Thursday, September 27, 2007

చందమామ కధలాంటి ఉగెత్సు

ఉగెత్సు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన జపనీయుల చిత్రాలలో ఒకటి. కధాపరంగా చూస్తే ఒక చందమామ కధలాగ ఉంటుంది, ఏభైల్లో నిర్మింపబడి బ్లాక్&వైట్ ఐనప్పటికీ ఇప్పటి చిత్రాలకి తీసిపోని విధంగా ఉంటుంది కధనం.

పదహారవ శతాబ్దపు జపాన్. గెంజురో ఒక కుమ్మరి, అతని భార్య మియాగి, వారికి ఒక చిన్న కుర్రాడు గెనిచి; వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు తోబే, ఒహామ జంట. వీరుండేది ఒక చిన్న పల్లె. చుట్టుపక్కల జరుగుతున్న యుధ్ధాల ప్రభావం ఈ చిన్న పల్లె మీదకూడా పడుతుంది. సైనికులు ఏ ఊరునైనా చుట్టుముడితే మగవారిని పనివాళ్ళుగా, దొరికిన తిండీ వస్తువులు సొంతమైనవాటిలాగ తీసుకుని పోవడం రివాజు. కాక పోతే ఈ యుధ్ధాల వల్ల కుండలకి, పింగాణి పాత్రలకీ గిరాకి హెచ్చుతుంది.

గెంజురోకి డబ్బు పిచ్చి. తోబేకి సామురై కావలని పిచ్చి. ఉన్నదానితో సర్డుకుపోదాం అని మియాగి ఎంత చెప్పినా విననివాడొకడు, సామురైలు బిచ్చగాడిలా జమకట్టి ఎన్నిసార్లు తరిమేసినా ప్రయత్నాలు మాననివాడింకొకడు. వీళ్ళ పైత్యాలకి పాపం భార్యలు నలిగిపోతుంటారు. ఒక రాత్రి సైనికులు రానే వస్తారు. రెండు కుటుంబాలూ చేతికి అందిన కుండలు మూటగట్టుకుని వేరే పట్టణానికి బయలుదేరుతారు. ఒక పడవ పట్టుకుని నది దాటుటుండగా చావుబతుకుల్లో ఉన్న ఒకడు ఎదురై సముద్రపు దొంగలున్నారనీ, ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండమనీ చెపుతాడు. అది విని వీరు మియాగిని ఇంటికి పంపేస్తారు. ఒహామ వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకోదు, ఇద్దరూ మితిమీరి ఏ ఆపద కొని తెచ్చుకోకుండా చూస్తానని చెప్పి మియాగిని ఒప్పిస్తుంది.

మియాగి కొడుకుతో ఇంటి దారిపట్టి వెళుతుండగా ఒక సైనికుల ముఠా తిండికోసం వెంటపడతారు - వారికి చిక్కినా, ఎలాగో గింజుకుని బైట పడే ప్రయత్నంలో ఒక సైనికుడి బాకు గుచ్చుకుని గాయపడుతుంది మియాగి. అదే సమయానికి గెంజురో, తోబె, ఒహామ ఒక ధనవంతమైన పట్టణానికి చేరుకుని అమ్మకాలు మొదలుపెడతారు. ఇంతలో ఒక సైనికుల (సమురై) గుంపు అక్కడినుంచి వెళ్ళడం చూసి తోబె ఉత్సాహంతో ఒహామ ఎంత చెప్పినా వినకుండా వారి వెంట పరుగెట్టి పోతాడు. అతడి వెంట వెళ్ళి దారి తప్పిన ఒహామని ముగ్గురు సైనికులు బంధించి చెరుస్తారు. మొగుడు ఎక్కడున్నడో తెలియక, ఏ ఆసరాలేక ఒహామ ఒక వేశ్యగృహానికి చేరుతుంది.

ఇంతలో గెంజురో దగ్గరకి ఒక అత్యంత సౌందర్యవతి వచ్చి కుండలు కావాలనీ, గెంజురో ఇంటికి వచ్చి వాటిని ఇవ్వాలనీ అడుగుతుంది. వచ్చినది ఒక దెయ్యమని తెలియక వాడు మాయలో పడ్డవాడిలా వెంటవెళ్ళి ఆమె ఇంట చిక్కుకుంటాడు. భార్య, పిల్లాడిని మరిచి ఆ దెయ్యాన్నే పెళ్ళాడి సమయం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. ఒక సారి ఆమెకి ఏదైనా కొందామని పట్టణానికి వస్తే అక్కడ్ ఒక పూజారి ఎదురై, ‘నీ మొహంలో ప్రేత కళ ఉంది, నువ్వు ప్రేతాలతో సమయం గడుపుతున్నావు, వెంటనే అది మాను, లేకపోతే చస్తావు’ అని హెచ్చరిస్తాడు.

అక్కడ తోబె చచ్చిన ఒక భూస్వామి తల నరికి సామురైల దగ్గరకి తీసుకుని పోతాడు. ఆ భూస్వామి కోసం అప్పటికే సమురైలు వెతుకుతూ ఉంటారు. వాణ్ణి తోబేనే చంపాడనుకుని వాడికి సకల సత్కారాలూ చేసి, సామురైని చేసి, చేతికింద కొంతమంది సమురైలని ఇచ్చు పంపుతారు అక్కడి సామురైలు. తన విజయాన్ని వేడుక చేసుకోవాలని తన గుంపుతో తోబె ఒక వేశ్యగృహానికి వెళ్తాడు. అక్కడ వాడికి ఒహామ కనిపిస్తుంది. హతాశుడై పోతాడు.

కోరి కొని తెచ్చుకున్న కష్టాల నుంచి గెంజురొ, తోబె ఎలా బైట పడతారనేది మిగతా కధ.

ఎక్కడా బోరు కొట్టకుండా చక చక నడుస్తూ ముందుకు సాగిపోతుంది కధ. కధలో మంచి, చెడూ - రెండు రకాల దెయ్యాలు వస్తాయి. (చివర్లో మంచి దెయ్యం వచ్చినప్పుడు మనకి బాధ కలగక మానదు). చందమామ కధలలో లాగ దెయ్యాలు కూడా మనుషులలాగే ‘fact of life’ లాగ చూపించినా, దర్శకుడు ప్రేక్షకుల తెలివితేటలని హేళన చేస్తున్నట్టు ఎక్కడా అనిపించదు. సినిమా అయిపోగానే మళ్ళీ చూడాలనిపించింది. ఏభైల్లోనే ఇలాంటి సినిమాలు తీసారా జపనీయులు అని నాకు ఆశ్చర్యం వేసింది. పాపం ఆడవాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని కష్టాలని గురిచేసిన గెంజురొ, తోబెల మీద పిచ్చి కసి కూడా వచ్చింది. అంతగా కధలో లీనంచేసినందుకు దర్శకుడు ప్రతిభ మీద గొప్ప అభిప్రాయమూ ఏర్పడింది.

దొరికితే ఈ సినిమాని వదలకండి.

No comments: