వెనకటికి ఒక మంద బుధ్ధి ఉండే వాడట. వాడికి తర్కమంటే ఏమిటో తెలియదు కానీ తెలివిగా వాదించడమంటే మహా పిచ్చి.
వాడు ఒక స్నేహితుణ్ణి పట్టి, "ఒరే బాబూ తర్కమంటే ఏమిటో వివరించరా" అని అడిగాడు. మన వాడి వాలకం తెలిసిన స్నేహితుడు ఒక క్షణం ఆలోచించి, "సరే నీకు ఇల్లుందా?" అన్నాడు. ఉందన్నాడు మబ్బు. "మీ ఇంట్లో మొక్కలున్నాయా?" , ఉన్నయన్నాడు మబ్బు. "మొక్కలకి మీ ఆవిడ నీళ్ళు పోస్తుందా?" పోస్తుందన్నాడు మబ్బు. "మీ ఇంట్లో చిన్న పిల్లల బొమ్మలున్నాయా?" ఉన్నాయన్నడు మబ్బు. "దీని వల్ల తెలుస్తున్నదేమిటంటే, నువ్వు నీ భార్య ప్రేమతో మీ ఇంట్లో కలవడం వల్ల మీకు పిల్లలు పుట్టారు" అన్నాడు స్నేహితుడు. ఇంతటి వ్యక్తిగత విషయం నీకెలా తెలిసిందన్నట్టు విస్తుపోయాడు మబ్బు. "అదేరా అబ్బాయ్ తర్కం అంటే" అని వెళ్ళిపోయాడు స్నేహితుడు.
కాసేపు ఆలోచించి మంద బుధ్ధి ఇంకో స్నేహితుడి వద్ద ఈ తర్కం ప్రయోగిద్దామని వెళ్ళాడు. వాడితో "నీ గురించి నేను అత్యంత వ్యక్తిగత విశేషాలు తెలుసుకోగలను" అన్నాడు. అదెలా అనడిగాడు స్నేహితుడు. "నీకు ఇల్లుందా" అన్నాడు మబ్బు. ఉందన్నాడు స్నేహితుడు. మీ ఇంట్లో మొక్కలున్నాయా అన్నాడు మబ్బు. ఉన్నాయన్నడు స్నేహితుడు. మొక్కలకు మీ ఆవిడ నీళ్ళు పోస్తుందా అన్నాడు మబ్బు. లేదు పక్కింటావిడ పోస్తుంది అన్నాడు స్నేహితుడు. "ఐతే నువ్వు మీ పక్కింటావిడా ప్రేమతో మీ ఇంట్లో కలవడం వల్ల మీకు పిల్లలు పుట్టారు" అన్నాడు మబ్బు.
==
ఈ హాస్యోక్తి అవసరం ఎందుకొచ్చిందంటే, అటువంటి సంఘటనే క్రితం వారం జరిగింది. నిజంగా జరిగిన ఈ సంఘటనలో మబ్బు మరెవరో కాదు, సాక్షతూ అమెరికా రాష్ట్రపతి. ప్రసంగాలలో, పాత్రికేయుల సమావేశాలలో, ఇతర చోట్లలో ఈయన వెలగబెట్టే నిర్వాకాలు ఇప్పటికే జగత్ప్రసిధ్ధి కలిగి ఉన్నాయి. పదాలని సరిగ్గా పలకలేకపోవడం, ఆస్ట్రేలియాని ఆస్ట్రియా అని తికమక పడడం, ఇంగ్లాండు రాణిని వందేళ్ళకి పైగా చేసిన పనికి అభినందించడం - ఒకటేమిటి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు, బుషిసమ్స్ అంటూ పుస్తకాలు కూడా వెలువడ్డాయి.
సరే తాజా సంఘటన విషయానికొస్తే, ఇదంతా కాండలీసా రైస్ ఇచ్చిన ఒక ముఖాముఖితో మొదలయ్యింది.ఇక్కడ చదవండి. అందులో ఆవిడ ఇరాక్ లో నెల్సన్ మండేలా లాంటి ప్రజాతంత్ర నాయకులు ఎందుకు లేరు అనే ప్రశ్నని ప్రస్తావించి, సద్దాం అలాంటి నాయకులందరినీ ఎప్పుడో మట్టుబెట్టాడని, అందువల్లే ఇప్పుడు రాజకీయ శూన్యత (political vacuum) ఏర్పడిందని చెప్పింది. బానే ఉంది. ఇప్పుడు మొదలయ్యింది అసలు కధ. ఈ ముఖాముఖి వినడంవల్లో ఏమో గానీ డుబ్యా గారికి పైన చెప్పిన మబ్బుగాడికి తట్టినట్టి ఆలోచన తట్టింది. రైస్ చెప్పిన విషయాన్ని పాత్రికేయులకు తన మాటల్లో చెప్పి తన తెలివి ప్రదర్శిద్దామనుకున్నాడు. పాపం ఉపాయం బెడిసికొట్టింది. ఇక్కడి దృశ్యకం (video) చూడండి. బుష్ చెప్పిందేమిటంటారా
ఎవరో అంటుంటే విన్నా "మండేలా ఎక్కడ" అని. నేనన్నా "మండేలా
చచ్చిపోయాడు. సద్దాం చంపేసాడు. మండేలాలందరినీ సద్దాం చంపేసాడు
పాపం ఇది విన్న దక్షిణాఫ్రికా దేశస్తులెందరో మండేలా నిజంగానే కాలంచేసారేమోనని ఆదుర్దా పడ్డారట. అలాంటిది ఏమీ లేదని ఆ దేశస్తులని అక్కిడి అధికారులు సమాధాన పరచవలసి వచ్చింది. అమెరికాకి ఇది అవమానకరం కాదా?
బుష్ లాంటి మబ్బు నేతలుంటే దేశానికి ఆర్ధికంగానే కాక, ప్రతిష్ఠా పరంగాకూడా నష్టాలు తప్పవు మరి.
No comments:
Post a Comment