వేసవి సెలవలలో మాత్రం వీటికి అనుమతి గినుమతి అవసరముండేది కాదు. అల్లరి చేయకపోతే చాలు, ఓ మూల కూర్చుని ఎన్ని కధలపుస్తకాలు తిరగేసినా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు.
సాయంత్రపు ఆట వీధి క్రికెట్ ఉండనే ఉంది, మట్టి కొట్టుకుపోతూ ఆడెయ్యడమే. కానీ పగలు, మధ్యాహ్నము ఎండల వలన ఇంట్లోనే కూర్చోవలసి వచ్చేది; ఇంకప్పుడు చందమామలు, బాలమిత్రలు తిరగవేయడమే పని. ఈ పుస్తకాలు అప్పట్లో కొనడం (అంటే 'నాన్న చేత కొనిపిండం') చాలా (చాలా అంటే చాలా) తక్కువ; పక్కినింటివాళ్ళింట్లోంచి తేవడమో, పావలాకో అర్ధరూపాయకో అద్దెకి తీసుకురావడమో జరిగేది. ఇక తెచ్చినప్పడినుంచి పూర్తిగా చదివేదాకా మనసు నిలిచేది కాదు, చదివిన తరువాత ఫ్రెండ్స్ తో భేటీ.
కధలని, ప్రత్యేకంగా "ఇంకా ఉంది" కధలని తెగ తిరగతోడడమే పని. చందమామలో కన్నా బాలమిత్రలో "ఇంకా ఉంది" " కధలు చాలా నచ్చేవి.. బి. ఆర్. వరదరాజులు గారు రాసిన 'సాగరలోయ ' వంటి కధలంటే విపరీతమైన పిచ్చి. పీష్వా, చంద్రహాసుడు, మనోహర్ వంటి పాత్రలే అప్పుడు శత్రువులు, స్నేహితులు. ఏంతంటే అలాంటి కధలో చంద్రహాసుడు చనిపోతే, నాకు ఓరోజు మనసంతా చెడి పోయింది. అన్నం సహించిందో లేదో గుర్తు లేదు కాని, విపరీతమైన బాధ మాత్రం కలిగింది. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది!
ఇంతకీ చెప్పదలచుకున్న విషయమేవిటంటె, నాకు చందమామ కన్నా బాలమిత్ర ఎక్కువగా నచ్చేది. ఎందుకో చందమామలో కొంచం 'పెద్దరికపు వ్యవహారం' కనిపించేది; బాలమిత్ర మాత్రం అలాకాకుండా ఓ స్నేహితుడిలానే ఉండేది. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది, చందమామలో వ్యావహారిక భాష కొంచం తక్కువే; బాలమిత్ర తమిళం నుంచి తర్జుమా అవడం మూలనో ఎమిటొగానీ అంతగా High brow గా ఉండేది కాదు :) బాలమిత్రలో కన్న చందమామలో Print కూడా కొంచం హుందాగా ఉండేది.
ఒకవిధంగా చెప్పాలంటే చందమామ ఒక Teacher లాగ, బాలమిత్ర ఒక Friend లాగా అనిపించేవి.
మీరేమంటారు?
(ఇంకా ఉంది..)
2 comments:
వికీపీడియాలో చందమామ గురించి చదవండి. బాలమిత్ర గురించి రాయండి. అది రాయడానికి మీరే తగినవారు.
బాలమిత్రలో గురువాయూరు మహత్యం కథ మూఢనమ్మకాలను పెంచేదిగా వుండేది. అందువల్ల నాకదంటే "చిన్నచూపు". చందమామంటే సదభిప్రాయమున్నా బాలజ్యోతి మీద "పెద్దచూపు".
Post a Comment