Saturday, December 29, 2007

Blame it on the audience

మ.కో. రాఘవా విను, ఛీత్కరించి పరాభవించిననూ విది
ల్చే ఘనుల్ మసలేరు మెండుగ చిత్రసీమన, మొండికే
సే ఘటాలయి, నాటు మాటలు చెత్త పాటలు గుప్పుతూ
లాఘవమ్ముగ ప్రేక్షకాదరణాభిమానములే కదా

తే.గీ. తమకు స్పూర్తినిచ్చునని కూతలను నేర్చి
తాము తీసిన చెత్త చిత్రవధలకు త
టాలున ఇతరులనిక బాధ్యులుగ నిల్పి
తప్పుకొందురు, తమ తప్పులొప్పలేక

Tuesday, December 25, 2007

Don? Don't!

ఉ. దండిగ డబ్బుచేసుకొని నవ్వుతు బాంకుకి పోవుటెంత బా
గుండు కదా? ఇలాంటి చిరుకోరికలుండని వారి జీవితాల్
దండగలవ్వవా? పొగిడి నాకుతు పెద్దల కాళ్ళనీడనే
పండగ చేసుకొన్న, భలె బాగుగ కోర్కెలు సాధ్యమవ్వవా?


====

ఉ. డాన్సులవీ అదో రకపు స్టైలు, అలాగని ఊరుకోని లా
రెన్సు
ఎడాపెడా పటిమలేని కధాంశములెంచుకొన్ననూ
ఛాన్సులెలాగొలా దొరకసాగెను ప్రేక్షకమూకలో సినీ
ఫాన్సు మెదళ్ళమోదుటకు పైత్యపు దర్శకుడై తలెత్తగా
(పాపము ప్రేక్షక ఖర్మకాలగా!)

నేను డాన్ చూడలేదు కాని స్టైల్ అనబడే చిత్రహింసకి మాత్రం గురయ్యాను.

Sunday, December 16, 2007

ఇల్లు దొరికింది

చ. బడలిక లెక్కచేయక రమారమిగా పది బాడుగిళ్ళు చూ
సెడి పని పెట్టుకుంటి, నివసించుటకో కుదురైన చోటుకై
పడిపడి రైలు, టాక్సిలను పబ్లికు బస్సుల వాడుకొంచు నే
చెడతిరిగాక చిక్కెనొక సింగిలు యూనిటు త్యాంగుబారులో

ఆఫీసుకి, సంతలకి దగ్గరగా, సదుపాయాలన్ని అందుబాటులో ఉన్న (ఇదివరకటి ఇంటికన్నాకాస్త పెద్దదైన) ఇల్లు దొరకడం వల్ల నాకు ఓ పేధ్ధ పని పూర్తయ్యి గుండెలమీంచి బరువుదిగినట్టు అనిపిస్తోంది.

Saturday, December 08, 2007

అమెరికా, ఉంటా మరిక.. - 3

సింగపురికి ఏ ఒడుదొడుకులూ లేకుండానే వచ్చి చేరాము..కొత్త (ప్ర)దేశం, కొత్త ఉద్యోగం.

చ. కుదురుగ కొత్తచోట పని కూర్చుని పొందికగా తలొంచి చే
సెదనని నే తలంచితిని సింగపురంబుకు వచ్చిచేరతూ
ఇదివరకున్న రాజసమదిక్కడ చేయుట సాధ్యమవ్వజా
లదని గ్రహించి తేరుకొన వ్రాయుట బ్లాగిక కష్టమవ్వదా?

వ్రాయడానికి మున్ముందు ఎంత సమయం దొరుకుతుందో సమయమే చెపుతుంది. ఐతే, సింగపూరు ఏర్పోర్టులో దిగి ఇమిగ్రేషన్ కౌంటర్ కి వచ్చేసరికి మాదగ్గర నా వీసా ఉందికానీ (ఇతరసగానికి కావలసిన పత్రాలు కంపెనీ వారు పంపకపోవడంవల్ల, నేనొకసారి అడిగినా అవసరమని చెప్పకపోవడంవల్ల) ఇతరసగానికి వీసా లేదు. అమెరికావారైతే అలాంటప్పుడు నవ్వుతూ గౌరవపూర్వకంగా 'సర్, మాడమ్' అంటు తిరుగు ప్రాయాణం పట్టిస్తారు, ఢోకా లేకుండా.

