Showing posts with label సీస పద్యం. Show all posts
Showing posts with label సీస పద్యం. Show all posts

Saturday, August 22, 2009

లవ్ ఆజ్ కల్


సిక్కుల మొగవారు సింహశార్దూలాలు
మగతనానికి వారు మారుపేళ్ళు
సిక్కులౌ ముదితలు చక్కెర శిల్పాలే
తియ్యందనానికి తిరుగులేదు
సిక్కుల ముదుసళ్ళు చింతపచ్చళ్ళలా
ఈడెంత వచ్చినా ఈచుపోరు
సిక్కుల చుట్టాలు చింతలు చీకాకు
లు మటుమాయం జేయు లొల్లిగాళ్ళు

సిక్కుల వివాహ మందురా? చెప్పనలవి
కాదె, అదొక హమాప్కె హై కౌను వంటి
దేను, హంగు హంగామాల తీపి కలయి
క, కనులకు పండువ, సినిమా కథలలోన

లవ్ ఆజ్ కల్లో నాకు నచ్చినవి:
1. సంభాషణలు
2. పాటలు
3. కథనము (ఆసక్తికరమైన ఫ్లాష్ బాక్ ని కథలో బాగా చొప్పించాడు దర్శకుడు)

నచ్చనివి:
1. దీపికకి జోడిగా నప్పని పాత్రలో సైఫలీ ఖాన్.
2. పాతచింతకాయ పచ్చడి లాఁటి కథ
3. రెండవ భాగంలో సాగతీత

సిక్కుల జీవనవిధాన్నాన్ని (ముఖ్యంగా వివాహాది మహోత్సావాలని) హింది సినిమాలు భలే రొమాంటిసైజ్ చేస్తాయి, లవ్ ఆజ్ కల్లో కూడా అదే కనిపిస్తుంది. ఈ సినీ పోకడల ప్రభావం వల్ల కొద్దికాలంలో మన కుర్రకారు కూడా ఇళ్ళల్లో పేచీ పెట్టి తమ పెళ్ళిళ్ళు సిక్కుల తరహాలో చేయించుకుంటామంటారేమో అనిపిస్తుంది నాకు!

Sunday, December 28, 2008

సెక్యులరిజము సొల్లు

(ముందు వ్రాసిన ఆటవెలదితో కోపం పూర్తిగా వెళ్ళగక్క లేకపోయాను, అందకే పైన ఒక సీసాన్ని జోడించాను)

హైందవ పండితులం దండితుల జేసి,
తరిమికొట్టుట పెద్ద తప్పుకాదు
దేవాలయాలను కైవెక్కి కొవ్వెక్కి,
దాడుల గూల్చిన తప్పులేదు
ఉగ్రవాదమ్ము మతోన్మాద వాదమ్ము,
పెచ్చరిల్లుట కాదు పెద్ద మాట
మతఛాందసుల వల్ల మనతల్లి భారతి,
తల్లడిల్లిన పెద్ద తంతు కాదు
'ప్రతిపక్ష బృందమ్ము బలగమ్ము హెచ్చుట
శాంతి భద్రతలకు చావుదెబ్బ'

సెక్యులరిజమంచు
చెల్లు కబురులు గార్చు
మతపక్షపాత భ్రమణమతులు
ప్రజకు హక్కులంచు,
ప్రగతి పథములంచు
ఎన్నికలను దెచ్చి,
ఎన్నొ కలలు చూపి,
ప్రజల కోర్కె చూచి,
ప్లేటులు ఫిరాయించి
తిక్క మాటలెంచిరేల?

"The rise of BJP in the border state which is facing terrorism is a worrying factor for the entire country," he said.

ఉగ్రవాదం పెరగడం కాదు, ఎన్నికలలో మందంజ వేసిన పార్టి వల్ల భయపడాలనేది ఆజాద్ సొల్లు వాగుడు. ఏంటో ఈ గోల?!

Friday, December 26, 2008

Oye Lucky! Lucky Oye!

