Wednesday, May 09, 2007

PJ

ఇరాక్ లో షియా వారికి మింగుడు పడని తీపి పదార్థం ఏది?


'సున్ని' ఉండ.

Sunday, May 06, 2007

స్పైడర్ మాన్ - 3

నిన్న స్పైడర్ మాన్ - 3 చూసాను. చాలా బావుంటుందని అనుకుంటూ వెళ్ళి నిరాశతో తిరిగొచ్చా. గుడ్డిలో మెల్ల లాంటి విషయమేమిటంటే ఉదయపు ఆట కాబట్టి ఏ.ఎం.సీ థియేటర్లో టికెట్టు ధర ఐదు డాలర్లే :)
వివరాలు ఇక్కడ

Wednesday, April 11, 2007

The Invention of Hugo Cabret

ఎన్నిసార్లని మన డైరక్టర్లు అనలేదు, మనం వినలేదు "మా సినిమలో పాటలు కధని ముందుకి నడుపుతాయని "..."కధ పాతదే ఐనా ట్రీట్మెంట్ డిఫరెంట్" అని వాళ్ళు చెప్పే పాత చింతకాయ లాంటి పచ్చడే అదీనూ.

ఒక రోజు ఇంటికి వస్తూండగా "ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూగో కబ్రే" రచయిత బ్రయాన్ సెల్జ్ నిక్, తన పుస్తకం గురించి చెబుతూ "ఇందులో బొమ్మలు కధని ముందుకు తీసుకు వెళతాయి, కేవలం నేను బొమ్మలు గీయగలను కాబట్టి గీసినవి కావు" అని (అర్ధం వచ్చేలా) రేడియోలో చెబితే నాకు మన తెలుగు సినీ డైరక్టర్లే గుర్తుకొచ్చారు కాని ఈ పుస్తకమేంటో చూద్దమన్న కుతూహలమూ కలిగింది - మన సినీ మూస డైరక్టర్లని గుర్తుకు తెచ్చేదని సరిగ్గా పరికించక కొట్టి పారేయడం మంచిది కాదు కదా? అందుకే ఆ రోజు సాయంత్రమే దగ్గరున్న గ్రంధాలయంలో ఈ పుస్తకం కావాలని ఓ అర్జీ పడేసా. ఓ వారం పోయాక అందింది నా చేతికి పుస్తక రాజం - పక్కలన్ని నల్లగా, ఐదొందలాకులంత లావుగా, అబ్బా ఇప్పుడింత పెద్ద పుస్తకమెవడు చదువగలడురా బాబూ అనిపించేలా కనిపించింది. కాని ఒక్కసారి తెరిచి చదవడం మొదలు పెట్టానా, పక్కన పెట్ట బుద్ది కాలేదు. అంతటి లావు ఉన్నా, అనేకమైన పెన్సిల్ స్కెచస్ వల్ల చదవడం చక చక అయిపోయింది.

తండ్రిని కోల్పోయి, తప్పని పరిస్తితులలో బడి వదిలేసి తాగుబోతు మామయ్యతో ఉండడానికి రైల్వే స్టేషన్ కి వచ్చిన "ఓ గడియారాలబ్బాయి" కధ ఇది. హ్యూగోకి గడియారాలే కాదు, ఎటువంటి యంత్రమైనా మరమ్మత్తు చేయడమంటే మహ సరదా. తండ్రి దగ్గరనుంచి నేర్చుకున్న ఆ విద్యలో నైపుణ్యత సంపాదించి విరిగిన ఒక రోబోట్ ని తిరిగి పనిచేసేలా చేయడానికి వాడు పడ్డ కష్టాలు, ఆ ప్రయత్నాల వల్ల వాడి జీవితంలో కలిగిన అనూహ్యమైన మార్పులు - అదండి కధ.చిన్న పిల్లల కధే ఐనా, ఎంతో ఆసక్తికరంగా బొమ్మలతో (మధ్యలో వందేళ్ళ క్రితం నాటి ఫ్రెంచ్ సినిమాలతో) ముందుకు నడిచేస్తుంది. కామిక్ లు, మంచి కధలూ ఇష్ఠం ఉన్నవారు తప్పక చదవాల్సింది ఈ పుస్తకం.

Saturday, April 07, 2007

Marcus Bartley

విజయ సంస్థవారి పేరుపొందిన (నేను చూసిన) చిత్రాలన్నిటిలోనూ తప్పక కనబడే పేరు మార్కస్ బార్ట్లీదే (పాతాళభైరవి, మిస్సమ్మ, మాయబజార్, గుండమ్మ కధ ఇత్యాది). తీరా అయన గురించి తెలుసుకుందామనుకుంటే, ఐఎండీబీలో ఈ పొడి ప్రస్తావన, ఇంకా వెతకగా హిందూలో ఈ చిత్రం దొరికాయి. అంతే! ఆయన గొప్పతనాన్ని పొగుడే రెండు మూడు వ్యాసాలూ కనిపించాయి కాని ఎక్కువ వివరాలు అక్కడా లేవు. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న పై చిత్రంలో అయన్ని చూస్తే ఆంగ్లేయుడిలా అనిపించడం లేదు. ఇంతకీ ఆయన కధ ఎమిటి?

