Thursday, September 06, 2007

నిద్దురపోరా తమ్ముడా..

'మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా' అన్న ఘంటసాలగారి పాట పల్లవి సారాన్ని వడబోసిన తల్లిదండ్రులెందరో చదువుకునే వయసులో ఉన్న సంతతిని తెల్లవారు ఝామున నిద్ర లేపుతూ ఇబ్బందులకి గురి చేస్తారన్న విషయం లోకవిదితమే. 'ఇంకొక్క ఐదు నిమిషాలు నాన్న.. ' అని వేడుకుని కునుకులోకి జారుకున్న మరుక్షణమే మేలుకొలుపు పిలుపులు మళ్ళీ మొదలవడం ఎవరు ఎరగనిది?


ఐతే ఇన్నాళ్ళు "పొద్దున్న లేస్తే చదువు పూర్తవడమే కాక ఆరోగ్యమూ మెరుగవుతుందని" నూరిపోసే తల్లిదండ్రులకి బదులు చెప్పలేని పిల్లలకి జపాన్ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిశొధన జరిపి అమూల్యమైన అయుధాన్ని అందజేసారు. అదేమిటంటే, ఎప్పటినుంచో మనని నిద్రలేపడానికి వాడబడుతున్న "పురుగు ముందరి పిట్టకే దొరుకు (early bird gets the worm)", "లే! మరి(యు) వెలుగు!! (Rise and shine)" లాంటి నానుడులలో నిజం పాలు తక్కువేనని వారి వాదన. పొద్దున్నే లేచే అలవాటుతో పెద్దగా ఒరిగేదేమి లేకపోగా, ఆరోగ్యం (ముఖ్యంగా గుండె) దెబ్బతినే అవకాశంకూడా ఉందిట...హార్నీ!

భావి తరాలూ, జాగేల? ముసుగు తన్నండి! నేనీలోపల వెళ్ళి మా పిల్లని నిద్ర లేపాలి.

No comments: