Sunday, February 17, 2008
కృష్ణ
వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం
బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్
తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా?
జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక..
“Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director brought back the film on track with interesting climax by blasting a couple of fully-loaded lorries” రెండు లారీలు పేల్చేస్తే చిత్రం ఆసక్తికరంగా తయారవుతుందా?
ఐనా తప్పు నాది. ఇంటికి నడిచి వెళ్ళే దూరంలో నడిచే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. త్యాంగ్బారు ప్లాజాలో, అంటే నడిస్తే ఇంటినుండి పట్టుమని పది నిమిషాలు పట్టని చోట, కృష్ణ సినిమా ఆడుతోందనే సరికి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంత దగ్గగా తెలుగాటా? పైగా ఐడిలు బ్రేను గూట్లో జీవి బాపుందన్న సినిమా ఇది. ఇంకేం కావాలంటూ వెళ్ళిన నాకు తగిన శాస్తే జరిగింది.
సినిమా చెత్తలా ఉంది. రవితేజ పెట్టే కష్టాలని తట్టుకోలేక బహ్మానందం అరిచే వెర్రి నవ్వులు, బెల్టుతో కొట్టుకోవడాలు - ఇదీ హాస్యం. “సముద్రం అమ్మాయి ఒకే రకం, సముద్రం దగ్గరకి వెళ్తే మిగిలేవి అలలు, అమ్మాయి దగ్గరకి వెళ్తే మిగిలేవి కలలు” ఇలాంటి చెత్త సంభాషణలు, నవ్వుల కోసం చెవులు చిల్లులు పడేటట్టు అరుపులు, గావుకేకలు కోకొల్లలు ఇందులో. రవితేజ మాటతీరు, నటన బానే ఉన్నాయి కాని మంచి సినిమాకి అవొక్కటే సరిపోవుగా.
వీలు దొరికినా చూడకండి.
Jodhaa Akbar
Monday, February 11, 2008
U V Koteswara Rao
పనితనమున్ననూ పనికిమాలిన దారుల పోవుచుండగా
కనబడి, శ్రధ్ధతో చదువుకై కృషి చేసిన క్లిష్టమైనదౌ
గణితము పిండికొట్టడము కష్టము కాదని, దీక్షబూనితే
వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై
కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా
తునకలు కాకమానదని త్రోవను చూపిన విజ్ఞుడా, సదా
ఋణపడియుందు, నాదు అభివృధ్ధికి కారకుడా, నమోనమః
పై పద్యానికి నాలుగు పాదాల మూలమిది..
చ. గణితము పిండికొట్టడము కష్టము కాదని, పట్టుబట్టితే
వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై
కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా*
తునకలు కాకమానదని నూరిన కోవిదుడా నమోనమః
రామయ్యగారి వద్ద ఐఐటి పరిక్షకై చదువుకున్న వారికి కోటేశ్వరరావు గారి గొప్పదనం గురించి వేరే చెప్పనవసరం లేదు. క్రితం వారం హైదరాబాదు వెళ్ళినప్పుడు హిందు దినపత్రిక తిరగేస్తుంటే గుండెపోటు వల్ల ఆయన మరణించారని వార్త చదివి చాలా బాధ పడ్డాను. కాల్క్యులస్ బోధించడంలో ఆయనకి ఎవరూ సరిరారని నా అభిప్రాయం; పాఠాల మధ్యలో తెలుగు సామెతలు, "ఎంసెట్" కోసం బట్టీ పట్టే వాళ్ళ మీద విసుర్లు ఆయన trademark పధ్ధతి. గణిత శాస్త్రంమీద నాకు అభిమానం పెంచిన ఆయనని నేను ఎప్పటికి మరచిపోలేను.
(*ఆయన కాల్క్యులస్ లో లిమిట్స్ గురించి చెపుతూ లెగ్రాంజెస్ సిధ్ధాంతాన్ని ఓ తెలుగు గణితశాస్త్రవేత్త అడకత్తెరలో పోకచెక్క సిధ్ధాంతము అని మహ బాగా అన్నాడని చెప్పడం నాకు గుర్తుండిపోయింది)
Saturday, December 29, 2007
Blame it on the audience
ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే
సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ
లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా
తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి
తాము తీసిన చెత్త చిత్రవధలకు త
టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి
తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక
Tuesday, December 25, 2007
Don? Don't!
గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్
దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే
పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా?
====
ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా
రెన్సు ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ
ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ
ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా (పాపము ప్రేక్షక ఖర్మకాలగా!)
నేను డాన్ చూడలేదు కాని స్టైల్ అనబడే చిత్రహింసకి మాత్రం గురయ్యాను.
Sunday, December 16, 2007
ఇల్లు దొరికింది
సెడి పని పెట్టుకుంటి, నివసించుటకో కుదురైన చోటుకై
పడిపడి రైలు, టాక్సిలను పబ్లికు బస్సుల వాడుకొంచు నే
చెడతిరిగాక చిక్కెనొక సింగిలు యూనిటు త్యాంగుబారులో
ఆఫీసుకి, సంతలకి దగ్గరగా, సదుపాయాలన్ని అందుబాటులో ఉన్న (ఇదివరకటి ఇంటికన్నాకాస్త పెద్దదైన) ఇల్లు దొరకడం వల్ల నాకు ఓ పేధ్ధ పని పూర్తయ్యి గుండెలమీంచి బరువుదిగినట్టు అనిపిస్తోంది.
