Saturday, April 26, 2008

మనమా..

రానారె కడప కేంద్రం నుంచి వెలువరించిన మరో సమస్యకి నా పూరణలివిగో.

మొదటిది

మ. మన కో ఒద్దికనేది లేదనికదా, మర్యాదగా చాలుచా
లని దూరమ్ముగ నుండిపోతిమిటు, దూరాలింత ఏకాంత చిం
తను ప్రేమాతిశయమ్ము చేయ, వినదే నా గుండె నామాటనే,
“మనమా వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా”

రెండవది


మ. సినిమా పాటలదో అథోగతి సుమా, ఛీకొట్టి చెండాడనా?
“గుణమేలేని ఇలాంటి రొంపిన పడినా, గోలెందుకోయంచు యే
మనమా?” వొద్దిక నాదు మాట వినుమా మర్యాద కాపాడుమా
యననా, భాషను చంపుతున్న కవులూ, ఆగండి, యన్జెప్పనా?

5 comments:

Anonymous said...

గిరి గారు, రానారే గారి బ్లాగ్ నుంచి మీ బ్లాగ్ కి వచ్చే సరికి, సినిమా వెళ్లిపోయి, భగణం మొదలయ్యింది :)
ఆ పద్యం చివరి పాదం లో ఓ ఆక్షరం ఎక్కువపడింది చూడండి

గిరి Giri said...

ఊదం, సినిమా ఎందుకో ఎగిరిపోయింది, ఇప్పుడు జోడించాను, చివరి పాదంలో 'రా' తొలగించాను కూడాను.

రానారె said...

గిరిగారూ,
మీరు పద్యం రాసే వేగం చూస్తే మిమ్మల్ని ఆశుకవి అనవచ్చు. వేగం కొద్దిగా తగ్గించి రాస్తే, మీరనుకున్న భావాన్ని ఇంకా మంచి పదాల్లో చెప్పగలరు అనిపించింది ఈ పద్యాలు చదవగానే. గతవారం సమస్య(...కీర్తి మిన్నందురా)కు మీ పూరణ బ్రహ్మాండంగా వుంది.

అన్నట్టు, ఇదే సమస్య(...మర్యాద కాపాడుమా)కు భైరవభట్లగారి పూరణ చూశారా?

గిరి Giri said...

రామనాథా,
వేగం విషయం పక్కన పెడితే, కేవలం సమస్యని పూరించడం కోసమే వ్రాస్తే వచ్చే పద్యాలెలా ఉంటాయో నా ఈ పద్యాలు చూస్తే తెలుస్తుంది - మీరన్నట్టు సమస్యని పూరించేదాకా నాకు నిద్ర పట్టదు, దాని వల్ల అప్పుడప్పుడు ఇలాంటి పద్యాలు తయారవుతాయి :)
మున్ముందు నా ప్రయత్నాల మీద కూడ మీరు కుండ బద్దలు కొట్టినట్టు వ్యాఖ్యలు పంపుతారని ఆశిస్తున్నాను.
గిరి

రానారె said...

కుండలైతే బద్దలు కొడదామనే అనుకుంటున్నాను, కానీ ఈమధ్య ఇక్కడన్నీ సీసాలే కనబడుతున్నాయే! అవీ మాంఛి నాణ్యమైన గట్టి సీసాలు. :)