Wednesday, April 04, 2007

చంద్రబోస్ పాటలు

నా ఆటోగ్రాఫ్ సినిమాలో పాటలు వినిడానికి బావుంటాయి, సాహిత్యం కూడా బావుంటుంది. మొదట్లో ఈ పాటలు విన్నప్పుడు వీటిని సీతారామశాస్త్రి రాసారేమోనని అనుకున్నా. తర్వాత తెలిసింది రచయిత చంద్రబోస్ అని. ఎప్పుడో ఒకసారి పెళ్ళిసందడి (అనుకుంటా) పాటలను ఎవరో సమీక్షిస్తూ కొన్ని చరణాలల్లో చంద్రబోస్ చేసిన తప్పులు గురించి ప్రస్తావించారు. అది చదివి అతనంత మంచి కవి కాదేమోనని అనుకున్న. ఆ తర్వాత అతను రాసిన మంచి పాటలు వినకపోవడంవల్లో, విన్నా అవి రాసినవి అతనని తెలియకపోవడంవల్లో ఆ అభిప్రాయం పెద్దగా మారలేదు - నా ఆటోగ్రాఫ్ పాటలు వినేదాకా!

ఇప్పుడు అతను సీతారామశాస్త్రిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తోంది. (ముఖ్యంగా "మౌనంగానే ఎదగమని" పాట. ఏది ఏమైనా, ఆ విధంగానైనా మంచి పాటలు రాస్తే మంచిదేననుకోండి.)

కాని నా అనుమానమేమిటంటే, ఇంతకీ అతను మంచి రచయితా, లేక ఈ సినిమా పాటలు పెనంలో మెరుపులా?

Monday, March 26, 2007

NTR అందం

ఐదారేళ్ళ క్రితమనుకుంటా ఎంటీవీ లో సైరస్ వేసిన ఎన్ టీ ఆర్ వేషం చూసి నేను, స్నేహితులు పగలబడి నవ్వుకున్నాము. యమగోల లోదేమో ఒక సన్నివేశాన్ని బెల్ బాటం పాంటు, పైబొత్తాలు పెట్టని చొక్కా, విగ్గేకాని ఇంకేదీ కాదని కనిపించే జుత్తు - నుదుటిన పడి మెలిక తిరిగిన రెండు వెంట్రుకలూ, వీటితో పాటు కనుబొమలు ఎగరేస్తూ "అమ్మా అమ్మా" అంటూ పరుగెట్టి వస్తున్న సైరస్ ని చూసి మనవాళ్ళూ అస్సలు ఎన్ టీ ఆర్ లో ఏమి చూసి అంత ఆకాశానికెత్తేసారని అనుమానము కలిగింది. పౌరాణికాలలో శ్రీకృష్ణుడి పాత్రల వలనేమో అని సరిపెట్టుకున్నా.

అంటే పాత సినిమాలు దూరదర్శన్ "తప్పదు రా భగవంతుడా; నాన్నకి ఇవి ఎలా నచ్చుతాయిరా బాబు" అనుకుంటూ చూడడం వల్లో, లేక పేర్లలో "స్టంట్స్" లేని సినిమాలేవీ సరిగ్గా చూడకపోవడం వల్లో - మిస్సమ్మ లాంటి గొప్ప సినిమాలు పెద్దగా గుర్తు లేవు మరి.
==
మళ్ళీ మిస్సమ్మ చూసి రెండు వారాలయ్యింది.
"కావాలంటే ఇస్తాలే, నావన్ని ఇక నీవేలే" పాటలో ఎన్ టీ ఆర్ ని చూసి అర్ధమయ్యింది - మామ్మలు, బామ్మలు, పెద్దత్తలు, పెద్దమ్మలు ఆయనది "చంద్రబింబం" లాంటి ముఖమని ఎందుకంటారో. మరంతటి అందగాడు డెబ్భై,ఎనభై దశకాలలో అంతటి మోటు వేషాలు ఎందుకు వేసాడో అని బాధ కూడా కలిగింది.
==
నాలాగే మీరూ ఐదారేళ్ళ క్రితం ఎంటీవీ చూసి నవ్వి ఉంటే - "మిస్సమ్మ" తప్పకుండా చూడండి. మీ opinions కొద్దిగా మారవచ్చు.

Saturday, March 24, 2007

ఎవరిది కపట నాటకం?

