Saturday, September 29, 2007

The bicycle thief

విట్టొరియొ డిసిక తీసిని ఈ ఇటాలియన్ చిత్రం నలభై దశకంలో రెండవ ప్రపంచ యుధ్ధం వల్ల రోమ్ లో సామాన్యులు పడ్డ కష్టాలకి దర్పణం పడుతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా గొప్ప చిత్రాల చిట్టాలలో తప్పక కనిపిస్తూ ఉంటుంది.

కధ విషయానికొస్తే: రిచి ఓ ఏడాది పాటు నిస్తేజంగా వేచి చూసాక చివరకి అతడికి ఉద్యోగ శాఖ వారు పోస్టర్లు అంటించే ఉద్యోగం ఇస్తారు. కానీ ఉద్యోగం చేయాలంటే సైకిలు అవసరం. తన దగ్గరా సైకిలు లేదు, చుట్టుపక్కల ఎంతోమంది తమ దగ్గర సైకిలుంది, ఉద్యోగం తమకి ఇవ్వండని అడుగుతుండే సరికి - వచ్చిన అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అని రిచి ‘సైకిలుంది’ చెప్పి ఠక్కున ఉద్యోగ పత్రాలు తీసుకుని అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్తాడు.

రిచి భార్య మరియ, ఇంట్లో ఉన్న మంచి దుప్పట్లు అమ్మి సైకిల్ కొందామంటుంది. ఇద్దరూ దుప్పట్లు పట్టుకుని మర్కెట్టుకి వెళ్ళి వాటిని అమ్మిన డబ్బుతో ఒక పాత సైకిల్ కొంటారు. ఇక తమ కష్టాలు తీరే సమయం వచ్చిందని మురిసిపోతారు. ఆ మర్కెట్టు మనకి అప్పట్లో జనం పడుతున్న కష్టాలని కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది - ఎంతో ప్రియమైన వస్తువులైనప్పటికీ ప్రస్తుతపు కష్టాలని గట్టెక్కించడానికి పనికి రానివై, పూటకూటి అవసరాన్ని తీర్చలేనివైన వాటిని జనం తమ ఇతర అవసరాలకి అమ్మేయడం - ఇదీ అక్కడ జరిగేది.

ఏమైతేనేమి, సైకిల్ చేతికందింది కదా అని, దాన్ని అపురూపంగా మొదటి రోజు ఉద్యోగానికి తీసుకుపోయి తన పని ప్రారంభిస్తాడు రిచి. దారి పక్క తన మొదటి రీటా హేవర్త్ పటం అంటిస్తుండగా ఎవడో దొంగ తటాలున వాడి సైకిల్ తీసుకుని తొక్కుకు వెళ్ళి పోతాడు. ఇదో ముఠా పని అవ్వడం వల్ల, ఇంకొకడు రిచిని ‘అడిగో దొంగ’ అని తప్పు దోవ పట్టించి, అసలు దొంగ తప్పించుకునేలా చేస్తాడు. నిరాశ నిశ్పృహలు కమ్ముకున్నా, తన సైకిల్ తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో తన కొడుకు బ్రూనోని వెంటబెట్టుకుని రోమ్ నగర్ సైకిల్ మర్కెట్టులు, వాటి వెనక ఉన్న సందుగొందుల్లో వెతకడం ఆరంభిస్తాడు.

మిగితా కధల్లా ఈ అన్వేషణ గురించే...ఎక్కడా పట్టు సడల కుండా చక్కగా కధని చెప్పుకు (చూపుకు?) పోతాడు దర్శకుడు. రిచి కొడుకు బ్రునో గా నటించిన కుర్రడి నటన అద్భుతం. దొంగకోసమని వెతుకుతూ చాల దూరం తిరిగిన తర్వాత వాడు ఓ మూల ఉచ్చ పోద్దామని వెళ్తుండగా, ఇంకో వైపు దొంగని కనిపెట్టిన రిచి ఒక్కపెట్టున ‘రా పోదాం’ అని అరిచినప్పుడు, వాడు ఎగిరి గంతేయడం చూస్తే నవ్వాగదు. వెతికి వెతికి వేసారి రిచికి ఒక్కసారిగా ‘moment of clarity’ వస్తుంది. జరిగేదేదో జరుగుతుంది ఇంత ఆదుర్దా ఎందుకనుకుని, కొడుకుని తీసుకుని ఒక హోటలుకి వెళ్ళి రొట్టెలు, వైను కొంటాడు...కాసేపు ఆ ‘make-believe happiness లో ఉన్నా, చివరకి తానున్న కష్టాలు మళ్ళి గుర్తుకు వచ్చి రిచి ముహం వాలి పోవడం చూస్తూంటే మనకి బాధ కలగక మానదు.

పాపం, మూఢ నమ్మకస్తురాలని మొదట్లో భార్యని జ్యోతిష్కురాలి దగ్గరకు వెళ్ళద్దని చెప్పినవాడే, భరింపలేని కష్టం వచ్చేసరికి తలొంచి తానే అక్కడకి వెళ్ళడం చూస్తుంటే మనకి జాలి కలుగుతుంది. ఒక చోట, కోపం ఆపుకోలేక కొడుకుని చెంపమీద ఒక్కటిచ్చిన వెంటనే బాధ పడిన వైనం, చివర్లో ఎవరూ లేనిచోట ఉంచబడిన ఒక సైకిల్ కనబడితే ఒక పక్క దాన్ని దొంగిలించాలనే ఆలోచనలు, ఇంకో పక్క అది తప్పని చెప్తున్న మనస్సాక్షి - వీటి మధ్య నలిగిపోయిన వైనం, ఇవి చూస్తూంటే ఎవరికైనా జాలి బాధ తప్పక కలుగుతాయి. ఈ చిత్రం అంతటి ప్రసిధ్ధి ఎందుకు పొందిందో అవగతము అవుతుంది.

No comments: