Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Sunday, December 28, 2008

సెక్యులరిజము సొల్లు

(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)

హైందవ పండితులం దండితుల జేసి,
తరిమికొట్టుట పెద్ద తప్పుకాదు
దేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,
దాడుల గూల్చిన తప్పులేదు
ఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,
పెచ్చరిల్లుట కాదు పెద్ద మాట
మతఛాందసుల వల్ల మనతల్లి భారతి,
తల్లడిల్లిన పెద్ద తంతు కాదు
'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుట
శాంతి భద్రతలకు చావుదెబ్బ'

సెక్యులరిజమంచు
చెల్లు కబురులు గార్చు
మతపక్షపాత భ్రమణమతులు
ప్రజకు హక్కులంచు,
ప్రగతి పథములంచు
ఎన్నికలను దెచ్చి,
ఎన్నొ కలలు చూపి,
ప్రజల కోర్కె చూచి,
ప్లేటులు ఫిరాయించి
తిక్క మాటలెంచిరేల?

"The rise of BJP in the border state which is facing terrorism is a worrying factor for the entire country," he said.

ఉగ్రవాదం పెరగడం కాదు, ఎన్నికలలో మందంజ వేసిన పార్టి వల్ల భయపడాలనేది ఆజాద్ సొల్లు వాగుడు. ఏంటో ఈ గోల?!

Saturday, September 06, 2008

కత్రినా కోశి

ఇవి బిహారు జన పరిస్థితి గురించి చదివి నేను క్రోధితుడనై వ్రాసిన ముక్కలు.

కత్రినా యుప్పెన కట్టలు ద్రెంచుచు
క్రౌంచ భూమండలి ముంచిదేల్చి
చెప్పిన గుణపాఠ మిప్పటికి గురుతే
కనుకనే గుస్తావు కనకరించె
తొల్లి తల్లడివడె తల్లి మన భరతా
వని వెల్లువల వెల్లి* వాతబడుచు
గురుతుండ వివిగాన గుడ్డిమాలోకాన
కడివోయె* కోశి శోకములుదెచ్చి

ముందు దెబ్బమోది నుడువ* మొగ్గుజూపు
దండ భేద నీతుల నమ్మియుండు గండ
కొన్ని కయ్యాల కొనిదెచ్చుకొన్న జార్జి
బుస్సుమంటు పైకురికెడి బూచిగాడు

మిగుల నపకీర్తి నార్జింప దగిన వాడె
ముందు తాజేసిన తలతిక్క దిగువాయి
పనుల సరిదిద్దె బగ్గీజి* పట్టణంపు
ప్రజకు జతగ నిల్చె వరదబాధ బాపి

ఈ సారి గుస్తావు నేలతాకక మునుపే (ఫీమాతో సహా) అందరినీ సమాయత్తం చేసి సిధ్ధంగా ఉంచాడు జార్జి బుష్షు. హోంవర్కు చేసుకొచ్చిన వాడి పుస్తకం మాస్టారు తనిఖీ చేయనట్టు, గుస్తావు వీరి సంసిధ్ధతని పరిక్షించలేదు. మనవాళ్ళు ఇలాగ హోంవర్కు చేసి ఎన్నాళ్ళయ్యిందో - ఇంకా ఎన్నాళ్ళు పకృతి మేష్టారి దెబ్బలు తినాలో?

లాలు లాలూచిగాడని ఱాలు ఱువ్వు
చేతగాని వాడని గ్రుచ్చిచెప్పు నిశిత
బుద్దిశాలి నితిశుడేమి బొడిచె నీట
మునుగుచుండ బీహారి యూళ్ళు నగరములు

నితిశ్ సంగతి అటుంచితే, మన మన్మోహను డేమి ఒలక బెట్టాడు?