సీ. ఉన్నది, లేనిది, చిన్నది, పెద్దది,
సొంతము కాదని చూసుకోడు
మెచ్చిన వస్తువు నచ్చినరీతిన

చంకనవేసుకు జారుతాడు
బాకులు కత్తులు పట్టని చోరుడు,

మాయలు నేర్చిన మాటకారి
తీయని తేనెల మాయల మాటల

మూటలు మోసిన మోసగాడు

ఆ. ఎట్టివారి నైన బుట్టలో పడవేయ
బూటకాల నల్లు ఆటగాడు
రెప్పపాటులోపె తప్పుకు పోతాడు
హుళకి చేసి సొత్తు హొయల ‘లక్కి’


వివరాలు ఇక్కడ చదవండి.

Saturday, September 06, 2008

కత్రినా కోశి

ఇవి బిహారు జన పరిస్థితి గురించి చదివి నేను క్రోధితుడనై వ్రాసిన ముక్కలు.

కత్రినా యుప్పెన కట్టలు ద్రెంచుచు
క్రౌంచ భూమండలి ముంచిదేల్చి
చెప్పిన గుణపాఠ మిప్పటికి గురుతే
కనుకనే గుస్తావు కనకరించె
తొల్లి తల్లడివడె తల్లి మన భరతా
వని వెల్లువల వెల్లి* వాతబడుచు
గురుతుండ వివిగాన గుడ్డిమాలోకాన
కడివోయె* కోశి శోకములుదెచ్చి

ముందు దెబ్బమోది నుడువ* మొగ్గుజూపు
దండ భేద నీతుల నమ్మియుండు గండ
కొన్ని కయ్యాల కొనిదెచ్చుకొన్న జార్జి
బుస్సుమంటు పైకురికెడి బూచిగాడు

మిగుల నపకీర్తి నార్జింప దగిన వాడె
ముందు తాజేసిన తలతిక్క దిగువాయి
పనుల సరిదిద్దె బగ్గీజి* పట్టణంపు
ప్రజకు జతగ నిల్చె వరదబాధ బాపి

ఈ సారి గుస్తావు నేలతాకక మునుపే (ఫీమాతో సహా) అందరినీ సమాయత్తం చేసి సిధ్ధంగా ఉంచాడు జార్జి బుష్షు. హోంవర్కు చేసుకొచ్చిన వాడి పుస్తకం మాస్టారు తనిఖీ చేయనట్టు, గుస్తావు వీరి సంసిధ్ధతని పరిక్షించలేదు. మనవాళ్ళు ఇలాగ హోంవర్కు చేసి ఎన్నాళ్ళయ్యిందో - ఇంకా ఎన్నాళ్ళు పకృతి మేష్టారి దెబ్బలు తినాలో?

లాలు లాలూచిగాడని ఱాలు ఱువ్వు
చేతగాని వాడని గ్రుచ్చిచెప్పు నిశిత
బుద్దిశాలి నితిశుడేమి బొడిచె నీట
మునుగుచుండ బీహారి యూళ్ళు నగరములు

నితిశ్ సంగతి అటుంచితే, మన మన్మోహను డేమి ఒలక బెట్టాడు?

ఒకానొకప్పుడు,

విత్తపు మంత్రి పదవియం
దుత్తముడు ప్రగతికి దోహదుండయి గమనం
బత్తమిలకుండ సతతం
బుత్తలపడువాడు సత్తముండయి జనియెన్

తదనంతరము,

సాటియె లేడెవ్వడతని
పాటికి రాడెవ్వడనుచు పాటవమున నా
రాటము మీఱగ పీఠం
బేటలు వేయక* నొసగుటె బీజంబయ్యెన్

ఠక్కున నిర్ణయాలు తీసుకోలేని ఓ తోలుబొమ్మ దేశానికి ప్రధాని అయి కూర్చుని యుండడానికి.

నోట నాలిక లేదయె వేటికైన
సోనియా తల్లి దీవెనలైన లేని
పనుల ముట్టని మన ప్రధాని నిమిషాల
మీద నిర్ణయా లెటుల తర్ఫీదు చేయు?

