Tuesday, November 06, 2007
అప్పుల తిప్పలు
మ.కో. చిన్న పద్యము అల్లుదామని చెడ్డకోరిక కల్గగా
పెన్నుపేపరు చేతబట్టుకు పెట్టసాగితి బుఱ్ఱలో
ఉన్న గుజ్జుకు తానతందన*; ఒక్కటైనను తట్టదే
మన్నుమిన్నులు ఏకమైనను మంచి పద్యము బుఱ్ఱకూ
(* సాన పెట్టుట అని కూడా అంటారు లెండి)
అంటూ మత్తకోకిలతో బుఱ్ఱగోక్కుంటున్న నాకు, మా కంపెనీ సీఈఓ గద్దె దిగిపోయాడనే వేగు కనిపించింది. సబ్-ప్రైం ఋణాల గురించి ఇదివరకు రాసానుగా, వాటి దెబ్బ వల్లే ఆయన కంపెనీకి స్వస్తి చెప్పవలసి వచ్చింది. ఆయనెలాగూ మంచి డబ్బుమూటతోనే బయటకి వెళ్తాడు, మరి అప్పుల ఊబిలో చిక్కుకున్నవారి గతి ఏమిటి పాపం అని ఆలోచిస్తుండగా...
వారికి ఏమీ ఇవ్వలేను, పదహారు అణాలు కాకపోయినా కనీసం పదహారు పాదాల పద్యమాల ఇద్దామనిపించి, ఇదిగో ఇది రాసాను.
ఉ. తప్పని కష్టనష్టముల ధాటికి కుప్పగ కూలబడ్డ వా
రెప్పుడు భీతిచెందుచు భరింతురు కట్టడులెట్టివైననూ
అప్పు తనంతతానుగ అయాచితమై జనియించి చేరగా
తప్పునులే ధనార్తియని నమ్మిక పుట్టగ వెర్రివారలై;
అప్పుల ఊబిలోనపడ ఆరడులాగవు ఎంతమాత్రమూ
తప్పుల తుప్పలో తుదకు తప్పని తిప్పల పాలుపడ్డ వా
రప్పుడు నేర్తురెంతటి చిరాకుల చీదరయో ఋణేచ్చకం
చప్పున ఉచ్చులాగునది, జాడ్యము, తెచ్చునదే వినాశనం
తప్పులు తేటతెల్లమవు నాటికి ఆగత కష్టకాలముల్
కుప్పల తెప్పలై పెరిగి గుత్తగ వాలు దివాళ తంతులున్
ముప్పులు ముంచిదెచ్చునిల ముంగిట, ఆస్తులు జప్తులవ్వగా
అప్పుడు కంటినీటి తడి ఆర్పదు మండెడి అప్పుచిచ్చులన్
ఒప్పులు తప్పులున్ తఱచి ఓర్పుగ చూడగ తెల్లమవ్వదా
గొప్పల అప్పుసేతలకు కూలును వడ్డికివడ్డి కూడ, పై
కప్పులు జప్తు వేలముల, కావున చేయకు అప్పులూరికే
చెప్పగనేమిలేదు ఇక చెప్పితినంతయు పద్యరూపమున్
Friday, September 14, 2007
సబ్-ప్రైం కష్టాలు ఎలా ఉధ్భవించాయి? - 2
సబ్-ప్రైం కష్టాలు ఎలా ఉధ్భవించాయి? - 1 టపాకి రెండవభాగమిది....
అప్పులిచ్చే బాంకులు, కంట్రీవైడ్ ఫినాన్స్ లాంటి ఇంటికుదువ బాంకులు ప్రైమే కాక సబ్-ప్రైమ్ అప్పులు విరివిగా ఇచ్చి ఆదాయం, పనిచేయు ఉద్యోగస్తుల సంఖ్య, స్టాక్ విపణిలో విలువనూ చాలా పెంచుకున్నాయి. ఇంటి అప్పులకున్న గిరాకీ వల్ల పుట్టుకొచ్చిన అప్పు పుట్టింపు కార్యాలయాలు (loan originating offices) పోటీ పడి కస్టమర్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేసాయి. ఇలాంటి పరిస్థితులలో జరిగిన కొన్ని తప్పుల వల్లనే ఇప్పుడున్న ముప్పు వచ్చిపడింది. ఆ తప్పులెంటంటే..