భూకైలాస్ లో సంగీత సాహిత్య పరంగా అన్నీ గొప్ప పాటలే; సముద్రాల రాఘవాచార్య రాసిన పాటలు ఎంతో బావుంటాయి. అందులోనూ "రాముని అవతారం" పాటంటే నాకు చాలా ఇష్టం..ముఖ్యంగా ఆయన
"అదిగో చూడుము బంగరు జింకా,
మన్నైచనునయ్యో లంకా,
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింకా"
చరణంలో ప్రాసని చాలా బాగా కుదిర్చారనిపిస్తుంది.

కొన్ని రోజులనుంచి నన్ను తిప్పలు పెడుతున్న చరణం కూడా ఈ పాటలోనే ఉంది.
"కపట నాటకుని పట్టాభిషేకం,
కలుగును తాత్కాలిక శొకం,
భీకర కానన వాసారంభం,
లోకోద్ధరణకు ప్రారంభం"
అని శ్రీరాముని వనవాసప్రారంభం గురించి చరణం అది.
ఇంతకీ ఇక్కడ కపట నాటకమెవరిది? కైకేయిదా అనుకుంటే మరి పట్టాభిషేకం తనది కాదు; భరతునిదా అనుకుంటే మరి భరతుడికి కపటం లేదే. "కపట నాటకంతో కైకేయి కుదిర్చిన పట్టాభిషేకమని" అర్ధమని సరిపేట్టుకోవాలా?

Tuesday, March 06, 2007

మీకు తెలుసా?

1. మాయా బజార్ చిత్రానికి మొదట రాజేశ్వర రావు గారు సంగీత దర్శకులుగా పని చేసారు అని? ఆయన నాలుగు పాటలు కూడ స్వరపరిచారు ("చూపులు కలిసిన శుభవేళా", "నీకోసమె నే జీవించునది", "నీవేనా నను పిలచినది", "లాహిరి లాహిరి లాహిరిలో"), తర్వాత ఏదో గొడవల వల్ల మిగతా సంగీతం కూర్చడం ఘంటసాల గారి బాధ్యత అయ్యింది.
2. పాతాళ భైరవి సినిమాలో సావిత్రి నటించిందని? భలే రాముడు ఉజ్జయిని రాజపరివారానికి తన మాయామహలు వింతలు చూపిస్తున్నప్పుడు వచ్చే ఒక పాటలో ("ఇక రానంటే రానే రాను") ఓ రెండు నిమిషాల సేపు కనబడుతుంది సన్నటి సావిత్రి. ముఖాన్ని పట్టించి చూస్తే గాని గుర్తు పట్టడం కష్ఠం కాని నాట్యంచేసే తీరు బట్టి గుర్తుపట్టేయవచ్చు.

Monday, March 05, 2007

చెలువమంటే?

ఈ మధ్య పాత పాటలు వినడం పెరిగింది. దానితోపాటే ఆకాలం నాటి గొప్ప సంగీత దర్శకులు, పాటలు/పద్యాల రచయితలపై కూడా మక్కువ పెరిగింది. పింగళి, పెండ్యాల, సముద్రాల (రాఘవాచార్య), ఆత్రేయ, ఆరుద్ర, మహదేవన్, దేవులపల్లి, కోదండపాణి, రాజేశ్వర రావు వంటి వారి గురించి కుతూహలము పెరిగింది.
ఘంటసాల గారి గురించి వెతుకుతూ ఈ గొప్ప సైట్ ని కనుగున్నాను. ఎన్నో గొప్ప పాటలు, పద్యాలు ఉన్నాయక్కడ - అదే కాక కొన్ని పాటలకి ముందు ఘంటసాల గారితో పనిచేసిన వారి మాటలు ఉన్నాయి. వీలు దొరికితే మీరూ విసిటేయండి.
అడగదలచిన విషయమేమంటే, "చూపులు కలిసిన శుభవేళా.." పాటలో పింగళి గారు "చెలువములన్ని చిత్రరచనలే, చలనములోహో నాట్యములే" అని రాయగా, ఘంటసాల గొప్పగా పాడగా, నాగేశ్వర రావు గారు తెర మీద ఎంతో గొప్పగా పెదవులు క(ది)లిపారు కదా? అదిమనమందరమూ ఎప్పుడో ఒకప్పుడు వినడమో, చూడడమో జరిగిందే కదా?
పై రెండు ప్రశ్నలకీ మీరు ఒప్పుకుంటూ తలూపిఉంటే, మరి చెలువము అంటే ఏంటో చెప్పగలరా? నాకైతే (సందర్భాన్నిబట్టి) 'భంగిమ ' అని అనిపిస్తోంది. మీరేమంటారు?

Friday, February 09, 2007

రెండవ అధ్యాయం

PMP పరీక్ష గట్టెక్కడానికి నా పద్ధతులు ఏమిటో ఇక్కడ రాసాను. మీకేమైనా సందేహాలుంటే అడగండి, సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.