Wednesday, September 26, 2007

Kill Bill కి తాత The sword of doom

కిల్ బిల్ మొదటి భాగం చూసి బైటకి వస్తున్నప్పుడు ఎవరో ఒకావిడ తన స్నేహితురాలితో అనడం విన్నాను "ఇంకెప్పుడు ఇలాంటి చిత్రహింసలున్న సినిమాకి నన్ను నేను బలిచేసుకోను" అని. పాపం ఆమె ఏమి ఊహించుకుని వచ్చిందో కానీ అంతటి రక్తపాతం మాత్రం ఉంటుందని అనుకోలేదనుకుంటా. మరి ఆమె స్వోర్డ్ ఆఫ్ డూమ్ చూసుంటే ఏమనేదో? కిల్ బిల్ దర్శకుడు క్వెంటిన్ టారంటినోకి ప్రాచ్య దేశాల చిత్రాలంటే (మన దేశపు చిత్రాలని మినహాయించాలనుకుంటా) ఉన్న మక్కువ అందరికీ విదితమే. అరవై దశకంలో విడుదలైన (రంగుల హంగులు లేని) ఈ జపనీయుల చిత్రం రక్తపాతం విషయంలో కిల్ బిల్ కి తాత అని చెప్పచ్చు. బహుశా ఈ చిత్రం చూసే QT కిల్ బిల్ తీయడానికి ప్రేరితుడైయ్యాడేమో.

తత్సుయా నకడై (కగెముష, రాన్ సినిమాలలో ప్రధాన పాత్రధారి), తిషిరో మిఫునె ఉన్న ఈ రెండు గంటల చిత్రంలో కనీసం వందమంది శవావలుతారు. కధ అలాంటిది. రునోసుకె (నకడై) ఒక గొప్ప సామురై, కత్తి యుద్ధంలో అతడిది సాటిలేని నైపుణ్యం. అతడికి కుతత్వంలో కూడా ఎవరూ సాటిలేరనే చెప్పచ్చు.. దాంతో అతడి కత్తికి రక్తదాహమెక్కువ. చిన్న పెద్దా, మంచి చెడూ తేడా చూడకుండా అతడు జనాన్ని ఊచకోత కోస్తాడు. అలాంటి దురాగతాల వల్లే తన తండ్రికీ, పుట్టి పెరిగిన ఊరుకీ దూరమై మారు పేరుతో వేరే చోటెక్కడో బతకవలసి వస్తుంది. అతడు ఉంటున్న ఊరులోనే షిమడ (మిఫునె) అనే ఇంకో గొప్ప సామురై ఉంటాడు. అతడు రునోసుకె తత్వానికి పూర్తి వ్యతిరేకి, కత్తి యుద్దంలో అత్యంత ప్రావీణ్యత ఉన్నా, తన ప్రావీణ్యాన్ని ఇతరులకి పంచుతూ, తప్పని పరిస్తితులలో కానీ ఎవరికీ హానీ తలపెట్టని వాడు.

ఊరు మారినా తన వైఖరి మారని రునోసుకె షోగన్ అధికారానికి ఎదురు తిరుగుతున్న ముఠాల వెంట ఉండి అవకాశం దొరికినప్పుడల్లా ఎవరినో ఒకరిని తన కత్తికి బలి ఇస్తూనే ఉంటాడు. ఒక మారు ముఠాతో కలిసి ఒక అధికారిని మట్టుపెడదామనే ఉద్దేశ్యంతో అతడి పల్లకీని వెంబడించి చుట్టుముట్టి చూడగా, అందులో షిమడ ఉంటాడు. పదిహేను మంది దాక ఉన్న ముఠా వాళ్ళని షిమడ చక చకా నరికేస్తాడు, ఒక్క రునొసుకె మిగులుతాడు. రునుసోకెకి మొదటి సారి ఆత్మ విశ్వాసం పోతుంది. ఆ ఊరు వదలి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. కానీ అతణ్ణి షిమడ శిష్యుడొకడు, తన అన్న చావుకి ప్రతీకారం తీర్చుకునే నిమిత్తం, వెంబడించి వస్తాడు.

