చ. తెలుగు అకాడమీ మనకు తెచ్చెను అర్ధశతాబ్ది ఉత్సవ
మ్ములను పురస్కరించుకొని బోలెడు చక్కని చౌక పుస్తక
మ్ములనని, ఎక్కడో చదివి, పోయి సరాసరి నేను చూడడం
సులభముకాక, ప్రాణము ఉసూరనె; మార్గము చిక్కెనింతలో...
మా మామగారు నా కోసమని వెళ్ళి పుస్తకాలు కొంటానన్నారు! సంతోషమే - కానీ నాకు తెలుగు అకాడమీ ప్రచురణల గురించి ఎక్కువ తెలియదు. తెలిసిన రెండు మూడు పుస్తకాల పేర్లు, ఇద్దరు ముగ్గురు కవి/కధకుల పేర్లు చెప్పాను. (వారి ప్రచురణలో కాదో తెలియదు). అందువల్ల మీకు తెలిసిన చదవదగ్గ తెలుగు అకాడమీ ప్రచురణలు ఏమైనా ఉంటే వెంటనే తెలిపి పుణ్యం కట్టుకోండి.
Thursday, February 28, 2008
Monday, February 25, 2008
చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ.. -2
ఉ. దుష్ట సమాసముల్, తగని తుఛ్ఛపు సంకర జాడ్య మౌఢ్య భూ
యిష్ట ప్రయోగముల్, అతిశయించిన దుష్పదజాల వెల్లవల్
తిష్టలు వేసె నీ కలము తెచ్చిన పోకడవల్ల మూర్ఖుడా,
భ్రష్టవు భాష నీ చలువ వల్ల, నరాధమ ఓ సినీకవీ!

Friday, February 22, 2008
Singapore wins Youth Olympics 2010 bid
నిర్వహణ విషయం గురించి సింగపూరుని..
శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా
ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా
చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్
మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*.
కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు సింగపూరుని తక్కువగా చూపించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
* యూత్ ఒలంపిక్కులని గణాలలో కుదించడానికి, పాదంలో యతి మైత్రికుదర్చడానికి యవ్వనంపొలంపిక్కులు అనవలసి వచ్చింది. ఇంతకంటే మంచి ఆలోచన మీకు తట్టినట్టైతే చెప్పండి

Wednesday, February 20, 2008
Kitchen Confidential
చ. కళకళలాడు వంటగది, కమ్మటి వాసనలంతటా, భలే!
తళతళలాడు గిన్నెలు, నిదానముగా పని సాగుతూ భలే
సులభముగా ఫలారములు, శుభ్రముగా రుచులందునే సదా
“నిలబడి పాలు తాగెదము” నెమ్మదిగా, పరుగెందుకోయ్, వృధా?
..అంటూ దూరదర్శనిలో షెఫ్ఫులని, వారి వంటగదులని, వాళ్ళ వంట సామానుని చూసి హోటళ్ళ గురించి లొట్టలేసే వారు లేకపోలేదు. కానీ, నిజజీవితపు పూటకూళ్ళ వంటగదుల నిజాలు ఎంత నిష్ఠూరంగా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆంతనీ బూర్డేఁ రాసిన కిచెన్ కాన్ఫిడెన్షియల్
చదవాల్సిందే.

Tuesday, February 19, 2008
మైక్రోసాఫ్టు పన్నాగం
ఇది చదవండి
త. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా
(బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే)
వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా,
ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే
కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా
Monday, February 18, 2008
చెత్త పాటలు రాసే తెలుగు సినిమా కవీ..
శా. ఏంట్రా నీకిది కొంచెమైన సబబా? ఇట్లాంటి సాహిత్యమా?
కంట్రీబ్రూటయి తెల్గు పాటలనిలాగా, పెంట సిన్మాలకై
కంట్రోలన్నది గాలికొగ్గి భడవా, గార్బేజిలా కక్కుతా
వేంట్రా? వెంట్రుకె ఉచ్చు నీకు వెధవా, వేళ్ళాడి ఊరేగరా.

