Friday, November 30, 2007

తేట తెలుగు పలుకు - 3

ఉ. వెడ్డికి crazy, కోపమదె పెచ్చిన madవు,నీరు wateరే,
గడ్డికి graసు చెడ్డికి నిఖార్సుగ knickeరు, దొడ్డి yardయే,
ముడ్డికి bum butt, మలమూత్రము poopలు pissలయ్యెనే,
foodన భోజనంబు పడు బొంతలు mattress bedలయ్యెనే,

ఆ.వె. సిగ్గువల్ల కొన్ని, ఛెంగున ఆంగ్లము
పల్కి గొప్పకొట్టవచ్చు పక్క
వారి ఎదుటనుకొను వారివల్ల మరిన్ని
తెలుగు పదములు పలు తెరమరుగవు

==

పై పద్యంలో గణాలు సరిగా పడాలంటే ఇలా చదువుకోమని మనవి.

ఉ. వెడ్డికి క్రేజి, కోపమదె పెచ్చిన మాడవు,నీరు వాటరే,
గడ్డికి గ్రాసు చెడ్డికి నిఖార్సుగ నిక్కరు, దొడ్డి యార్డయే,
ముడ్డికి బమ్ము బట్టు, మలమూత్రము పూపులు పిస్సులయ్యెనే,
ఫుడ్డన భోజనంబు పడు బొంతలు మేట్రెసు బెడ్డులయ్యెనే

Monday, November 26, 2007

Black Friday

ఉ. రాతిరి నిద్రమానుకొని లైనులలో నిలుచుండి సాహసో
పేతముగా పరాయిల సమేతులుగా పడి మంచి డీళ్ళకై
చూతురు చౌక బేరములు సొంతము చేసుకొనంగ చేయరే
ఖాతరు -దండుకొంచు పలు
గాడిద మోతలు- పక్కవారలన్
(తైతకలాటలాడుదురు థాంక్సుగివింగని బేరమాటలో)


That's precisely the response marketers want from the customers year after year. Just for a few throw-away deals hundreds of people flock the stores, jostling and elbowing each other out to lay hands on that ONE deal. Many end up picking up the 'also-ran' items, which again is true to marketers' script :)

Wednesday, November 21, 2007

Happy Thanksgiving!

చ. కలవరు, చూడరారు, పలుకైనను (బంగరమయ్యెనా, అదే!)
పలుకరు, దూరముండి ఎడబాటులు ప్రేమను పెంచు నందుకే
బలపడు తల్లిదండ్రులన బంధము, జీవిత సత్యమింకిదే
తలతురు, ఏటికో తడవ థాంక్సుగివింగని గుమ్మిగూడుతూ

ఇదండి, అమెరికన్ల తంతు. ఏది ఏమైనా పండగ పండగే కదా? మీకందరికీ శుభాకాంక్షలు.

Ratatouille

ఉ. లొట్టలు వేసి జిహ్వ చవులూరెడి పాకము చేయబూనెనో
చిట్టెలుకెన్నొ వంటలవిశేషములన్ పిడికొట్టి, పూటకూ
ళ్ళట్టి ప్రదేశముల్ వెతికె; “రాటటుయీ” యను వంటకంబు చే
బట్టె ప్రభంజనమ్ముగ అమాంతము వీచె పరంగు మెప్పుకై

పరంగుల (French) మెప్పించింది కాని, నాకు పెద్దగా నచ్చలేదు Ratatouille.

Tuesday, November 20, 2007

అర్ధనారీశ్వర స్తోత్రము - వ్యాఖ్య

ముందు రాఘవ రాసిన అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. అందమైన ఆ స్తోత్రం మీద నా వ్యాఖ్య ఇదిగో..

