Monday, September 24, 2007

పాత పాటలలో ఉపయోగకర పదాలు

ఈ మధ్య 'తెలుగు పదం' గుంపులో thanks కి తెలుగు పదమేమిటన్న ప్రశ్న ఎవరో అడిగారు. ఆ సంభాషణలో 'నెనరు' అనే పదం వెలికి వచ్చింది. నెనరు అనేది కొత్త పదం కాకపోయినప్పటికీ సాధారణ సంభాషణలలో పాపం చోటు కోల్పోవడం వల్ల సభ్యులకు అది కొత్తగా అనిపించింది.

ఈ రోజు పొద్దున్న లేవగానే వినడానికి ఆకాశవాణి వారి భక్తి-రంజని ఎలాగూ లేదు కాబట్టి అదే తరహాలో ఉండే కొన్ని భక్తి పాటలు పెట్టాను. విండోస్ మీడియాప్లేయర్లో ముందే నేను పొందుపరిచిన చిట్టాలో కాళహస్తి మహత్మ్యం పాటలు పూర్తి కాగానే భూకైలాస్ పాటలు మొదలయ్యాయి. 'పిలిచినా పలుకుమా' అనే పాట వచ్చింది. అది రావణుడు మండోదరిని వెతుకుతూ నారదుని సహాయంతో పాతాళానికి వెళ్ళినప్పుడు వచ్చే పాట. నారదుడు పాడే పాట. (అదే బాణీలో 'అగ్ని శిఖలతో ఆడకుమా' అని ఇంకో పాట కూడా ఉంది. అది రావణుడు పార్వతీదేవిని మోహించి లంకకు తీసుకువెళుతున్నప్పుడు నారదుడు ఎదురై పాడే పాట. నాకు చాలా చాలా ఇష్టమైన 'రాముని అవతారం' పాటకు ముందు వస్తుంది.)

ఇంతకీ చెప్పొచ్చే విషయమేమిటంటే, పిలిచినా పలుకుమా పాటలో తరువాత వాక్యం 'నెనరును తెలుపుమా'. ఇన్నాళ్ళు ఆ పాటా విన్నా ఆ పదాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. పట్టించుకునే ఉంటే దాని అర్ధం వెతికిపట్టే వాడినేమో.

అప్పుడనిపించింది, మన పాత పాటల్లో ఇంకా ఇలాంటి ఉపయోగకర పదాలెన్ని ఉన్నాయో, నా చెవులు వాటిని ఎప్పుడు పట్టుకుంటాయో? అని.

No comments: