Saturday, June 09, 2007

అరవ రవం

నాకు ఏ.ఆర్.రెహమాన్ తమిళ పాటలు తమిళంలో వినడం అలవాటు. పది+ ఏళ్ళ క్రితం బాంబే సినిమా పాటలు విడుదలైన సమయంలో స్నేహితులతో కలిసి తిరుచ్చి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే బాషా, బాంబే పాటలు తమిళంలో విని అరవపు చెవులు పెంచి కొరుక్కున్నాను. మొదట్లో వినడానికి వింతగా అనిపించినా తర్వాత అలవాటైపోయాయి - ఓ కొత్త అలవాటూ మొదలయ్యింది. మా వాళ్ళకి నా పిచ్చి ఏమిటో అప్పట్లో అర్ధం కాలేదు కానీ చివరి నవ్వు నాదే అయ్యింది. ఎలా అంటారా, మొదటిది తెలుగులో విడుదల కాని ఇళయరాజా ఆణిముత్యాలెన్నో నాకు పరిచయమయ్యాయి. రెండు, చెత్త lyrics నుంచి కొంత విముక్తి లభించింది - ఏలనగా, రెహమాన్ పాటలలో సాహిత్యపు విలువలు కొద్దిగా తక్కువే అని చెప్పచ్చు - అందునా మాంఛి సంఘట్టన పూరిత (percussion filled) పాటలైతే ఇక సరే సరి, వినడానికి సొంపు ఆస్వాదించడానికి కంపు తరహాలో ఉంటాయవి. 'faxల వంద పెణ్ కవితై ఎనకే ఎనకా" లాంటి తునకల తెలుగు అనువాదం కన్నా అరవపు రవమే మిన్న అని నా అభిప్రాయం. అట్టి పాటల సాహిత్యాన్ని తూలనాడుతూ, విన లేకా, విడువా లేకా కష్ట పడే మా వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది. తమిళంలో వినడం మూలాన, నాకు ఆ బాధ తప్పింది. ఓ స్నేహితుడు 'శివాజి' తెలుగు పాటలు ఉన్నాయి, కావాలా అని అడిగినప్పుడు - వద్దు బాబు, తమిళంలో ఆల్రెడీ అలవాటైపోయాయి అని చెప్పిన సంధర్భంలో ఈ ఆలోచనా పరిధిలో పడ్డాను;

ఇది రాసాను.

5 comments:

Unknown said...

హహ... మీ విధానం బాగుంది.

అన్నట్టు మీ బ్లాగు కలర్లు చదవడానికి అంత ఇంపుగా లేవు, కొన్ని లింకులయితే కనిపించడమే లేదు. సరి చేస్తే బావుంటుంది.

గిరి Giri said...

ప్రవీణ్,
జ్వాలాజంబూకంలో నా సైట్ కొంచం తేడాగా కనిపిస్తుంది. అది నేనూ గమనించా కానీ ఎలా సరి చేయాలో తెలియక వదిలేసాను.లేఅవుట్ మారిస్తే సరిపోతుందేమో కానీ దాని కోసం ముందు బద్దకాన్ని కాలదన్నాలి. త్వరలోనే చేస్తాను.
గిరి

రాధిక said...

మా దగ్గర తమిళ్ వాళ్ళు చాలా ఎక్కువ.వాళ్ళ పుణ్యమా అని నాకూ ఈ మధ్య తమిళ పాటలు బాగా అలవాటయ్యాయి.

రానారె said...

మీబాధ నేనూ అనుభవించి, మెల్లగా తమిళానికి జారుకున్నాను. శివాజీ పాటలు ఇంకా తెలుగులో వినలేదు. అన్నట్టు నిన్న రాత్రి ఇక్కడ రెహమాన్ తన బృదంతో ఇచ్చిన బ్రహ్మాండమైన పాటల కార్యక్రమానికి హాజరై నా జన్మ ధన్యం చేసుకున్నాను.

గిరి Giri said...

ప్రవీణ్, టెంప్లేట్ మార్చాను.ఇంకా ఏమైనా లింకులు సరిగ్గా కనపడకపోతే చెప్పండి.
రాధిక గారు, పాత ఇళయరాజా పాటలు దొరికితే వినండి. చాలా బావుంటాయి.
రానారె, రెహమాన్ కార్యక్రమం గురించి చదివాను - కానీ దూరం వల్ల వెళ్ళ్డడం కుదరలేదు. వివరాలు మీ బ్లాగ్లో రాయండి.