ఒకానొకప్పుడు,

విత్తపు మంత్రి పదవియం
దుత్తముడు ప్రగతికి దోహదుండయి గమనం
బత్తమిలకుండ సతతం
బుత్తలపడువాడు సత్తముండయి జనియెన్

తదనంతరము,

సాటియె లేడెవ్వడతని
పాటికి రాడెవ్వడనుచు పాటవమున నా
రాటము మీఱగ పీఠం
బేటలు వేయక* నొసగుటె బీజంబయ్యెన్

ఠక్కున నిర్ణయాలు తీసుకోలేని ఓ తోలుబొమ్మ దేశానికి ప్రధాని అయి కూర్చుని యుండడానికి.

నోట నాలిక లేదయె వేటికైన
సోనియా తల్లి దీవెనలైన లేని
పనుల ముట్టని మన ప్రధాని నిమిషాల
మీద నిర్ణయా లెటుల తర్ఫీదు చేయు?

వెల్లి: పరంపర
కడివోయె : చెడ్డదయ్యెను
నుడువ : మాటలాడ
బిగ్గీజి : బిగ్ ఈజి, కొత్తార్లియన్సుకి మారు పేరు
ఏటలు చేయక: గొడవ చేయకుండా

Tuesday, September 02, 2008

పప్పులో బ్రిస్టల్ కాలు

పేలిను కూతురి జారిన
కాలుని పట్టుకుని జాన్మెకైనుని కుమ్మే
య్యాలని కుత్సిత మొద్దని
తాలిమి విలువని తెలిపిన స్థైర్యమొ
బామా

Sunday, August 31, 2008

McCain, Sarah Palin

ష్రెక్కు గాడిద కలిసి మొదటి సారి పొట్టి రాజు ఫార్క్వార్డు వద్ద కెళ్ళి నప్పుడు, ఆకాశాన్ని తాకే వాడి రాజభవనాన్ని చూసి ష్రెక్కు “తన దగ్గర ఏదో తక్కవైన దానికి సంజాయిషీలా కట్టాడు కదా” అంటూ వెకిలి నవ్వు నవ్వుతాడు. జాన్మెక్కేను సారా పాలిన్ని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నప్పుడు నా కదే గుర్తుకొచ్చింది.

నెత్తిన పచ్చిక బొత్తిగ నిల్వని
బట్టబుఱ్ఱడి కుండు జుట్టు పిచ్చి
తనవద్ద లేనట్టి తాయిలంబునుజూచి
తారాడు మ్రుచ్చుని దగులు పిచ్చి
సత్తువ లుడిగిన ముత్తాత కొచ్చెనో
పరువంపు వంపుల పడతి గాంచి
సూదంటుఱాయిని కాదంటు త్రోయని
లొంగేటి మ్రుక్కడి లోహమల్లె

లొంగినట్టున్నాడు మెకేను దిగులుతో త
నకెదురు నిలబడ్డ నవకిశోరు
గాంచి యనుభవజ్ఞుడనని గంతులేయు
వాడె చివురు మొలక వలతి నెంచి

Wednesday, June 04, 2008

Obama beats Clinton

సీ. తలకు మించిన పని తలపెట్టి వెరువక
వాదాడు తాబే లొబామ వలన,
గెలుపు నాదేయంచు గీరతో నిక్కిన
కుందేలు క్లింటను కూలబడెను,
తలలు పండిన పండితు లెవరూ కలలోన
సైతము సాధ్యమని, తలపోయ
దలచని మలుపున, తలవంపు లయ్యనే
ముందుండి తగ్గిన ముదిత కిపుడు

చావుదెబ్బ పడెను, చేవ తగ్గదికను,
తగ్గదేమి పొలతి యొగ్గదేమి?
చెప్పనలవి కాదు, పప్పులో పడె కాలు,
తప్పుకోని హిలరి తర్కమేమి?

Sunday, September 30, 2007

మండేలాని చంపేసిన బుష్

వెనకటికి ఒక మంద బుధ్ధి ఉండే వాడట. వాడికి తర్కమంటే ఏమిటో తెలియదు కానీ తెలివిగా వాదించడమంటే మహా పిచ్చి.

