Thursday, September 27, 2007

Cinema Paradiso కి అంత సీనెందుకు?

పోయిన నెల, 1990లో అంతర్జాతీయ చిత్రాల విభాగంలో ఆస్కర్ గెల్చుకున్న ఇటాలియన్ సినిమా 'సినిమా పారడీసో' చూసాను. బాగా పేరు గడించిన ఒక చిత్ర దర్శకుడి చిన్ననాటి జ్ఞాపకాల దొంతరే ఈ సినిమా.

సిసిలిలో ఒక చిన్న ఊరిలో టొటో పెరుగుతాడు. ఆ ఊరిలో ఒకటే సినిమా హాలు. అందులో సినిమా నడిపించే ఆల్ఫ్రెడో కి టొటో అంటే ఇష్టం. దాంతో వాడు గంటల తరబడీ ప్రొజెక్టర్ గదిలో కుర్చుని, ప్రొజెక్టర్ ఎలా నడపాలో తెలుసుకుంటూ, సినిమాలు చూస్తూ , ఆల్ఫ్రెడో తో గప్పాలు కొడుతూ గడిపేస్తాడు. ఆ ఊళ్ళో చూపబడే సినిమాలన్నింటినీ మొదట అక్కడి ఫాదర్ చూసి - ఎక్కడైనా ముద్దుకానీ, ఇంకేదైనా 'సన్నిహితావేశ సన్నివేశం' కానీ వచ్చిందంటే వెంటనే ఒక గంటని మోగిస్తాడు, ఆ సన్నివేశాన్ని కత్తిరించేయమని ఆల్ఫ్రెడోకి అది సంకేతమన్నమాట. అలా శుభ్రపరచబడిన సినిమాలే ఊరి జనానికి కనబడేవి. ఆల్ఫ్రెడోకి కత్తిరించిన రీలు ముక్కలనన్నీ ఒక దగ్గర పోగు చేయడం అలవాటు. ఒక మారు టొటొని వదిలించుకోవడానికి ఆ పోగు వాడికిస్తానని ఒట్టేసి వాణ్ణి బైటకి నెట్టేస్తాడు.

అంతలో ఒక దురదృష్టకర సంఘటనవల్ల ఆల్ఫ్రెడో కళ్ళు పొతాయి. ఊళ్ళో ప్రొజెక్టర్ నడపగలిగిన వాడు టొటొ తప్ప ఎవడూ లేక, హాలు యజమాని ఆ పని టొటొకే అప్పచెపుతాడు. టొటొ సినిమా హాలుని నడుపుతూ పెరిగి పెద్దవుతాడు. ఊరిలో ఇంకేమీ వేడుకా వినోదాలు లేక, అందరూ సినిమా హాలు మీదే పడతారు. అక్కడే ఎన్నెన్నో సంగతులూ, సంఘటనలూను. చూడడానికి హాస్యంగా ఉంటాయి కొన్ని.

కాలక్రమేణా ఊరు మారుతూఉంటుంది, ఒక చిన్న ప్రదేశానికి ఉండే పసితనపు అమాయకత్వం నెమ్మదిగా మాయమవుతూ ఉంటుంది - ఒక విధంగా చూస్తే టొటొకూడా ఆ ఊరులో ఇక ఇమడని విధంగా పెరుగుతుంటాడు. అది గమనించిన ఆల్ఫ్రెడో వాణ్ణి, తల్లినీ, స్నేహితులనీ, ఊరునీ వదిలి రోమ్ వెళ్ళిపొమ్మంటాడు. ఒక వేళ పొరపాటున తిరిగి వచ్చినా వాణ్ణి ఆదరించనని మరీ చెప్తాడు. పైకి రావాలనే తపన, తెలివి తేటలు ఉన్న టొటొ ఆ చిన్న ఊరుని వదిలి రోమ్ వెళ్ళి అక్కడ ప్రసిధ్ధి పొందిన సినీ దర్శకుడవుతాడు. ఊరికి మరో ముప్పై ఏళ్ళ దాకా రాడు.

ముప్పై ఏళ్ళ తరువాత జరిగిన ఒక సంఘటన వల్ల తిరిగి ఊరు రావఢం, వెనకటి జ్ఞాపకాలు కమ్ముకు రావడమూ జరుగుతుంది. ఎప్పుడో ఆల్ఫ్రెడో ఇస్తానన్న రీళ్ళ పోగు చేతికందుతుంది. ఓ చిన్న ఊరుని, ముప్పై ఏళ్ళలో జరిగిన మార్పులని దర్శకుడు చాలా బాగా చూపిస్తాడు. ఈ సినిమాకి హైలైట్ అంటే ఎన్నియో మరికోన్ నేపధ్య సంగీతం (ఇతడు బ్రయన్ డి పామ తో, సెర్జియొ లియొన్ తో బాగా పని చేసాడు, ఇతను కూర్చిన 'ద అన్టచబుల్స్' సంగీతం నాకు చాలా ఇష్టం. క్లింట్ ఈస్ట్వుడ్ నటించిన ద గుడ్, ద బాడ్ అన్డ్ తె అగ్లి కి ఎన్నియో మరికోన్ ఇచ్చిన సంగీతం చాల ప్రాచురం పొందింది. మచ్చుక ఇక్కడ). సినీ ప్రియులందరికీ నచ్చేది ఒకటుంది ఈ సినిమాలో - అది ప్రాచుర్యం పొందిన అలనాటి హాలివుడ్, ఇటాలియన్ చిత్రాల గుళికలు ఎన్నో ఇందులో పొందుపరచబడి ఉండడం.

ఈ సినిమాకి రెండు రకాల స్పందన వచ్చింది. మొదటిది ఇటలీలో ముందు విడుదలైనప్పడు - అక్కడి వారికి ఇదంత గొప్ప సినిమా అనిపించలేదు, అందుకే వ్యాపార పరంగా పల్టీ కొట్టింది. రెండోది సినీ ఉత్సవాలలో ప్రదర్శితమైనప్పుడు. సమీక్షకులు దీన్ని ఆకాశానికి ఎత్తేసారు. అంతర్జాతీయంగా ఇక వెనుతిరుగు లేనిదై, చివరకు ఆస్కర్ కూడ గెల్చుకుంది. నాకు మటుకు, ఈ సినిమా నచ్చింది కానీ అంత గొప్పది అనిపించలేదు. నాది కూడ ఇటాలియన్లది లాంటి మొదటి ప్రతిస్పందనే.

2 comments:

S said...

నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆ పిల్లవాడి పాత్ర.

శరత్ said...

రివ్యూ బాగుంది థాంక్యూ!