Showing posts with label Technology. Show all posts
Showing posts with label Technology. Show all posts

Tuesday, February 19, 2008

మైక్రోసాఫ్టు పన్నాగం

ఇది చదవండి

త. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా
(బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే)
వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా,
ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే
కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా

Thursday, September 06, 2007

అబిడ్స్ సందుల నుంచి స్టీవ్ జాబ్స్ నిష్క్రమణ

ఆపిల్ అంటే గుడ్డి నమ్మకముండి కొత్తగా విడుదలైన పరికరాలన్నిటినీ కొనే ముందరి దత్తతుదారులకు (early adotpers) గుడ్డిగా వాతలు పెడితే మున్ముందు వస్తున్న శెలవల సీజనులో వాళ్ళు ఎక్కడ దూరమైపోతారనో, లేక ఐపాడ్ టచ్ కి అంతటి గొప్ప పొగడ్తలు వినపడపకపోవడం వలనో - ఈ రోజు స్టీవ్ జాబ్స్ నిన్న చేసిన తప్పుని 'గుడ్డిలో మెల్ల' లాగ సరి దిద్ది, ఆరొందలు చెల్లించిన ఐఫోను బాధితులకి వంద డాలర్ల వెనక్కి ఇవ్వాలని నిర్ణయించాడు. డబ్బు రూపంలో కాక ఆపిల్ కొట్లోనే వాడగలిగిన సొమ్ములాగ వెన్నక్కిచ్చిన వంద డాలర్లు బ్లాగ్ప్రప్పంచంలో ఆపిల్ కి వ్యతిరేకంగా మొదలైన దుష్ప్రచారాన్ని తప్పక తగ్గిస్తుంది.

Wednesday, September 05, 2007

అబిడ్స్ సందుల్లో స్టీవ్ జాబ్స్

ఒకప్పుడు, హైదరాబాద్లో ఏవైనా సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు (వాక్మాను గట్రా) కొందామంటే అబిడ్స్ సందుల్లో ఉన్న నల్లవిపణులే (బ్లాక్ మర్కెట్లు) గతి. అలా కొనడం కొంత సాహసంతో కూడుకున్న పని, ఎందుకంటే కొనే వస్తువు సరైన ధరేమిటో తెలిసుకునే ఆస్కారం అసలు ఉండదు, ధర విషయం అటు ఉంచితే వస్తువు కొత్తదో కాదో ఎవడైనా హాయిగా ముందే దాన్ని సానపెట్టి తర్వాత కొట్లో పెట్టాడో అనేది కూడా తెలియదు. ఇన్ని అనుమానాలున్నా- విదేశాలలో మనకోసం డబ్బు విరజిమ్మ గల సన్నిహితులు లేని పక్షంలో - గత్యంతరం లేక భగవంతుడి మీద భారంవేసి, రెండు వారలలోనే కొన్న వాటిని పుటుక్కుమనిపించకు తండ్రీ అనుకుంటూ - జనం ఆ కొట్ల మీద విరగ బడేవారు. ఇంతా చేసి కొన్నా మరుసటి రోజే పక్కింటి వాడెవడో అంతకంటే చక్కటి వస్తువు బారుచవకగా కొనే ప్రమాదమూ ఉంది. ఇటువంటి వంచనకు గురై జనం కుమిలి పోవడం తప్ప ఇంకేమీ చేసిన దాఖలాలు లేవు మరి.

స్టీవ్ జాబ్స్ పుణ్యమా అని ఈరోజు, ఏదేశమేగినా ఎందుకాలిడినా కుమలి పోవడం ఒకటే, అనే విషయం పది లక్షలకు పైచిలుకు అమెరికన్జనం తెలుసుకుంటున్నారు. ఎందుకేమిటి? విడుదలై పట్టుమని పది వారాలు కాకుండానే 8GB ఐఫోను ధర రెండొందల డాలర్లు తగ్గించేసి అబిడ్స్ వ్యాపారుల దెబ్బని మరిపించే విధంగా స్టీవ్ జాబ్స్ వారిని హతాశులను చేసాడు కాబట్టి.

కొన్ని చర్చాహారాలలో (forums/discussion threads లో) లోకులు అప్పుడే ఆపిల్ మీద మూకుమ్మడి దావాలు వేద్దామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఎంతవరకూ సఫలిస్తాయనేది చర్చనీయాంశమే ఐనా, భవిష్యత్తులో ఆపిల్ విడుదల చేసే వినూత్న పరికరాలని ఎగబడి కొనే వారు తగ్గుతారనే విషయంలో అనుమానం లేదు. ఈ రోజు స్టాక్ విపణిలో ఆపిల్ షేర్ల్ పరిస్థితి చూస్తే ఇది నిజమేనని మనకి అవగతం అవుతుంది - ఐఫోన్ని పోలి ఉన్న ఐపాడ్ టచ్ లాంటి తాయిలాన్ని విడుదల చేసినా షేర్ల ధర పెరగకపోగా కుదింపుకి గురవ్వడమే దీనికి తార్కాణము.