వెల్లి: పరంపర
కడివోయె : చెడ్డదయ్యెను
నుడువ : మాటలాడ
బిగ్గీజి : బిగ్ ఈజి, కొత్తార్లియన్సుకి మారు పేరు
ఏటలు చేయక: గొడవ చేయకుండా

Sunday, August 31, 2008

McCain, Sarah Palin

ష్రెక్కు గాడిద కలిసి మొదటి సారి పొట్టి రాజు ఫార్క్వార్డు వద్ద కెళ్ళి నప్పుడు, ఆకాశాన్ని తాకే వాడి రాజభవనాన్ని చూసి ష్రెక్కు “తన దగ్గర ఏదో తక్కవైన దానికి సంజాయిషీలా కట్టాడు కదా” అంటూ వెకిలి నవ్వు నవ్వుతాడు. జాన్మెక్కేను సారా పాలిన్ని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నప్పుడు నా కదే గుర్తుకొచ్చింది.

నెత్తిన పచ్చిక బొత్తిగ నిల్వని
బట్టబుఱ్ఱడి కుండు జుట్టు పిచ్చి
తనవద్ద లేనట్టి తాయిలంబునుజూచి
తారాడు మ్రుచ్చుని దగులు పిచ్చి
సత్తువ లుడిగిన ముత్తాత కొచ్చెనో
పరువంపు వంపుల పడతి గాంచి
సూదంటుఱాయిని కాదంటు త్రోయని
లొంగేటి మ్రుక్కడి లోహమల్లె

లొంగినట్టున్నాడు మెకేను దిగులుతో త
నకెదురు నిలబడ్డ నవకిశోరు
గాంచి యనుభవజ్ఞుడనని గంతులేయు
వాడె చివురు మొలక వలతి నెంచి

Friday, August 22, 2008

నాకు నచ్చిన బ్లాగులు

తాబాసు గారిది తనదైన గరిమము
కలగూరగంపగా కనులవిందు
కొత్తపాళీగారి గుత్తాధిపత్యము
విన్నదీ కన్నదే వింతలేదు
భైరవభట్లవి బహుచక్క వ్రాతలు
తెలుగు పద్యాలను తెలియపరచు
వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి
లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పు

వాగ్విలాస రాఘవాభిధానుండును
తెలుగుపద్యములకు తేటగీతి
నాకు నచ్చినట్టి చాకులైదుగురని
సీసపద్యమందు చెప్పబోతి


ఇంకా,

మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును
, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులైరి చూడగా..


గరిమము= గొప్పదనము
మంజిమ = మనోజ్ఞత
మేమెయి = సునాయాసంగా

Wednesday, June 04, 2008

Obama beats Clinton

సీ. తలకు మించిన పని తలపెట్టి వెరువక
వాదాడు తాబే లొబామ వలన,
గెలుపు నాదేయంచు గీరతో నిక్కిన
కుందేలు క్లింటను కూలబడెను,
తలలు పండిన పండితు లెవరూ కలలోన
సైతము సాధ్యమని, తలపోయ
దలచని మలుపున, తలవంపు లయ్యనే
ముందుండి తగ్గిన ముదిత కిపుడు

చావుదెబ్బ పడెను, చేవ తగ్గదికను,
తగ్గదేమి పొలతి యొగ్గదేమి?
చెప్పనలవి కాదు, పప్పులో పడె కాలు,
తప్పుకోని హిలరి తర్కమేమి?

Sunday, June 01, 2008

బత్తీ బంద్

సీ. పెరటిలో చెట్లన్ని పెకలించి వేసెను
వీటికేమున్నది విలువ యంచు
నూతిలో నీళ్ళన్ని రోత పంకంబుగా

సేసె లేదయ్యొ నా దోస మనుచు
నింటి పైకప్పుకున్ తూటులు పొడిచేను

పైకప్పు కూల దీపాటి కనుచు
జంతుజాలమునెల్ల చంపివేయుచు వీగె

వీటి ప్రాణములు నావేయటంచు

ఘోర పాతకాల కోరి మరల చేసె
తప్పు తనది యనుట, తప్పు యనుచు
నిట్టి మనుజుని కిక నేమని సెప్పుదు
కొంప నరకమంచు ఘొల్లుమనిన?


బత్తి బంద్ లో నేను హాజరు వేయించుకున్న వైనం
ఇక్కడ చదవండి

Tuesday, November 20, 2007

అర్ధనారీశ్వర స్తోత్రము - వ్యాఖ్య

ముందు రాఘవ రాసిన అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. అందమైన ఆ స్తోత్రం మీద నా వ్యాఖ్య ఇదిగో..