1. అపాత్ర అప్పులు ఇవ్వడం: దారిన పోయే ప్రతీ అపాత్ర దానయ్యకీ అప్పులిచ్చేస్తే ఇంకేమవుతుంది? అప్పు పుట్టించే వాడు తాను రప్పిస్తున్న దరఖాస్తుల సంఖ్య చూసేవాడే కానీ, ఎలాంటి వారి చేత దరఖస్తులు పెట్టిస్తున్నానని చూడలేదు. నా తర్వాత పూచీపెట్టుడు వాడు చూసుకుంటాడులే అని వాడి ధీమా. పూచీపెట్టుడు వాడు వ్యాపరాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో నియమాలని ఉల్లంఘించినా మున్ముందు ఏదైనా ఐతే ఉపవిపణిలో ఈ అప్పుని కొన్నవాడు చూసుకుంటాడులే అని ధీమా పడడం..అందునా మంచి అప్పు కాకపోతే ఉపవిపణిలో సంస్థలు ఎందుకు కొంటాయిలే అని మరింత నమ్మకం. ఉపవిపణి వాడు అప్పుల పత్రాలు కట్టలు తీసుకుని, మంచివి కాకపోతే ఇంత పేరున్న సంస్థలు నాకు అప్పుల పత్రాల కట్టలెందుకిస్తారులే అనుకోవడం..ఇది చాలు చెడు అప్పులు పెచ్చరిల్లడానికి. అదే జరిగింది.
2. తెలిసీ తప్పులు చేయడం: ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయాల వల్ల తెస్తున్నదేమిటంటే కొన్నిసందర్భాలలో బాంకు ఉద్యోగులు, అప్పుతీసుకుంటున్న వ్యక్తి మారే వడ్డీ (Adjustable rate) వల్ల కొన్ని రోజుల్లో అప్పు తీర్చలేడని తెలిసీ అప్పులిచేసేవారట..కుదువకి ఉన్న ఇల్లి అమ్ముకోవచ్చుననే దురాలోచన ఉండడమే దీనికి కారణం. కానీ వారు గ్రహించని విషయము ఏమిటంటే, అప్పులిచ్చే సంస్థలన్నీ ఇదే పని చేస్తే చివరకి జప్తు (forclosure) ఇళ్ళు ఎక్కువై ఇళ్ళ విలువ పడిపోతుందని..ప్రస్తుతం ఉన్న పరిస్తితి అదే, జప్తు కాబడ్డ ఇళ్ళు ఒక పక్క పెరుగుతుండగా, ఇళ్ళ దరలు పడిపోతున్నవి.
3. కపటం, కళ్ళు కప్పడం: అప్పులిచ్చే వారి ప్రకటనలు, వారి విపణింపు వ్యూహాలూ (marketing strategies) ఒకదానికింకోటి చూపుంచి చదివే వారు అపార్ధం చేసుకుకే రీతిలో ఉండేలా తీర్చిదిద్దబడేవి కూడా. స్థిర వడ్డీ అని పేరుకే కానీ, ఇరవై ఏళ్ళ అప్పు మొదటి మూడేళ్ళూ స్థిర వడ్డీతో ఆపై మారే వడ్డీ తో ఉంటుందని కస్టమర్లకి విపులీకరించ కుండా వారిచేత పత్రాలు సంతకం చేయించుకున్న మహానుభావులున్నారు. ఉదాహరణకి ఇది, ఇది వినండి. ఫిలడల్ఫియాలో అనుకుంటా ఇలా వంచనకి గురైన ఒకావిడ ఇప్పుడు అప్పిచ్చిన కంపెనీపై దావా వేసి జప్తుకి సిధ్ధమైన తన ఇంటిని ఖాళీ చేయనని భీష్మించుకు కూర్చుంది. ఇలాంటి సంఘటనలు మున్ముందు ఇంకా పెరగచ్చు.
