Friday, August 03, 2007

నిగర్వి

విహారి బ్లాగ్ లో కృష్ణదేవరాయల వారి కధ చదవగానే నాకు చిన్నప్పుడు చందమామలో చదివిన కధ ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ కధ సారాంశము ఇది.

ఒక రోజు మీసంమెలేసుకుంటున్న రాజు గారికి అసలు లోకంలో గర్వమంటూ లేనివాడు ఉంటాడా అని ఒక చిన్న సందేహం కలిగింది. రాజు తలచుకుంటే కొరడాదెబ్బలకే తక్కువ లేదన్నప్పుడు, వెట్టి చాకిరీ కొదవా? వెన్వెంటనే మంత్రి హాజరు కావడం, రాజ్యంలో ఉన్న నిగర్వులందరినీ పట్టి తేవలసిందను పని ఆయన తలమీద పడడం జరిగిపోయాయి.

ఇక మంత్రి గారు తాను కూడగట్టకలిగిన తెలివైన వారినందరినీ దగ్గరకు పిల్చి మహారాజు గారి ఆజ్ఞని తెలియజేసారు. అందరూ కలిసి, కూడబలికి చివరకు ఎలా ఐతేనేమి గాలించి, సకల పరీక్షలూ పెట్టి, ఒక్కడంటే ఒక్కడే నిగర్విని పట్ట గలిగారు. ఇక తేలికగా ఊపిరి పీల్చి మంత్రి రాజు వద్దకు వెళ్ళి ఒకింత గర్వంగా పని నెరవేరిందని తెలిపారు. ఇది విని రాజు సంతోషించి, నిగర్విని తాను స్వయంగా కలిసి కొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తి చెంది, ఇలాంటి గొప్ప వాడిని తప్పక సత్కరించాలని నిర్ణయించి సభని ఏర్పాటు చేసారు.

సభలో పెద్దలందరి సమక్షంలో నిగర్విని సత్కరించిన పిమ్మట, రెండు పలుకులు పలకమని అడిగారు. నిగర్వి సభ ముందు నిలబడి “ఇంతటి సత్కారానికి రాజుగారు నన్ను యోగ్యుడని నిర్ణయించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అని అన్నాడు. అటు పిమ్మట అతని నాలుక స్వీయ-కొరుకుడుకి గురయ్యిందో లేదో నాకు తెలియదు.