సీ. ఒక పాదమమ్మకునొప్పగనింపుగ,
మరుపాదమొప్పెను హరునికింక
ఒక పాదమదెనయ్యెనొంపు గునిసియాట,
మరుపాదమవ్వగ భవుని తాండ
వము, ఒకపాదమమ్మకు భూషణమయెను,
మరుపాదమయ్యెను పన్నగముగ,
ఒకపాదమును చూచినేకైకమిదియన్న,
మరుపాదమంతనె వచ్చి నిలిచె

తే.గీ. అర్ధనారీశ్వరుల తత్వమంత కనుల
ముందు నిలుపు స్తోత్రములివి, సుందరముగ
అద్వితీయద్వితయమును హృద్యమైన
పద్యములపొదిగిన సుమమాలికలివి

Monday, November 19, 2007

Bee Movie

నిన్న బీ మూవి చూసాను. నేను చూడకముందే శ్రీమతి చూసి దాన్ని ఆకాశానికి ఎత్తేసి నాలో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇద్దరికి సైన్ ఫెల్డ్ అంటే తెగ ఇష్టం, ఆతడు ఎన్నో ఏళ్ళ తర్వాత కొత్త ఛలోక్తులతో ముందుకు వస్తున్నాడనగానే ఇద్దరకి ఆపాటికే మైకం కమ్మినంత పనయ్యింది. చివరకి తేడా ఏమిటంటే, తనకి నచ్చింది, నాకు (ఆకాశాన్నంటిన ఆశలవల్లనో ఏమో) ఫర్వాలేదనిపించింది. గ్రాఫిక్సు అవి బాగానే ఉన్నాయి (గ్రాఫిక్వీరులు తేనెనెంత "రుచికరంగా" చూపించారంటే చూస్తున్నంతసేపూ ఇంటికి రాగానే ఒక చుక్క నాకితీరాలిరా బాబు అనిపించింది). కొన్ని చోట్ల సైన్ ఫెల్డ్ మార్కు జోకులు పేలాయి. కాని చిక్కల్లా అలాంటి సందర్భాలు ఎక్కువలేకపోవడమే. తమ తేనెనంతా భుక్కుతున్నారని కోపంతో మనుషులపై దావావేసి నెగ్గే ఒక తేనెటీగ కధే ఈ చిత్రం. నిలు గీతలా సూటిగా, ఎక్కడా మలుపులు లేకుండా, సాగిపోతుంది కధనం ఆసాంతం. చిన్న పిల్లలుంటే వాళ్లని తీసుకెళ్ళచ్చు. థియేటర్లో చప్పట్ల జోరంతా వారిదే.

బీ మూవీ మీద పదహారు పాదాల మత్తకోకిలిదిగో..

మ.కొ. తీయతీయని తేనెపట్టుల తేనెటీగలు ఏకమై
“ఓయి మానవ, తేనెచౌర్యము ఒప్పబోమిక మేము, కా
దోయి భావ్యము, చిన్నవారల దోచి పీల్చుట పిప్పిగా
మాయచేసితివెన్నొ మారులు, మాకు చెందిన తేనెలే
వాయువేగమె వట్టిదౌవిధి వాయినాలుగ మెక్కుతూ
కాయకష్టము చేయువారము కయ్యమాడము వట్టిగా
హాయిహాయిగ బానిసత్వపు ఆటపాటల తేలుతూ
రేయిపొద్దులు రాణికోసమె లేచిసాగుటె మాపనోయ్
చేయి సాయము చేయగల్గిన జిత్తుసేతలు మానుకో
సాయమందుచు మమ్ములీగతి చౌకబారుగ చూస్తివే
రాయి రప్పలు తప్పనిల్వవురా, మరెక్కడ భూమిపై
చేయమంటిమ పాలినేషను చెట్టుచేమలే మాయమై
ఓయి మానవ, కోర్టు కేసని, ఉత్తిమాటలు మానవోయ్
మాయమాటల లాయరాటలు మాకు రావని నమ్మకం
మాయమవ్వగ మీకుతెల్వగ వాగ్వివాదము చేసెదం”
తీయమాటలు మాని పల్కెను, తిట్లవర్షము గుప్పుతూ