వాడు ఒక స్నేహితుణ్ణి పట్టి, "ఒరే బాబూ తర్కమంటే ఏమిటో వివరించరా" అని అడిగాడు. మన వాడి వాలకం తెలిసిన స్నేహితుడు ఒక క్షణం ఆలోచించి, "సరే నీకు ఇల్లుందా?" అన్నాడు. ఉందన్నాడు మబ్బు. "మీ ఇంట్లో మొక్కలున్నాయా?" , ఉన్నయన్నాడు మబ్బు. "మొక్కలకి మీ ఆవిడ నీళ్ళు పోస్తుందా?" పోస్తుందన్నాడు మబ్బు. "మీ ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలున్నాయా?" ఉన్నాయన్నడు మబ్బు. "దీని వల్ల తెలుస్తున్నదేమిటంటే, నువ్వు నీ భార్య ప్రేమతో మీ ఇంట్లో కలవడం వల్ల మీకు పిల్లలు పుట్టారు" అన్నాడు స్నేహితుడు. ఇంతటి వ్యక్తిగత విషయం నీకెలా తెలిసిందన్నట్టు విస్తుపోయాడు మబ్బు. "అదేరా అబ్బాయ్ తర్కం అంటే" అని వెళ్ళిపోయాడు స్నేహితుడు.

కాసేపు ఆలోచించి మంద బుధ్ధి ఇంకో స్నేహితుడి వద్ద ఈ తర్కం ప్రయోగిద్దామని వెళ్ళాడు. వాడితో "నీ గురించి నేను అత్యంత వ్యక్తిగత విశేషాలు తెలుసుకోగలను" అన్నాడు. అదెలా అనడిగాడు స్నేహితుడు. "నీకు ఇల్లుందా" అన్నాడు మబ్బు. ఉందన్నాడు స్నేహితుడు. మీ ఇంట్లో మొక్కలున్నాయా అన్నాడు మబ్బు. ఉన్నాయన్నడు స్నేహితుడు. మొక్కలకు మీ ఆవిడ నీళ్ళు పోస్తుందా అన్నాడు మబ్బు. లేదు పక్కింటావిడ పోస్తుంది అన్నాడు స్నేహితుడు. "ఐతే నువ్వు మీ పక్కింటావిడా ప్రేమతో మీ ఇంట్లో కలవడం వల్ల మీకు పిల్లలు పుట్టారు" అన్నాడు మబ్బు.

==

ఈ హాస్యోక్తి అవసరం ఎందుకొచ్చిందంటే, అటువంటి సంఘటనే క్రితం వారం జరిగింది. నిజంగా జరిగిన ఈ సంఘటనలో మబ్బు మరెవరో కాదు, సాక్షతూ అమెరికా రాష్ట్రపతి. ప్రసంగాలలో, పాత్రికేయుల సమావేశాలలో, ఇతర చోట్లలో ఈయన వెలగబెట్టే నిర్వాకాలు ఇప్పటికే జగత్ప్రసిధ్ధి కలిగి ఉన్నాయి. పదాలని సరిగ్గా పలకలేకపోవడం, ఆస్ట్రేలియాని ఆస్ట్రియా అని తికమక పడడం, ఇంగ్లాండు రాణిని వందేళ్ళకి పైగా చేసిన పనికి అభినందించడం - ఒకటేమిటి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు, బుషిసమ్స్ అంటూ పుస్తకాలు కూడా వెలువడ్డాయి.

సరే తాజా సంఘటన విషయానికొస్తే, ఇదంతా కాండలీసా రైస్ ఇచ్చిన ఒక ముఖాముఖితో మొదలయ్యింది.ఇక్కడ చదవండి. అందులో ఆవిడ ఇరాక్ లో నెల్సన్ మండేలా లాంటి ప్రజాతంత్ర నాయకులు ఎందుకు లేరు అనే ప్రశ్నని ప్రస్తావించి, సద్దాం అలాంటి నాయకులందరినీ ఎప్పుడో మట్టుబెట్టాడని, అందువల్లే ఇప్పుడు రాజకీయ శూన్యత (political vacuum) ఏర్పడిందని చెప్పింది. బానే ఉంది. ఇప్పుడు మొదలయ్యింది అసలు కధ. ఈ ముఖాముఖి వినడంవల్లో ఏమో గానీ డుబ్యా గారికి పైన చెప్పిన మబ్బుగాడికి తట్టినట్టి ఆలోచన తట్టింది. రైస్ చెప్పిన విషయాన్ని పాత్రికేయులకు తన మాటల్లో చెప్పి తన తెలివి ప్రదర్శిద్దామనుకున్నాడు. పాపం ఉపాయం బెడిసికొట్టింది. ఇక్కడి దృశ్యకం (video) చూడండి. బుష్ చెప్పిందేమిటంటారా

ఎవరో అంటుంటే విన్నా "మండేలా ఎక్కడ" అని. నేనన్నా "మండేలా
చచ్చిపోయాడు. సద్దాం చంపేసాడు. మండేలాలందరినీ సద్దాం చంపేసాడు

పాపం ఇది విన్న దక్షిణాఫ్రికా దేశస్తులెందరో మండేలా నిజంగానే కాలంచేసారేమోనని ఆదుర్దా పడ్డారట. అలాంటిది ఏమీ లేదని ఆ దేశస్తులని అక్కిడి అధికారులు సమాధాన పరచవలసి వచ్చింది. అమెరికాకి ఇది అవమానకరం కాదా?

బుష్ లాంటి మబ్బు నేతలుంటే దేశానికి ఆర్ధికంగానే కాక, ప్రతిష్ఠా పరంగాకూడా నష్టాలు తప్పవు మరి.

Friday, September 14, 2007

రాజుని ఎలా మెప్పించడం?

"రాజుకు కోపం ఎక్కువైతే సద్దుమణిగిపడుండి మెప్పించవచ్చు, అసహనం ఎక్కువైతే ఓర్పుగా వ్యవరహించి మెప్పించవచ్చు, గర్వం ఎక్కువైతే ముఖస్తుతి చేసి మెప్పించవచ్చు, జూదగాడైతే పాచికలతో మెప్పించవచ్చు, లోభి ఐతే డబ్బు విషయంలో జాగ్రత్త వహించి మెప్పించవచ్చు, బధ్ధకస్తుడైతే పనులు చక్కబెట్టి మెప్పించవచ్చు..మరి రాజు నేటి రాజకీయనేతలనేతలదన్నేతల ఉన్నవాడైతే? మెప్పించడం మాటటుంచి బ్రతికితే బలుసాకు తినవచ్చునని దేశంనుండి పరిగెడితేనే తలనిలవవచ్చు."

ఒకప్పుడు బక్షీ, చంద్రశేఖర్ అని ఇద్దరు బ్రతకనేర్చిన నేర్పరులు రాజకొలువులో ఉద్యోగం చేసేవారు. రాజు ఇంతకాలం చేసిన పనులని చూసి హిందువులంటే అతనికి కిట్టదనే అభిప్రాయానికి వారు వచ్చారు. ఇంకేముంది హిందువులకి ఆరాధ్యదైవాన్నెవరినైనా దుయ్యబడితే రాజు పిలిచి సత్కరిస్తాడనుకుని అదే పని మీద నిమగ్నమైపోయారు. సత్కారం దొరుకుతుందని ఎదురుచూస్తే రాజు "తల తీస్తా వెధవాయిల్లారా" అని బెదిరిస్తే, ఎటూ అర్ధం కాక వాళ్ళిద్దరూ పైవిధంగా వాపోయారు.. వారి దుస్థితిపై ఇంకా వివరాలు ఇక్కడ చదవండి.