హరివిల్లులో శ్రీ రాసిన గత స్మృతి చదివగానే నాకు ఓ జరిగిన సంగతి గుర్తుకొచ్చింది. కాకపోతే ఇది 'టైం బాగున్నప్పటి' విషయం.
లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివే రొజులు. ఒక రోజు ఎప్పుడు మా క్లాస్ కి టైంకి వచ్చే ఇంగ్లీష్ లెక్చరర్ రావడం కొంచెం ఆలస్యమైంది.ఇంకలాంటప్పుడు ప్రతివాడు గొంతెత్తి పక్కవాడితో అరుస్తూ మాట్లాడడమే.అలాంటి రణగొణ ధ్వని లో నెమ్మదిగా మాట్లాడితే ఎలాగూ సరిగా వినిపించదని అందరమూ అరవగల (గళ) స్థాయినిబట్టి మాట్లాడడం మొదలుపెట్టాము.
కొంచెం సేపటికి ఆ అల్లరి పక్కనున్న సెక్షన్లవారికి కూడా వినిపించే స్థాయికి చేరింది. అప్పుడే అటుగా వెళ్తున్న (ఫాదర్ అనబడే) మా ప్రిన్సిపల్ మా క్లాస్ గుమ్మం ముందొచ్చి నిల్చున్నారు.
మేము నాలుగు వరసల్లో కూర్చునే వాళ్ళం, ఆయన నుంచున్నది ఒక మూల, నేను కూర్చున్నది అదే పక్క ఇంకో మూలా - అందువల్ల ఆయన రాక నేను గమనించలేదు, కాని మిగతావాళ్ళందరికీ తెలిసిపోవడం మూలాన అంతా గప్-చుప్ . చుట్టూ నిశ్శబ్దమయిపోయినా నా కేకొక్కటి కాసేపు వినపడి ఆగిపోయింది; అదృష్ఠవశాత్తు ప్రిన్సిపల్ గారికి నేను కనపడలేదు.
ఇంకాతర్వాత ఎం జరుగుతోందో నాకు తెలిసేలోగా ప్రిన్సిపల్ గారు చర చరా నా ముందుకు నడిచి రావడం, నా ముందు కూర్చున్న వాడి చెంప ఛెళ్ళుమనిపించడం జరిగిపోయాయి.నా ముందు వాడు చెంప నిమురుకుంటూ తాను దెబ్బెందుకు తిన్నాడో తెలియక తికమక పడుతుంటే అది చూసి నాకు నవ్వు, నవ్వితే నాకూ అదేగతి పడుతుందనే భయము ఆగలేదు.
టైం బావుండడమంటే అదేనేమో.
1 comment:
మీ పొస్టులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయండి
Post a Comment