సీ. ఒక పాదమమ్మకునొప్పగనింపుగ,
మరుపాదమొప్పెను హరునికింక
ఒక పాదమదెనయ్యెనొంపు గునిసియాట,
మరుపాదమవ్వగ భవుని తాండ
వము, ఒకపాదమమ్మకు భూషణమయెను,
మరుపాదమయ్యెను పన్నగముగ,
ఒకపాదమును చూచినేకైకమిదియన్న,
మరుపాదమంతనె వచ్చి నిలిచె

తే.గీ. అర్ధనారీశ్వరుల తత్వమంత కనుల
ముందు నిలుపు స్తోత్రములివి, సుందరముగ
అద్వితీయద్వితయమును హృద్యమైన
పద్యములపొదిగిన సుమమాలికలివి

Thursday, November 15, 2007

గుండమ్మపై సీసము

సీ. కన్నబిడ్డను చేయ కడుపార గారము
పెంకిదయ్యెనది ఆ పెంపకాన
సవతి కూతిరినెల్ల సాధింప వేధింప

పనిమంతురాలయ్యె పసితనాన
గారాల పట్టికి మారాజు కావలె

ఘనమైన పెళ్ళికి, ఘనిడె వరుడు
సరితూగు పనివాడు సవతి కూతురికి ఇ

ల్లరికము వచ్చి, ఇల్లంటి మనగ

ఆ. వె.
అని తలచుచు ఇద్దరప్పచెల్లెళ్ళకు
వరుల వేటజేయబట్టె తానె,
మగని తోడులేని బండమ్మ, గుండమ్మ
అన్న గారి సాయమందు కొంచు

కానీ, ఆ అన్నగారు ఎలాంటి వాడయ్యా అంటే..

ఆ. వె. పైకి మంచి వాడె మంచి మాటలు పల్కి
బుట్టలోన వేసి బురిడి కొట్టి
చెల్లి ఆస్తి నెల్ల గుల్లచేయు పధక
మ్ముల మునిగిన మేక తోలు నక్క

పాపం నలిగిపోయేది అణిగిమణిగి ఉండే సవతి కూతురు..ఇంతలో, ఆమె కష్టాలని తీర్చడానికే వచ్చారా అనే విధంగా..

సీ. గుండమ్మ నేర్వగ గుణపాఠమొక్కటి

చెప్పుటే ధ్యేయమై చెంత చేరి
రామలక్ష్మణుల తలపులకు దెచ్చుని

ద్దరు సహోదరులు పన్నిరి కలిసి చ
తుర ఛలము, ధనవంతుడొకడయెను పని

వాడుగనొకడు, భామల మనసుల
దోచిరి, అణచవలసిన గర్వములణ

చిరి, మంచివారకు చేసి మేలు

తే. గీ. తలచుకున్న కార్యముల సఫలము చేసి;
కొడయి బృందావనముల గొడవ లేక
ప్రేమయాత్రలు వలచిన భామల చెంత
హాయి హాయిగా చేయ సుఖదాయకమయె.

ఇదీ గుండమ్మ కధ. విడుదలై ఎభై ఏళ్ళు కావస్తున్నా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే తీరుగా ఉండి, తరతరాల..

తే. గీ. ఆంధ్ర ప్రేక్షకాదరణలనందుకొన్న,
ఆణిముత్యమాద్యంతమాహ్లాదమొలుకు,
విజయవారి, వెండితెరకు వెలుగునొసగు,
డాగులన్నవి లేని, గుండమ్మ గాధ

అందుచేత తెరమీద చూడడానికైనా లేక డీవీడీ కొని చూసినా, ఖర్చుపెట్టిన

ఉ. సొమ్ము వసూలె కాక (మనసొప్పగ తీరిచిదిద్దగా కధాం
శమ్ము భలే తయారయి పసందగు హాస్యపు చిత్రమయ్యె గుం
డమ్మ కధావిశేషము. బడాయి లడాయిల నవ్వు పువ్వులా
కమ్మటి ఆటపాటల సుఖాంతము) లాభము ముట్టు బేరమే.