శా. సందేహంబొకటొచ్చె నాకు దిగగా ఛాంగీ ఎయిర్పోర్టులో
సందోహంబుగ వచ్చిపోవు జనులేసందర్భ ప్రాబల్యకం
బందైనా తమ వెంటలేవనినచో పాస్పోర్టు వీసాలు గో
విందాకొట్టు కదా ప్రయాణమునకై వెచ్చించు పైకంబటన్

కానీ సింగపూరు వాళ్ళు అలా కాదు, నేను అప్ప్లికేషను పంపించాను ఒకసారి సిస్టంలో చూడండి అని అడగగానే, కాసేపు ఆగమని, చూసి కనపడకపోయినా నాలుగు రోజులకని స్పెషల్ వీసా ఇచ్చారు. బ్రతుకు జీవుడా అనుకుని (రూలంటే గుడ్డిగా ఆచరించే అమెరికన్ ఏర్పోర్టులకి ఇమిగ్రేషన్ కీ దూరంగా వచ్చినందుకు ఆనందిస్తూ) బయట పడ్డాము.

Monday, December 03, 2007

ఆంగ్ల వృత్తం, Visa headache

ఆంగ్లంలో ఓ వృత్తం రాయడం కోసము నేను చేసిన ప్రయోగం ఇదిగో. కష్టపడితే పరభాషనే వరించే గణరీతులతో మన మాతృభాషని అలంకరింపజేయడం కష్టమంటారా?

శా. When I went to the Consulate for my Visa, the line there sna
kin-nice-and-soporific in a low key way to people-sittin
g-on-nice-and-heavily-cooled cushion, ignoring us all blithely in
Chennai's heat very humid weather, OH! simply belittled me!


గణాలు సరిగా పడాలంటే ఈ విధంగా చదువుకోమని మనవి.

శా. వెన్నైవెంటు ద కాన్సులేటు ఫరు మై వీసా, ద లైన్దేరు స్నే
కిన్నైసెండు సొపోరిఫిక్కు ఇనె లోకీ వే టు పీపుల్సిట్టిం
గొన్నైసెండు హెవీలి కూల్డు కుషనిగ్నోరింగసాల్ బ్లైత్లి ఇ
న్చెన్నైస్హీటు వెరీ హ్యుమిడ్డు వెదరోహ్! సింప్లీ బిలిట్టిల్డు మీ.

కనుక్కోండి చూద్దాం

ఈ క్రింది వాక్యంలో ఓ ప్రత్యేకత ఉంది, ఏంటది? కాస్త కలా-పోసన పెంచుకు చూడండి..

When I went to the Consulate for my Visa, the line there snakin-nice-and-soporific but low key way to people sitting-on-nice-and-heavily-cooled den, ignoring us-there in Chennai's-heat very humid weather-OH! simply belittled me!

Saturday, December 01, 2007

అమెరికా, ఉంటా మరిక.. - 2

ఇది వరకే చెప్పానుగా, శాము మామకు త్వరలో టాటా చెప్పాలని నిర్ణయించుకున్నామని..

త. అగుదుమే మరి ఒంటివారము, అన్ని బాటలు కొత్తవై
మిగిలియున్నది ఒక్కవారము, వీడుకోలు సశేషమై
మిగుల ప్రీతుల మిత్రులందరి వీడిపోవుట భారమై
దిగులు చెందుట తథ్యమే. పయనించబూనితిమాశతో...

మ.కో. సింగపూరుకు ఐనవారికి చేరువై నివసించ కో
రంగనిర్వురి తల్లిదండ్రులు "రమ్ము దగ్గరనుండగా
బెంగలుండవు బాధలుండవు మీరు వచ్చిన పండగే
రంగుహంగు యుఎస్సునున్నపళంగ కాదని వస్తిరా"

అనడంవల్ల అమెరికాని వీడి సింగపూరుకి ప్రయాణం కడుతున్నాము, వచ్చే వారమే విమానయానం. ఇల్లప్పుడే అమ్మకాలు, షిప్పింగుల కితకితలకి బోసి నవ్వు నవ్వుతోంది.