలు చూపి,
ప్రజల కోర్కె చూచి,
ప్లేటులు ఫిరాయించి
తిక్క మాటలెంచిరేల?

"The rise of BJP in the border state which is facing terrorism is a worrying factor for the entire country," he said.

ఉగ్రవాదం పెరగడం కాదు, ఎన్నికలలో మందంజ వేసిన పార్టి వల్ల భయపడాలనేది ఆజాద్ సొల్లు వాగుడు. ఏంటో ఈ గోల?!

Friday, December 26, 2008

Oye Lucky! Lucky Oye!

సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది,
సొంతము కాదని చూసుకోడు
మెచ్చిన వస్తువు నచ్చినరీతిన

చంకనవేసుకు జారుతాడు
బాకులు కత్తులు పట్టని చోరుడు,

మాయలు నేర్చిన మాటకారి
తీయని తేనెల మాయల మాటల

మూటలు మోసిన మోసగాడు

ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ
బూటకాల నల్లు ఆటగాడు
రెప్పపాటులోపె తప్పుకు పోతాడు
హుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’


వివరాలు ఇక్కడ చదవండి.

Saturday, December 13, 2008

Rab ne bana di jodi

(ఆదిత్య ఛోప్రా వచ్చి..)
కం. నిచ్చెనిదే స్వర్గానికి
తెచ్చితినోయ్ చూడమంటు తెర చూపంగా
అచ్చెరువొందిన సుజనులు

వచ్చిరి తచ్చన తెలియక పరువిడి వడిగా

కం. మురిపెము ముచ్చట మీరగ
బిరబిర మూగిన జనమిక బిమ్మిటిగొనగా
అరచేతిలోని స్వర్గము

తెరకెక్కదనే నిజమ్ము తెలిసెను తొరగా

వివరాల కోసం ఇక్కడ నొక్కండి త్వరగా

Sunday, October 12, 2008

ఏడాది నిండింది

నేను పద్యాలు వ్రాయడం మొదలు పెట్టి అక్టోబర్ పదికి ఏడాది పూర్తయ్యింది. అంతకు పూర్వం ఛందో బధ్ధమైన పద్యాలు వ్రాయాలని కోరికే తప్ప ఎలా వ్రాయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న నాకు ఆ ఆంజనేయస్వామి దయవల్ల కాస్తో కూస్తో గణాల గుణాలు వంటబట్టినాయి.

నేను చూస్తున్న చిత్రాలను గూర్చి వ్రాసిన మొదటి ఉత్పలమాల తరువాత, అమెరికాలో నా కారు నడపడం ఓ కొత్త మలుపున పడిందనే చెప్పచ్చు - సాధారణంగా ఎన్పీఆర్ లేక పాత తెలుగు పాటలు వినేవాణ్ణి పద్యాలల్లడంలోనే గడపడం ప్రారంభించాను. అక్టోబరు, నవంబరు నెలల్లో వీలు దొరికినప్పుడల్లా, మనసుకి నచ్చిన విషయం అందినప్పుడల్లా పద్యాలు కూర్చడానికి ప్రయత్నాలే. ఉల్లాసంగా దొర్లిపోయిన కాల మది.

ఆ ప్రవాహం సింగపూరుకి చేరిన కొత్తలో కొంచెం కుంటువడినా ఇప్పుడు మళ్ళీ వ్రాయడానికి ఉత్సాహం, అవకాశాలు, వ్రాయగలనన్న నమ్మకం ముప్పిరిగొన్నాయి. ఈ సమయంలోనే రెండు అభినవ భువనవిజయంలో పాల్గొనడానికి అవకాశమిచ్చి నా ఉత్సాహానికి ప్రోత్సాహాన్ని అందజేసిన పొద్దు సంపాదకవర్గానికి నా కృతజ్ఞతలు.

నేను వ్రాసిన పద్యాలను మెచ్చుకుని, తప్పులుంటే నిర్మొహమాటంగా తెలిపి కొత్త విషయాలు తెలిపిన బ్లాగ్మిత్రులైన - కొత్తపాళీ గారు, వాగ్విలాసం రాఘవ (కొన్ని టపా వ్యాఖ్యల్లో రాఘవతో ఆడిన గొలుసు వృత్తాల ఆటలు నాకిప్పటికీ గురుతే.), వికటకవి, చదువరి, రానారె, శ్రీరాం, రాకేశ్వర రావు, ఊదం, బ్లాగేశ్వరుడు -వీరందరికీ వేవేల నెనరులు.

పదేళ్ళ పాటు, ముందు పైచదువుల వలన అటుపై వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశం బయట నివసించడం వల్ల - ఇంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు తప్ప- తెలుగులో సంభాషించే అవకాశాలు లేక, నెమ్మదిగా తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోయిన నాలో స్వభాషాభిమానాకి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులే చెందుతుంది. వీరికి నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు.

నేను మొదట నేర్చుకున్న ఛందస్సులో తప్పులు ఈ మధ్యనే అవగత మయ్యాయి. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, భైరవభట్ల కామేశ్వర రావుగారు, చింతా రామకృష్ణారావు గారు - ముఖ్యంగా ఈ మువ్వురి చలువవల్ల నాకు కొత్త విషయాలు నేర్చుకుని, తప్పులని సరిదిద్దుకునే అవకాశం లభించింది. వీరికి నా వందనాలు.

ఇక వీలు దొరికినప్పుడు పూర్వం వ్రాసిన పద్యాలలో దొర్లిన తప్పొప్పులను సరి దిద్దాలనుకుంటున్నాను.

ప్రస్తుతానికి నేను వ్రాసిన వాటిల్లో నాకు కొద్దో గొప్పో సంతృప్తినిచ్చిన పద్యాల లంకెలివిగో.

౧.
గణాధిపతి కి నమస్సుమాంజలులు
౨. మిస్సమ్మకు మత్తకోకిలలు
౩. గుండమ్మకి సీసాలు
౪. మాగీకో మాల
౫. తేట తెలుగు పలుకు
౬. పదహారు పాదాల అప్పుల తిప్పల ఉత్పలమాల
౭. పదహారు పాదాల
బీ మూవి మత్తకోకిల
౮.
మా లెక్కల మాస్టారికి చంపకమాలాంజలి
౯. ఒబామకి ఆంగ్ల వృత్తం

Tuesday, September 30, 2008

గూగుల్ వార్తలు

కడు గర్మాగరమైన* వార్తలను సౌకర్యమ్ముగా సేకరిం
చెడి గూగుల్ మన భాషలో విడుదలై శ్రీకారమీరోజునే
చుడితే వార్తల గూటికై, భళిభళీ చూడండనే గోల చే
యడమే నా పని, బాగుబాగనుచు సాయంచేయడం మీ పనీ

गरमा गरम