Saturday, August 04, 2007

నాన్సీ డ్రూ తెచ్చిన కష్టాలు

ఏడో ఎనిమిదో తరగతి. తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు తప్పి త్వరితగతిన ఇంగ్లీష్ పుస్తకాలు తినేయడం మొదలు పెట్టిన తరగతి. కొత్త పుస్తకాలు కొనే డబ్బు ఉండేది కాదు కాబట్టి, అబిడ్సు కోఠీలో దారి పక్క అమ్మబడే పాత పుస్తకాలే గతి.


ఇప్పుడంటే అమ్మాయిలకి అబ్బాయిలకి బొమ్మలతో మొదలెట్టి బట్టలదాకా, చెప్పులతో మొదలెట్టి చుట్టలదాకా (సరే, చుట్టలు కాదు సిగరెట్టులే!), పుస్తకాలతో మొదలుపెట్టి చిత్రాలదాకా, వేర్వేరు రంగులు హంగులు ఉన్నాయని తెలుసింది గానీ, అప్పట్లో అంతటి జ్ఞానమెక్కడిది? ఇంగ్లీషు పుస్తకాలు చదవడమే గొప్ప విషయం, అందిన పుస్తకాన్ని చదివేయడమే కానీ, అది ‘చిక్-లిట్టా’ కాదా అని ఆలోచించే సమయమూ పరిజ్ఞానమూ లేవుగా. అందువల్లే నాన్సీ డ్రూ పుస్తకాలు కొన్నాళ్ళు నేనూ నాతో పాటు నా తరగతిలోనే ఇంకో ఇద్దరు (వేలం) వెర్రివెంగళప్పలు వెలగబెట్టాము.


ఒక రోజు మావాడికి ఎక్కడిదో ఒక కొత్త నాన్సీ డ్రూ పుస్తకం చేచిక్కింది. వాడి నుంచి ఒక బెంచి దూరం ఉన్న నాకు అది ఎలా తెలిసిందో తెలిసింది. ఒక పక్క క్లాసు సాగుతోంది, ఇంకో పక్క ఆ పుస్తకం చూడాలని నాకు చెడ్డ తపన. సంజ్ఞలతో బతిమిలాడి, చూసి తిరిగి ఇచ్చేస్తానని, చదవననీ, వాడినే ముందు చదవనిస్తాననీ, మా వాడిని నమ్మించి అది తీసుకునే సరికి నా తల ప్రాణం తోకకీ, ఆ విషయమంతా టీచర్ దృష్ఠికీ వచ్చేసాయి. పుస్తకం నా సంచీలో పెట్టే సరికి టీచర్ నా ముందుకు వచ్చి ఏమిటది, చూపించు అంటూ వచ్చేయడం జరిగింది. ఏమీ లేదు, చిన్న పిల్లల మిస్టరీ నవల అని సర్ది చెప్పబోయా కానీ ఆయన వినిపించుకోలేదు. పుస్తకం బయటకి తీయమన్నారు.


కొత్త పుస్తకం కొంప ముంచింది. కవర్ ఎవడు వేసాడో కానీ వెధవ, నాన్సీ డ్రూ ఒళ్ళు విరుచుకుంటూ ఉన్నట్టు వేసాడు. పాత పుస్తకమైతేనే హాయి, కవర్ పేజి ఉండడమే గొప్ప, ఉన్నా ముట్టుకుంటే విరిగిపోయే తీరుగా ఉండి ఎంతమంది ఒళ్ళు విరిచినా సరిగా తెలిసేదికాదు. మరిప్పుడో? కొత్త సినిమాలో పైకిరావలన్న ఆతృత ఉన్న హీరోయిన్ లాగ కనిపిస్తోంది నాన్సీ.


‘ఇవేనా మీరు చదివే పుస్తకాలు?’ టీచర్ ఉరుము.


‘మంచిదేనండి; మిస్టరీ నవల’ నా బిక్క మొహములో భయము, గొంతులో గుటకలు.


‘అవునా, ఏదీ - చూడనీ’. మా వాడు నా వైపు కోపంగా చూపు.


విధి వక్రించడమంటే నాకారోజే తెలిసింది. ‘చూద్దాం ఎలాంటి పుస్తకమో’ అని టీచర్ పుస్తకాన్ని లాక్కుని, మొదటి చాప్టర్ ‘New girl in the town’ అని గట్టిగా అందరికీ వినపడేలా చదివారు. అంతే!


పుస్తకం క్లాస్ గుమ్మం బైట పడడం, నా చెంప ఛెళ్ళు మనడం ఒకే సారి జరిగాయని మా వాళ్ళు చెప్పడం గుర్తు.

No comments: