Saturday, December 08, 2007

అమెరికా, ఉంటా మరిక.. - 3

సింగపురికి ఏ ఒడుదొడుకులూ లేకుండానే వచ్చి చేరాము..కొత్త (ప్ర)దేశం, కొత్త ఉద్యోగం.

చ. కుదురుగ కొత్తచోట పని కూర్చుని పొందికగా తలొంచి చే
సెదనని నే తలంచితిని సింగపురంబుకు వచ్చిచేరతూ
ఇదివరకున్న రాజసమదిక్కడ చేయుట సాధ్యమవ్వజా
లదని గ్రహించి తేరుకొన వ్రాయుట బ్లాగిక కష్టమవ్వదా?

వ్రాయడానికి మున్ముందు ఎంత సమయం దొరుకుతుందో సమయమే చెపుతుంది. ఐతే, సింగపూరు ఏర్పోర్టులో దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వచ్చేసరికి మాదగ్గర నా వీసా ఉందికానీ (ఇతరసగానికి కావలసిన పత్రాలు కంపెనీ వారు పంపకపోవడంవల్ల, నేనొకసారి అడిగినా అవసరమని చెప్పకపోవడంవల్ల) ఇతరసగానికి వీసా లేదు. అమెరికావారైతే అలాంటప్పుడు నవ్వుతూ గౌరవపూర్వకంగా 'సర్, మాడమ్' అంటు తిరుగు ప్రాయాణం పట్టిస్తారు, ఢోకా లేకుండా.

శా. సందేహంబొకటొచ్చె నాకు దిగగా ఛాంగీ ఎయిర్పోర్టులో
సందోహంబుగ వచ్చిపోవు జనులేసందర్భ ప్రాబల్యకం
బందైనా తమ వెంటలేవనినచో పాస్పోర్టు వీసాలు గో
విందాకొట్టు కదా ప్రయాణమునకై వెచ్చించు పైకంబటన్

కానీ సింగపూరు వాళ్ళు అలా కాదు, నేను అప్ప్లికేషను పంపించాను ఒకసారి సిస్టంలో చూడండి అని అడగగానే, కాసేపు ఆగమని, చూసి కనపడకపోయినా నాలుగు రోజులకని స్పెషల్ వీసా ఇచ్చారు. బ్రతుకు జీవుడా అనుకుని (రూలంటే గుడ్డిగా ఆచరించే అమెరికన్ ఏర్పోర్టులకి ఇమిగ్రేషన్ కీ దూరంగా వచ్చినందుకు ఆనందిస్తూ) బయట పడ్డాము.

6 comments:

అనిర్విన్ said...

స్వాగతం, ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు ఫ్రెండ్లీ గా ఉంటారు. ఆదివారం నాడు లిటిల్ ఇండియా వైపు వెళ్ళకండి. మీరు ఇక్కడ కంఫర్టబుల్ గా వున్నారని భావిస్తూ ...

చదువరి said...

"చాలా వుంది" గారూ!
"ఆ ఉత్తరపు గదిలోకి మాత్రం వెళ్ళొద్దు" లాగా చెప్పారు.:) గిరి గారు ఏదో ఒక ఆదివారం ఖచ్చితంగా అటేపు వెళ్ళొస్తారనుకుంటా!

అనిర్విన్ said...

హహహ వెళ్ళి రానివ్వండి. అనుభవాలు చెపుతారు మనకి. మరేం లేదండి. చాలా రద్దీగా ఉంటుంది. అంతే.

బ్లాగేశ్వరుడు said...

@గిరి గారు క్షేమముగా సింగపూర్ చేరుకొన్నందుకు సంతోషము. తమ పద్య ప్రభంజనము మాత్రము ఆపవలదు.
@చదువరి ఉత్తరపు గది అర్ధము కాలేదు కొద్దిగా వివరణ ఇస్తారా???

గిరి Giri said...

లక్ష్మణ్ గారు, సింగపూరుకి త్వరగానే అలవాటు పడతామని నమ్మకముంది నాకు..ఇద్దరు స్నేహితులు కూడా మీలాగే లిటిల్ ఇండియా గురించి హెచ్చరించారు, చిన్న పిల్లని స్ట్రోలర్లో తీసుకుని శని-ఆదివారాలు అటుపక్కకి (అంతటి రద్దీలో)వెళ్ళడం శ్రేయస్కరం కాదని..thanks!

చదువరి గారు, కూడా చంటి పిల్ల లేకపోయుంటే కనక మీరన్నట్టు కుతూహలపు పిల్లినయ్యే వాడినేమో.

బ్లాగేశ్వరా, ఇక కారు ప్రయాణం ఉండదు, రైలే గతి. నాకు ఎలాగూ చెవిలో పింజాల్లాంటివి పెట్టుకుని పాటలు వినే మోజులేదు కాబట్టి ఆఫీసుకి వెళ్ళి వచ్చేటప్పుడు పద్యాలు రాసుకుందామని ఆశ..చూడాలి ఎంతవరకూ సాధ్యమవుతుందో.

Naga said...

చిన్నిండియాలో అంతగా ప్రమాదం ఏమిటో అర్థం కావడం లేదు... వీలైనంత వరకు సింగపూరు ఫోటోలను ప్రచురించగలరు.