Sunday, November 18, 2007

ఓ గణాధిపా నీకు మ్రొక్కెదన్ - 2

చ. గణములకాధిపత్యమును గైకొన వేడగ తల్లిదండ్రులన్
అణకువతోడ; తమ్ముని, గజానన, నెగ్గిన ఇత్తుమంటిరే;
బెణకని మందగామివి అభీప్సితసిధ్ధికి భక్తితో ప్రద
క్షిణలు ఉమామహేశ్వరుల చెంతనె చేస్తివి నాయకుండవన్
(మణిమయ భూషితా మహిత పార్వతి పుత్ర మహాగణాధిపా)

Thursday, November 15, 2007

గుండమ్మపై సీసము

సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము
పెంకిదయ్యెనది ఆ పెంపకాన
సవతి కూతిరినెల్ల సాధింప వేధింప

పనిమంతురాలయ్యె పసితనాన
గారాల పట్టికి మారాజు కావలె

ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు
సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ

ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ

ఆ. వె.
అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు
వరుల వేటజేయబట్టె తానె,
మగని తోడులేని బండమ్మ, గుండమ్మ
అన్న గారి సాయమందు కొంచు

కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే..

ఆ. వె. పైకి మంచి వాడె మంచి మాటలు పల్కి
బుట్టలోన వేసి బురిడి కొట్టి
చెల్లి ఆస్తి నెల్ల గుల్లచేయు పధక
మ్ముల మునిగిన మేక తోలు నక్క

పాపం నలిగిపోయేది అణిగిమణిగి ఉండే సవతి కూతురు..ఇంతలో, ఆమె కష్టాలని తీర్చడానికే వచ్చారా అనే విధంగా..

సీ. గుండమ్మ నేర్వగ గుణపాఠమొక్కటి

చెప్పుటే ధ్యేయమై చెంత చేరి
రామలక్ష్మణుల తలపులకు దెచ్చుని

ద్దరు సహోదరులు పన్నిరి కలిసి చ
తుర ఛలము, ధనవంతుడొకడయెను పని

వాడుగనొకడు, భామల మనసుల
దోచిరి, అణచవలసిన గర్వములణ

చిరి, మంచివారకు చేసి మేలు

తే. గీ. తలచుకున్న కార్యముల సఫలము చేసి;
కొడయి బృందావనముల గొడవ లేక
ప్రేమయాత్రలు వలచిన భామల చెంత
హాయి హాయిగా చేయ సుఖదాయకమయె.

ఇదీ గుండమ్మ కధ. విడుదలై ఎభై ఏళ్ళు కావస్తున్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే తీరుగా ఉండి, తరతరాల..

తే. గీ. ఆంధ్ర ప్రేక్షకాదరణలనందుకొన్న,
ఆణిముత్యమాద్యంతమాహ్లాదమొలుకు,
విజయవారి, వెండితెరకు వెలుగునొసగు,
డాగులన్నవి లేని, గుండమ్మ గాధ

అందుచేత తెరమీద చూడడానికైనా లేక డీవీడీ కొని చూసినా, ఖర్చుపెట్టిన

ఉ. సొమ్ము వసూలె కాక (మనసొప్పగ తీరిచిదిద్దగా కధాం
శమ్ము భలే తయారయి పసందగు హాస్యపు చిత్రమయ్యె గుం
డమ్మ కధావిశేషము. బడాయి లడాయిల నవ్వు పువ్వులా
కమ్మటి ఆటపాటల సుఖాంతము) లాభము ముట్టు బేరమే.