Saturday, December 08, 2007
అమెరికా, ఉంటా మరిక.. - 3
సింగపురికి ఏ ఒడుదొడుకులూ లేకుండానే వచ్చి చేరాము..కొత్త (ప్ర)దేశం, కొత్త ఉద్యోగం.
చ. కుదురుగ కొత్తచోట పని కూర్చుని పొందికగా తలొంచి చే
సెదనని నే తలంచితిని సింగపురంబుకు వచ్చిచేరతూ
ఇదివరకున్న రాజసమదిక్కడ చేయుట సాధ్యమవ్వజా
లదని గ్రహించి తేరుకొన వ్రాయుట బ్లాగిక కష్టమవ్వదా?
వ్రాయడానికి మున్ముందు ఎంత సమయం దొరుకుతుందో సమయమే చెపుతుంది. ఐతే, సింగపూరు ఏర్పోర్టులో దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వచ్చేసరికి మాదగ్గర నా వీసా ఉందికానీ (ఇతరసగానికి కావలసిన పత్రాలు కంపెనీ వారు పంపకపోవడంవల్ల, నేనొకసారి అడిగినా అవసరమని చెప్పకపోవడంవల్ల) ఇతరసగానికి వీసా లేదు. అమెరికావారైతే అలాంటప్పుడు నవ్వుతూ గౌరవపూర్వకంగా 'సర్, మాడమ్' అంటు తిరుగు ప్రాయాణం పట్టిస్తారు, ఢోకా లేకుండా.
శా. సందేహంబొకటొచ్చె నాకు దిగగా ఛాంగీ ఎయిర్పోర్టులో
సందోహంబుగ వచ్చిపోవు జనులేసందర్భ ప్రాబల్యకం
బందైనా తమ వెంటలేవనినచో పాస్పోర్టు వీసాలు గో
విందాకొట్టు కదా ప్రయాణమునకై వెచ్చించు పైకంబటన్
కానీ సింగపూరు వాళ్ళు అలా కాదు, నేను అప్ప్లికేషను పంపించాను ఒకసారి సిస్టంలో చూడండి అని అడగగానే, కాసేపు ఆగమని, చూసి కనపడకపోయినా నాలుగు రోజులకని స్పెషల్ వీసా ఇచ్చారు. బ్రతుకు జీవుడా అనుకుని (రూలంటే గుడ్డిగా ఆచరించే అమెరికన్ ఏర్పోర్టులకి ఇమిగ్రేషన్ కీ దూరంగా వచ్చినందుకు ఆనందిస్తూ) బయట పడ్డాము.
Monday, December 03, 2007
ఆంగ్ల వృత్తం, Visa headache
శా. When I went to the Consulate for my Visa, the line there sna
kin-nice-and-soporific in a low key way to people-sittin
g-on-nice-and-heavily-cooled cushion, ignoring us all blithely in
Chennai's heat very humid weather, OH! simply belittled me!
గణాలు సరిగా పడాలంటే ఈ విధంగా చదువుకోమని మనవి.
శా. వెన్నైవెంటు ద కాన్సులేటు ఫరు మై వీసా, ద లైన్దేరు స్నే
కిన్నైసెండు సొపోరిఫిక్కు ఇనె లోకీ వే టు పీపుల్సిట్టిం
గొన్నైసెండు హెవీలి కూల్డు కుషనిగ్నోరింగసాల్ బ్లైత్లి ఇ
న్చెన్నైస్హీటు వెరీ హ్యుమిడ్డు వెదరోహ్! సింప్లీ బిలిట్టిల్డు మీ.
కనుక్కోండి చూద్దాం
When I went to the Consulate for my Visa, the line there snakin-nice-and-soporific but low key way to people sitting-on-nice-and-heavily-cooled den, ignoring us-there in Chennai's-heat very humid weather-OH! simply belittled me!
Saturday, December 01, 2007
అమెరికా, ఉంటా మరిక.. - 2
త. అగుదుమే మరి ఒంటివారము, అన్ని బాటలు కొత్తవై
మిగిలియున్నది ఒక్కవారము, వీడుకోలు సశేషమై
మిగుల ప్రీతుల మిత్రులందరి వీడిపోవుట భారమై
దిగులు చెందుట తథ్యమే. పయనించబూనితిమాశతో...
మ.కో. సింగపూరుకు ఐనవారికి చేరువై నివసించ కో
రంగనిర్వురి తల్లిదండ్రులు "రమ్ము దగ్గరనుండగా
బెంగలుండవు బాధలుండవు మీరు వచ్చిన పండగే
రంగుహంగు యుఎస్సునున్నపళంగ కాదని వస్తిరా"
అనడంవల్ల అమెరికాని వీడి సింగపూరుకి ప్రయాణం కడుతున్నాము, వచ్చే వారమే విమానయానం. ఇల్లప్పుడే అమ్మకాలు, షిప్పింగుల కితకితలకి బోసి నవ్వు నవ్వుతోంది.