అక్కడ రునుసొకే ఒక వేశ్యా గృహంలో ఇంకో ముఠాతో తాగుతూ, మతి చలించి ఒక్కసారిగా తాను చేసిన హత్యలన్ని గుర్తుకురాగా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నరకడం మొదలు పెడతాడు. ఒక గొప్ప బాలే డాన్సర్ చేస్తున్న నృత్యంలా కనిపించే అతడి కదలికలకి చుట్టూ గుట్టలు గుట్టలుగా జనం చస్తూ ఉంటారు. అలా ఒకడిని చంపుతూ రక్తసిక్తమైన ఒంటితో కెమరావైపు వస్తున్నప్పడు, సినిమా హఠార్తుగా ముగుస్తుంది. అంతే!

షిమడ శిష్యుడు, అతడి ప్రేమ కధ, ప్రతీకారం ఇవేమీ ఒక కొలిక్కి రాకుండానే సినిమా ముగుస్తుంది. ఎందుకంటారా, ఈ సినిమా తీసినప్పుడు ఇంకా రెండు భాగాలు తీద్దామనుకున్నరట. కానీ అది సాధ్యపడలేదు. త్రిశంకు స్వర్గంలాంటి మొదటి భాగం మనకి మిగిలింది. కైజాన్ నకజాటో రచించిన పుస్తకం మీద ఆధారితమైనదీ చిత్రం. ఆ పుస్తకం జపనీయుల చరిత్రలో కొన్నేళ్ళ క్రితం వరకూ అతి పొడవాటి పుస్తకమట. 1533 అధ్యాయాలున్న ఈ పుస్తక రాజం శీర్షికగా వెలువడుతున్నప్పుడే రునుసొకె పాత్రని తీసుకుని ఎన్నో నాటకాలు, రెండు మూడు చిత్రాలూ తీసారట.

ఈ సినిమాలో చెప్పుకొదగ్గ విషయాలంటే - కెమెరా పని, నకడై నటన (అమోఘం), నేపధ్య సంగీతం. మిఫునె పెద్దగా కనిపించడు కానీ ఉన్న కొద్దిసేపూ అదరకొట్టేస్తాడు.వీటి కోసమైనా సినిమాని ఒక్కసారి చూసితీరాలి. గమనించండి, ఎందుకో బ్లాక & వైట్ చిత్రాలలోనే రక్తపాతం ఎక్కువ భయంకరంగా ఉంటుంది. షిమడ ముఠాని నరుకుతున్న సన్నివేశంలో ఒకడి చెయ్యి తెగి మంచుమీద పడినప్పుడు తెల్లటి మంచుమీద నల్లటి రక్తం ఒళ్ళు జలదరింపచేస్తుంది. ఇలాంటి సన్నివేశాలని చూస్తే మీరు కూడా The sword of doom, Kill Bill కి తాత అని ఒప్పుకుంటారు.

2 comments:

Solarflare said...

Kill Bill Vol.1లొ నిజంగా అంత హింస మనకి చూపించడు - హింస వచ్చేసరికి - black and whiteలొకి మారిపొతాడు. ఒక్క ఆ french పిల్ల చెయ్యి నరకడము, O'rien-ishi తల నరకడము తప్ప ఎక్కువ హింస చూపలేదనె నా ఉద్దెశ్యం. మీరు చెప్పిన సినిమా చూడాలి. నాకు తెలిసినంతవరకు - జపనీస్ సినిమాలలొ కౄరత్వం ఎక్కువగానే ఉంటుంది.

గిరి Giri said...

నేను చూసిన జపనీయుల చిత్రాలలో ఇందులోనే అంతగా రక్తపాతం చూసాను. కౄరత్వం మరి నాకు ఎక్కువ అనిపించలేదు.
కిలిబిల్ లో కలర్ లో ఉన్నా, బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా అన్ని చావులు చూసినవారికి హింస చూసినట్టే ఉంటుంది. మీరు చెప్పిన మెడ నరకడం, తలపైభాగం నరకడం జలదరింప చేసే సన్నివేశాలే..కానీ ఎందుకో, మెడ నరికినప్పుడు రక్తం ఫౌన్టేన్ లాగ రావడం చూసి హాలు లో చాలమంది నవ్వడం కూడా చూసా..