Wednesday, November 14, 2007

తేట తెలుగు పలుకు - 2

ఈ పద్యానికి స్పూర్తి - ఊకదంపుడు గారి టంగు తెగుట, దానిపై రాఘవ గారి కొనసాగింపు

ఉ. తేనెలనూరు పల్కులని, తీయని తేటతెలుంగు మాటలే
వీనులవిందులవ్వునని భేషజమాడుట వట్టిమాటలే
యౌను, నరాలలో ఇమిడినట్టి గులాముల బుద్దికింక స
మ్మానితయౌ విధాన తలమానికమవ్వగ ఆంగ్లమాంధ్రలో

Saturday, November 10, 2007

Om Shanti Om

శా. మైహూనా - చవి చూపి చెత్తను, శిరోభారమ్ము పెంచేయగా
నా హూనంబయినట్టి బుఱ్ఱకు ప్రమాణంబిస్తి, మళ్ళీ ఫరా
కాహారంబెపుడూ తనవ్వదని; వాగ్దానాలు కల్లల్ కదా,
ఆహా, నేడు సమీక్షలన్ చదివి, హైహై యంటి ఓంశాంతిఓం

తే.గీ. చిత్రమును చూడ పంతము చేయ బుద్ది
తానె గడ్డి మేసినదై; ఇదంత మీకు
చెప్పు కారణమేమన, పప్పులోన
కాలు పడకముందె నను ఆపాలి తమరె.

మీలో ఎవరైనా ఈపాటికి ఓం శాంతి ఓం చూసి ఉంటే, పై పద్యంలోని 'మీరు' మీరే. Reviews please!

Thursday, November 08, 2007

ఓ గణాధిపా నీకు మ్రొక్కెదన్

ఉ. వ్యాస మహామునీశ్వరుని వాక్కులు వేగగతిన్ సుధాశును
ద్భాసితమైన పద్యముల పార ఘనామృత సారమంతయూ
వ్రాసితివయ్య విఘ్నగణరాయ అచంచల దీక్షబూని; సం
తోసముతో మునే పలికెనో, పలికించిన వాడవీవెనో?
(వాసిగ విద్యలన్ ఒసగు పార్వతి పుత్ర మహాగణాధిపా)

Tuesday, November 06, 2007

అప్పుల తిప్పలు

నిన్న రాయడానికి ఏదీ తట్టక, రాయాలను కోరిక చావక

మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా
పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో
ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే
మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ

(* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి)

అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు,
మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి దెబ్బ వల్లే ఆయన కంపెనీకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఆయనెలాగూ మంచి డబ్బుమూటతోనే బయటకి వెళ్తాడు, మరి అప్పుల ఊబిలో చిక్కుకున్నవారి గతి ఏమిటి పాపం అని ఆలోచిస్తుండగా...

వారికి ఏమీ ఇవ్వలేను, పదహారు అణాలు కాకపోయినా కనీసం పదహారు పాదాల పద్యమాల ఇద్దామనిపించి, ఇదిగో ఇది రాసాను.


ఉ. తప్పని కష్టనష్టముల ధాటికి కుప్పగ కూలబడ్డ వా
రెప్పుడు భీతిచెందుచు భరింతురు కట్టడులెట్టివైననూ
అప్పు తనంతతానుగ అయాచితమై జనియించి చేరగా
తప్పునులే ధనార్తియని నమ్మిక పుట్టగ వెర్రివారలై;
అప్పుల ఊబిలోనపడ ఆరడులాగవు ఎంతమాత్రమూ
తప్పుల తుప్పలో తుదకు తప్పని తిప్పల పాలుపడ్డ వా
రప్పుడు నేర్తురెంతటి చిరాకుల చీదరయో ఋణేచ్చకం
చప్పున ఉచ్చులాగునది, జాడ్యము, తెచ్చునదే వినాశనం
తప్పులు తేటతెల్లమవు నాటికి ఆగత కష్టకాలముల్
కుప్పల తెప్పలై పెరిగి గుత్తగ వాలు దివాళ తంతులున్
ముప్పులు ముంచిదెచ్చునిల ముంగిట, ఆస్తులు జప్తులవ్వగా
అప్పుడు కంటినీటి తడి ఆర్పదు మండెడి అప్పుచిచ్చులన్
ఒప్పులు తప్పులున్ తఱచి ఓర్పుగ చూడగ తెల్లమవ్వదా
గొప్పల అప్పుసేతలకు కూలును వడ్డికివడ్డి కూడ, పై
కప్పులు జప్తు వేలముల, కావున చేయకు అప్పులూరికే
చెప్పగనేమిలేదు ఇక చెప్పితినంతయు పద్యరూపమున్