వీటన్నిటి వల్లా తెలుస్తున్నదేమిటంటే, కొన్ని సంస్థలు దురాశతో చేయకూడని పనులు చేస్తున్నప్పుడు, వాటిపై ఓకన్నువేసిఉంచాల్సిన సంస్థలు బధ్ధకంతో చేయవలసిన పనులు చేయకపోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఇలాంటి కష్ట సమయంలో కూడా నిరాటంకంగా వ్యాపరం చేసుకుపోతున్న సంస్థలూ ఉన్నాయి, అత్యాశకి పోకుండా తప్పుడు అప్పులు ఇవ్వని అట్టి సంస్థల వ్యాపారమూ, వాటాపత్ర విపణిలో (share market) వాటి విలువా ఎక్కువగా దెబ్బతినలేదనే చెప్పచ్చు.
వచ్చే టపాలో ఇంటి కుదువ అప్పులకీ, స్టాక్ విపణులకీ ఉన్న సంబంధమేమిటి? అనే విషయం మీద వ్యాఖ్యలు.
Monday, September 10, 2007
సబ్-ప్రైం కష్టాలు ఎలా ఉధ్భవించాయి? - 1
క్రితం టపాలో చెప్పుకున్నట్లు సబ్-ప్రైం విపణిలో వ్యాపారాలు చాలా ఏళ్ళు మహాజోరుగా సాగాయి. కొన్నేళ్ళుగా అందలమెక్కి ఉన్న భూఋణ విపణి (real estate market) వల్ల అన్ని ప్రదేశాలలో ఇంటి ధరలు ఆకాశాన్ని తాకడం మొదలు పెట్టాయి. అప్పులిచ్చే సంస్థలకు ఇంతకన్నా కావలసినదేముంది. ఇళ్ళకి గిరాకీ ఎక్కడా తగ్గుతున్నట్టు గోచరించక, ఆ సంస్థలు అప్పులు విరివిగా ఇవ్వడం ప్రారంభించాయి. పోటీ పడి మరీ కస్టమర్ల్ ని పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని సంస్థలైతే బాకీలు చెల్లించలేని వాళ్ళకి కూడా అప్పులిచ్చేసారు; అలా ఇవ్వడం పోటీలో పడి గుడ్డిగా తెలియక చేసిన పనేమీ కాదు.
మరి బాకి ఎగ్గొడతారని తెలిసికూడా అలాంటి వారికి అప్పులివ్వడంలో తర్కమేమిటి? పెండారీలనే ఒక రకం అప్పులున్నాయి. అలాంటి అప్పులిచ్చే పధ్ధతిని Predatory lending అంటారు. తీసుకునే వాడు అప్పు తీర్చలేడని తెలిసీ వాడిని అప్పుల ఊబిలోకి లాగేయడమే పెండారీ పధ్ధతి. అప్పు తీసుకున్న అభాగ్యుడు చిక్కులో పడ్డ సమయానికి వాడి అప్పు పత్రాలు - ఉపవిపణి పుణ్యమా అని - పుట్టించిన సంస్థ దగ్గర ఉండవు, వేరే సంస్థ కొనేసి ఉంటుంది, అలా వేరే సంస్థ కొనకపోయినా కుదువగా ఇల్లు ఉండనే ఉంది, దాన్నైనా అమ్ముకుని డబ్బు రాబట్టుకోవచ్చు కదా? ఎవడో పోతాడు, ఇంకెవడో పడతాడు అనే ఆలోచనతో ఇలాంటి అప్పులిచ్చే సంస్థలున్నాయి. ఇది జరగకుండా ప్రభుత్వం చట్టాలను జారీ చేసిందనుకోండి, కానీ వాటిని చాలా మంది ఉల్లంఘించారని ఇప్పుడు తెలుస్తోంది. ఉల్లంఘనలన్నీ పండారీ కోవకు చెందినవి కాక పోయినా, అప్పుడప్పుడు అప్పు తీసుకునే వారి కళ్ళుగప్పి వారు తీర్చవలసిన బాకీలని తక్కువగా చూపించి దాన్ని ఎరగా వాడిన సంస్థలూ ఉన్నాయి.
