Monday, October 08, 2007

The Sting

1973లో విడుదలై ఉత్తమ చిత్రంగానే కాకుండా దర్శకత్వానికి, నేపధ్య సంగీతానికి మరి ఇంకా నాలుగు విభాగాలలో ఆస్కర్ తెచ్చుకున్న చిత్రం The Sting. ఇప్పటిదాకా విడుదలైన కనుగప్పు చిత్రాలలో (con movies) ఇది అత్యుత్తమమైనదంటే అతిశయోక్తి కాదు. అప్పటికే మోసగాళ్ళ కధలుగా చాలా మందికి తెలిసిన చిన్నచిన్న కథలను ఇముడ్చుకుని వాటి సహాయంతో ఇంకో పెద్ద కనుగప్పు కథను చూపుతుందీ చిత్రం.

King Con, Con-Ed పుస్తకాలు ఇలాంటి మోసాలనే ఆసక్తికరంగా చెప్పినా, ఈ చిత్రకథకి సరిరావు. కింగ్ కాన్ పుస్తకం ఐతే మొదటి పేజీలొనే ఒకింత ఆర్భాటంగా ‘compared to this, The Sting feels like a mosquito bite’ అని అంటుంది. పుస్తకాన్ని తప్పక చదవాలని ఉత్సాహం కలిగించే వాక్యమది.చదివిన తరువాత అది ఆర్భాటప్రేలాపనే అనిపిస్తుంది లెండి, అది వేరే విషయం.

ఏదైనా వంటకం చక్కగా కుదరాలంటే అన్ని పధార్ధాలు తగుపాళ్ళలో ఎలా పడాలో, అలాగే ఓ మంచి కనుగప్పు కథ తయారవ్వాలంటే, దానికి కావలసిన ముడి పదార్ధాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.

తెలివైన మోసగాడు: సాధారణంగా ఇట్టి కథలలో మోసగాడు వాడి ముఠా, వీళ్ళే హీరోలు. వీళ్ళు ఎంత టక్కరులైతే అంత మంచిది. స్టింగ్ లో పాల్ న్యూమాన్ ఎన్నెన్నో మోసాలు చేసి, కాస్త విశ్రాంతి తీసుకుంటున్న నేర్పరి. అతని దగ్గరకు వచ్చి చేరతాడు రాబర్ట్ రెడ్ఫోర్డ్. వీరిద్దరూ, కొంతమంది స్నేహితులతో నడిపే మోసమే ఈ కథ. అంతక్రితం ‘బుచ్ కాసిడి అండ్ ది సన్డాన్స్ కిడ్’ లో నటించిన న్యూమాన్, రెడ్ఫోర్డ్ జంట ఇందులో మళ్ళి అదరగొట్టేస్తారు.

మార్క్: అంటే మోసగింపబడే వాడు. వీడే కథకి విలన్. మన హింది చిత్రం ‘బంటి ఔర్ బబ్లీ’ లో తాజ్ మహల్ కొనేసే వెర్రి వాడి తరహాలో వీడూ ఉంటే కథ రక్తి కట్టడు. హీరోలకి ధీటుగా తెలివి గల వాడై ఉంటేనే బావుంటుంది. స్టింగ్ లో లోనెగన్ (నటుడు రాబర్ట్ షా) మార్క్ అన్నమాట. తన దగ్గర నుంచి దొంగతనం చేసిన వాళ్ళని, అది ఎంత చిన్న దొంగతనమైనా సరే, వారిని ప్రాణాలతో వదిలిపెట్టని కౄరుడు. పైగా మోసాలు చేసి పైకి వచ్చిన వాడు, చాలా తెలివైన వాడును.

సెటప్: చేపని గాలాం వేసిన తీరులో మార్క్ ని టెంప్ట్ చేయగలిగిన సెటప్ ఉండాలి. మార్క్ కూడా ఒక మోసగాడే ఐతే ఇది మరి కొంచెం కష్టమవుతుంది. మోసం ఎంత కష్టమైనదైతే చుసేవాళ్ళకి అంతకంత సంతృప్తి ఉంటుంది.

స్టింగ్: ఇది అసలు మోసం. మోసం చేస్తున్నపుడే కాక అయిపోయిన తర్వాత కూడా మార్క్ కి అనుమానం రాకుండా ఉండాలి, మామూలు మోసాలకి దీనికి ఇదే తేడా. పరుపులో నల్లిలా కుట్టి మాయమవ్వాలి.

పై చెప్పిన విషయాలన్నీ ఈ చిత్రంలో చక్కగా కుదిరాయి. చివరి పది నిమిషాలలో మాత్రం కథ ప్రేక్షకులు ఊహించని మలుపు తిరుగుతుంది. నేను మొదటి సారి చూసినప్పుడైతే బుర్ర తిరిగిపోయింది.

చిట్ట చివరి మలుపే కాకుండా ఇందులో ఎన్నో చక్కటి సన్నివేశాలున్నాయి, మచ్చుకకి ఇదొకటి. కాకపోతే, చకచకా సాగిపోయే grifter-speak (కనుగప్పు వాడుక భాష) అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి, కనీసం మొదటి సారి చూసేటప్పుడు సబ్-టైటిల్స్ ఉన్న డి.వి.డి ఉంటే బావుంతుంది. కథ పూర్తిగా అర్ధం చేసుకోవడం సులభం అవుతుంది.

1 comment:

కొత్త పాళీ said...

నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి. ఒక్కసారే చూశాను .. అందుకని బాగా గుర్తులేదు కానీ, సినిమా చూసి చాలా తృప్తిగా ఫీలైనట్టు గుర్తుంది.