Saturday, November 03, 2007

Selling a car

కారుల అమ్మకానికని ఖర్చులు ఎక్కువ చేయడాలు బే
కారని ఎంచి నేను పలు కారుల సైటులు చూడబట్టి* ఏ
కారుకి ఎంతపైకమడగాలను మత్లబు తెల్సివచ్చె నా
కారు (ఒకింత కొత్తటి ఎకార్డుని) పెట్టితి క్రేగ్సులిస్టులో

మీకు తెల్సినట్టి వేరేవి, అక్కర
కొచ్చు మంచి సాలె గూళ్ళు ఉన్న
చో తెలియపరచిన, ఎంతో సహాయము
నాకు; మీకు తెలుపు కృతజ్ఞతలివె

==

*పడిగాపులు మస్తుగ చేయబట్టి

Friday, November 02, 2007

అమెరికా, ఉంటా మరిక..

ఉ. మోజిక తీరిపోయెను అమోఘ ధనార్తులదేశరాజమై
రాజిలు "శాము మామ"కు పలాయన చిత్తుడనై ఎడంబడే
రోజిక వచ్చెగావున పొలోమని - కట్టితి మూటముల్లెలూ
బూజుని దుల్పివేసి అలవోకగ- వేగిరమే బయల్పడన్


త. కదలి రా ఇటవచ్చి చేరగ కాసుకాన్కలు భత్యముల్
బదిలి ఖర్చులు అద్దెకొంపకు బాడుగాదులు ఇచ్చెదమ్
వదలివచ్చిన చోటయుండిన మంచిసౌఖ్యపు భోగముల్
సదరుచోటుననుండు తప్పక సావకాశపు భోగ్యముల్

ఆ. వె. అనుచు నాకు మంచి అవకాశమొక్కటి
చేతికందజేయ, కాదనియన
లేక ఒప్పుకొంటి రీలొకేషనుకు మొ
న్నీ నడుమనె కంపెనీయు నచ్చి

==

శాము మామ: Uncle Sam!

Thursday, November 01, 2007

Useless comments - తెలుగు బ్లాగర్లకు విజ్ఞప్తి

మత్తే. ఎవడో ఓ చెడు దృక్పథం మనసులో ఏ వంకనో పెంపుచే
సి, వశంతప్పెటి రీతి కచ్చి కలిగించే పిచ్చి ప్రేలాపనల్ బ్లాగు వ్యాఖ్యానముల్
-అవతారాన్ని అనామకం ముసుగులాటాడించి- వ్రాయించగా
అవకాశం మనదెప్పుడాయని అవే ఆవేదనల్ చెందుటే

ఆ.వె. నెరుగుదును కనుకనె తెలుపుచుంటిని మీకు
చూసి చూడనట్టు చొప్పదంటు
వేగునెటుల వదిలివేతురో అటులనే
చేయ వాడికదియే చిత్రహింస

చెప్పదలచుకున్నదేమిటయ్యా అంటే, అనవసరపు ప్రేలాపనలు వ్యాఖలుగా వస్తే వాటిని పట్టించుకోకండి. స్పాంని ఎలా పట్టించుకోమో అదే విధంగా ఈ వ్యాఖ్యలని, అనవసరపు టపాలని పట్టించుకోకపోతేనే మేలు.
చెత్త వ్యాఖ్యలు చదివి మనసు పాడుచేసుకోవడమో, ఇక రాయడమే మానేస్తాననడమో చేయనవసరం లేదు. ఏమంటారు?