ఇది వారు ఎలా చేసారని తెలుసుకోవాలంటే ముందు ఇంటి కుదువ అప్పుల జీవితచక్రం (mortgage lifecycle) గురించి చెప్పుకోవాలి. ఈ జీవితచక్రంలో ఐదు దశలున్నాయి.
1. అప్పు పుట్టించడం (origination): అప్పు తీసుకోవాలనుకుంటున్న వారిని ఆఫీసులోకి రప్పించి, లేక టెలిఫోనులో ఒప్పించి, లేక సాలెగూటిలో(website) బంధించి, దరఖాస్తు పెట్టుకునేలా చేయడం ఈ మొదటి దశలో జరుగుతుంది. అప్పిచ్చే వారి దృష్టి నుండి చూస్తే ఇది అన్ని దశల్లోకీ కష్టమైనదనే చెప్పుకోవచ్చు. అప్పు కోరుకునే వాడు పక్క బాంకుకి వెళ్ళకుండా చూసుకోవాలి కదా? అందుకే బాంకులన్నీ కస్టమర్ సర్వీసు పేరిట అప్పుకోరు వారి కోసం కొత్త కొత్త పధకాలు ఆలోచిస్తూ ఉంటాయి. ఇంతే కాక పూర్తి బ్రాంచి పెడ్తే తడిసి మోపెడవుతుందని, చిన్న అప్పు పుట్టించు కార్యాలయాలని (loan originating offices) స్థాపిస్తారు కూడా. అటువంటి కార్యాలయాల్లో పనిచేసే వారి పని, మంచి కస్టమర్ కనిపిస్తే జలగలా పట్టేయడమే అవుతుంది - మరి వారి జీతంపై వచ్చే పరిలబ్దులు (perks) ఎంత మంది దరఖాస్తులు పెట్టారో, అందులో ఎంతమంది అప్పు తీసుకున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి..ఈ దశలో బాంకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంతుందని ఇక వేరే చెప్పనవసరం లేదు..
2. పూచీ పెట్టుడు (underwriting): ఒక్కొక సంస్థకీ ఒక్కొక విధమైన వ్యాపర దృక్పధం ఉంతుంది - కొన్నిటికి తెగింపు ఎక్కువ, దాని వల్ల వారు ఇచ్చే వాటిల్లో చెడే అప్పులు ఉండే సంభావ్యత (probability) ఎక్కువ ఉంటుంది. క్రితం టపాలో చెప్పుకున్న పూచీ పెట్టుడు సూత్రాలు పరిశ్రమ పధ్ధతుల మీద, ఆయా సంస్థల వ్యాపర ధోరణి మీదా ఆధార పడి ఉంటాయి. అప్పు పుట్టింపు దశలో వచ్చిన దరఖాస్తులని ఈ దశలో భూతద్దం కింద ఉంచి, అప్పివ్వాలో వద్దో నిర్ణయిస్తారు.
3. అప్పు మంజూరు (closing): ఒక వేళ ఇవ్వాలనే నిర్ణయిస్తే సంతకాలు చేయాల్సిన కాయితాలు, అప్పగించవలసిన పత్రాలు చాలా ఉంటాయి. ఈ దశలో అవన్నీ జరిగి, ఇంటి తాళాలు అప్పు తీసుకున్న వాడి చేతికీ, ప్రతి నెలా తప్పక తాను బాకీ చెల్లిస్తానని రాసిన పత్రం బాంకు చేతికీ అందుతాయి.ప్రతి నెలా కట్ట వలసిన డబ్బు ఎంతనే నిర్ణయం అప్పు మీద అధారపడి ఉంటుంది. Fixed rate, Adjustable rate, వాటి సంయుక్తాలు - ఎన్నో రకాల అప్పులున్నాయి. గుణోత్తర శ్రేణి సూత్రాలు (geometric progression formulae) సరిగా తెలిస్తే ఎలాంటి అప్పుకైనా నెలసరి చెల్లింపు ఇట్టే కనిపెట్టేయచ్చు.