Sunday, February 17, 2008
కృష్ణ
మ.కో. బుట్టలో పడిపోతినే, అరె! బొత్తిగా మతి పోయెనా?
వట్టి మాటలు వ్రాయువారలపైన మాయని నమ్మకం
బిట్టిదెందుకు? పెద్ద idle జీవి brainకి ideaల్
తట్టునా, సరితూచి చెప్పగ నాసి చిత్రము చూసినా?
జవాబు: లేదు అలాంటి ఆలోచనలు తట్టవు. అతడికి మంచి సినిమాకి చెత్త సినిమాకి తేడా తెలియదు. సమీక్షలోంచి ఓ మచ్చుతునక..
“Second half’s graph goes down a bit during the flashback episode and pre climax scenes. But the director brought back the film on track with interesting climax by blasting a couple of fully-loaded lorries” రెండు లారీలు పేల్చేస్తే చిత్రం ఆసక్తికరంగా తయారవుతుందా?
ఐనా తప్పు నాది. ఇంటికి నడిచి వెళ్ళే దూరంలో నడిచే తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. త్యాంగ్బారు ప్లాజాలో, అంటే నడిస్తే ఇంటినుండి పట్టుమని పది నిమిషాలు పట్టని చోట, కృష్ణ సినిమా ఆడుతోందనే సరికి నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంత దగ్గగా తెలుగాటా? పైగా ఐడిలు బ్రేను గూట్లో జీవి బాపుందన్న సినిమా ఇది. ఇంకేం కావాలంటూ వెళ్ళిన నాకు తగిన శాస్తే జరిగింది.
సినిమా చెత్తలా ఉంది. రవితేజ పెట్టే కష్టాలని తట్టుకోలేక బహ్మానందం అరిచే వెర్రి నవ్వులు, బెల్టుతో కొట్టుకోవడాలు - ఇదీ హాస్యం. “సముద్రం అమ్మాయి ఒకే రకం, సముద్రం దగ్గరకి వెళ్తే మిగిలేవి అలలు, అమ్మాయి దగ్గరకి వెళ్తే మిగిలేవి కలలు” ఇలాంటి చెత్త సంభాషణలు, నవ్వుల కోసం చెవులు చిల్లులు పడేటట్టు అరుపులు, గావుకేకలు కోకొల్లలు ఇందులో. రవితేజ మాటతీరు, నటన బానే ఉన్నాయి కాని మంచి సినిమాకి అవొక్కటే సరిపోవుగా.
వీలు దొరికినా చూడకండి.

Jodhaa Akbar
ఉ. ఉల్లములెల్లనుల్లసమునొందగ, (భారత దేశమందు వ
ర్థిల్లిన రాచవీరుని గురించి నిజాలను కొంత మార్చినా)
తొల్లిటి వైభవాలు, కదనోద్యమ భేరులు, వీనువిందుగా
కళ్ళు జిగేలనే విధముగా తెరకెక్కెను జోధ అక్బరై
Monday, February 11, 2008
U V Koteswara Rao
చ. గణనములోకి వచ్చుటకు కావలెనన్న సరైన జ్ఞానమూ
పనితనమున్ననూ పనికిమాలిన దారుల పోవుచుండగా
కనబడి, శ్రధ్ధతో చదువుకై కృషి చేసిన క్లిష్టమైనదౌ
గణితము పిండికొట్టడము కష్టము కాదని, దీక్షబూనితే
వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై
కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా
తునకలు కాకమానదని త్రోవను చూపిన విజ్ఞుడా, సదా
ఋణపడియుందు, నాదు అభివృధ్ధికి కారకుడా, నమోనమః
పై పద్యానికి నాలుగు పాదాల మూలమిది..
చ. గణితము పిండికొట్టడము కష్టము కాదని, పట్టుబట్టితే

కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా*
తునకలు కాకమానదని నూరిన కోవిదుడా నమోనమః
రామయ్యగారి వద్ద ఐఐటి పరిక్షకై చదువుకున్న వారికి కోటేశ్వరరావు గారి గొప్పదనం గురించి వేరే చెప్పనవసరం లేదు. క్రితం వారం హైదరాబాదు వెళ్ళినప్పుడు హిందు దినపత్రిక తిరగేస్తుంటే గుండెపోటు వల్ల ఆయన మరణించారని వార్త చదివి చాలా బాధ పడ్డాను. కాల్క్యులస్ బోధించడంలో ఆయనకి ఎవరూ సరిరారని నా అభిప్రాయం; పాఠాల మధ్యలో తెలుగు సామెతలు, "ఎంసెట్" కోసం బట్టీ పట్టే వాళ్ళ మీద విసుర్లు ఆయన trademark పధ్ధతి. గణిత శాస్త్రంమీద నాకు అభిమానం పెంచిన ఆయనని నేను ఎప్పటికి మరచిపోలేను.
(*ఆయన కాల్క్యులస్ లో లిమిట్స్ గురించి చెపుతూ లెగ్రాంజెస్ సిధ్ధాంతాన్ని ఓ తెలుగు గణితశాస్త్రవేత్త అడకత్తెరలో పోకచెక్క సిధ్ధాంతము అని మహ బాగా అన్నాడని చెప్పడం నాకు గుర్తుండిపోయింది)

Subscribe to:
Posts (Atom)