4. అప్పు సర్వీసింగ్ (servicing): ఈ దశలో నెలసరి చెల్లింపులు తీసుకుని ఆ చెల్లింపులని అసలుకి కొంత, వడ్డీకి కొంత కేటాయించడం జరుగుతుంది. MS Excel లో చిన్నమెక్రో రాసి ప్రతి నెలా చేయవలసిన కేటాయింపు కనిపెట్టవచ్చు. ఒక చిన్న బొటనవేలి సూత్రమేమంటే మొదట్లో అసలుకి తక్కువ, వడ్డీకి ఎక్కువా కేటాయింపు ఉంటుంది. రాను రాను, అప్పులో అసలు శాతం తగ్గడంవల్ల వడ్డీకివెళ్ళే కేటాయింపు కూడా తగ్గుతుంది. అప్పు పుట్టించిన సంస్థే సర్వీసింగు కూడా చేయాలనే నియమం లేదు. ఉపవిపణుల వలన పుట్టించిన అప్పులని మెట్టింటికి (వేరే సంస్థకి) పంపవచ్చు.
5. ఉపవిపణి (secondary market): ఒకే రకమైన అప్పులన్ని ఒక గుంపుగా చేసి దాన్ని ఒక జామీను (security) పత్రంగా తయారు చేయచ్చు. Fannie Mae, Freddie Mac తదితర సంస్థలు అప్పుల గుంపులని కొంటాయి. ప్రతీ అప్పు పత్రం వెనకా కుదువకున్న ఇల్లు ఉండనే ఉంది, దాని పైన అప్పుదారుడి నెలవారి చెల్లింపుల హామీ కూడా ఉంది. ఇంకేమి కావాలి? కొన్ని దశాబ్దాల క్రితం ఇల్లు కొనుక్కోవడమనే అమెరికన్ స్వప్నాన్ని సామాన్యులు కూడా సాకారం చేసుకోవాలనే ఉద్దేశ్యం తోనే Fannie Mae, Freddie Mac లాంటి సంస్థలని నెలకొల్పింది అమెరికన్ ప్రభుత్వం. వాటితోనే ఉపవిపణులు పుట్టి వర్ధిల్లాయి.
వచ్చే టపా సబ్-ప్రైం కష్టాలు ఎలా ఉధ్భవించాయి? - 2 లో అప్పిచ్చే సంస్థల దురాశ వల్ల వచ్చిన కష్టనష్టాల గురించి చెప్పుకుందాం.
Friday, September 07, 2007
సబ్-ప్రైం అంటే ఏంటి?
అమెరికా లో సబ్-ప్రైం (ఇంటి) ఋణాలు తెచ్చిన ముప్పు వల్ల కొన్ని వారాలుగా ప్రపంచ స్టాక్ విపణులు లోలకాల్లా ఊగిసలాడుతున్నయి . దీని వల్ల అమెరికాలో ఫెడరల్ రిసర్వ్ బోర్డ్ , ఐరోపా, ఆసియా ఖండాలలో కొన్ని దేశాల జాతీయ కోశాగారాలు వడ్డీలని తగ్గించి వ్యాపరసంస్ఠలకి ఋణాలు అందుబాటులో ఉండేలా చేయవలసి వస్తోంది.ఈ విషయాన్ని విపులీకరిస్తూ కొన్ని వ్యాసాలు రాద్దామనుకుంటున్నా.
సబ్-ప్రైం అప్పులంటే ఏమిటి? అసలీ పరిస్ధతి ఎలా ఉద్భవించింది? ఇంటి కుదువ అప్పులకీ, స్టాక్ విపణులకీ ఉన్న సంబంధమేమిటి? షేర్లు కొనని వారికి స్టాక్ విపణులు పడిపోతే నష్టముందా? వడ్డీలు తగ్గిస్తే ఈ చిక్కు ఎలా విడుతుంది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వివరించే వ్యాసాలు రాద్దామనేదే నా ఉద్దేశ్యం. మీ అభిప్రాయాలు తెలుపండి. Bouquets and brickbats are welcome!
ముందుగా సబ్-ప్రైం అప్పుల గురించి బాలబోధ (primer).మమూలుగా అప్పులుపుట్టని జనానికి కొన్ని మినహాయింపులు ఇచ్చి, ఆ మినహాయింపులకి ప్రత్యామ్నాయంగా వడ్డీని పెంచి, ఋణ సౌకర్యం కలిగిస్తాయి కొన్ని సంస్థలు. అలాంటి అప్పులని సబ్-ప్రైం అప్పులు అంటాము. ఇటువంటి అప్పిచ్చు పద్దతికి సుగుణాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒకప్పుడు మంచి ఋణచరిత్ర (credit history) ఉన్నా సమయం బావుండక కష్టాల్లో పడ్డవాళ్ళకి ఇటువంటి ఋణ సదుపాయం, కాళ్ళ మీద నిలబడే చేయూతనిస్తుంది. కష్ట సమయంలో ఆదుకున్న సంస్థల పట్ల ఉండే కృతజ్ఞత వల్ల అలాంటివారు మంచి కస్టమర్లయ్యే అవకాశం ఉంది. కాకపోతే కష్టాల ఊబిలోంచి బయటకి రాలేక, మళ్ళీ బాకీ ఎగకొట్టేవారూ ఉంటారు. ఎగకొట్టకుండా బాకీ తీర్చే వాళ్ళని కన్నిపెట్టి అప్పులివ్వడం -పొట్టుని ధాన్యం నుంచి వేరుచేయడం లాగ- కష్టమే. కష్టమో నష్టమో అది చేయవలసిన బాధ్యత మాత్రం అప్పివ్వబోయే సంస్థమీదే ఉంటుంది.
ఒకప్పుడు, ఇలాంటి కస్టాలు మనకెందుకురా బాబు అని సంస్ఠలు ఋణచరిత్రాహీనులని, ఋణకుచరిత్రులని (individuals lacking credit history and individuals with bad credit) పక్కన పెట్టేసేవారు. మట్టిలోనూ మాణిక్యాలుంటాయని తెలుసుకున్న కొందరు అలాంటి మాణిక్యాలని వెలికితీసి వారికి అప్పులివ్వడం మొదలు పెట్టి, లాభాలు సాధించి సబ్-ప్రైం ఋణవిపణి పెరగడానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి ఋణాలివ్వడంలో అనుభవం సాధించిన ఎన్నో సంస్థలు తమ కలనయంత్ర తంత్రాలలో పూచీపెట్టుడు వ్యాపార సూత్రాలని నిర్మించి (underwriting business rules), సబ్-ప్రైం అప్పులిచ్చే పధ్ధతిని సుళువు చేసుకున్నారు. ఈ పుచీ పెట్టుడు సూత్రాలు అప్పడిగే వ్యక్తి ఉద్యోగపు ఆదాయం, ఇతర ఆదాయం, అప్పటికే ఉన్న ఇతర అప్పులు వాటి తాలూకు నెలవారి చెల్లింపులు, భరణాలు (child support, alimony గట్రా) ఇలాంటివన్నీ గణనలోకి తీసుకుని వాటిని ఆయా సంస్థల పధ్ధతులకి పోల్చి అప్పు ఇవ్వాలో లేదో నిర్ణయిస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రస్తుత ఆదాయం తక్కువైనా భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంటే, అతనికి మొదటి కొన్ని నెలలు వడ్డీ లేకుండా (లేక స్థిరంగా ఉండే తక్కువ వడ్డీ ఇవ్వడమో) చేసి అటు పైన వడ్డీ వర్తించేలా చేసే పద్దతులున్నాయి. ఇలాంటి సడలింపులు, మినహాయింపులు చేయడానికి గాను అప్పిచ్చే సంస్థ అదనపు డబ్బు తీసుకుంటుంది.
ఇప్పుడైతే కూలిపోయింది కానీ ఒకప్పుడు సబ్-ప్రైం విపణి ఎంత లాభదాయకంగా అనిపించేదంటే వందలాది సంస్థలు కేవలం ఇలాంటి అప్పులే ఇచ్చి బ్రతికేవి. మరి ఇదంతా ఎలా చెడింది - ఈ విషయం వచ్చే టపాలో...