Sunday, October 01, 2006

చందమామా? బాలమిత్రా? - 2 (పుస్తకాలు, టీ.వీలు)

ఇంతకు మునుపు, ఇది..ఇక చదవండి..

అప్పట్లో అరచేతిలో పట్టే చిన్న నవళ్ళూ వచ్చేవి. సాధారణంగా కధలన్ని రాజులు, రాజ్య/రాకుమారి-అపహరణాలు, మాంత్రికులు, వింత క్రూర జంతువులు, అడవులు, దెయ్యలతో నిండి ఉండేవి. ఏవిటో, కధలన్నీ ఒకే తీరుగా ఉన్నా చదవడానికి విసుగు మాత్రం పుట్టేది కాదు. అప్పుడప్పుడు, ఆ పుస్తకాల చివరి పేజీలు చిరిగిపోవడం వల్ల కధ పూర్తిగా తెలిసేది కాదు - అయినా చదవడం ఆపేవాళ్ళం కాదు. ఆ పిచ్చేమిటో గాని బానే ఉండేది.

ఇటువంటి పుస్తకాలనుంచి ఎదిగినా తెలుగు పుస్తకాలు చదువుతూ ఉండాలంటే , ఎదిగిన పిల్లల సాహిత్యం అందుబాటులో ఉండాలి.

అదే పెద్ద చిక్కు ముడి.

హార్డి బోయ్స్, త్రీ ఇన్వెస్టిగేటర్స్ లాంటి పుస్తకాలు తెలుగులో తక్కువే. వేరే తెలుగు నవళ్ళు చదువుదామంటే ఇంట్లో స్వాతి, అంధ్రభూమి లే నిషేధం మరి వాటిల్లొ వచ్చే కధల్లాంటి నవళ్ళెక్కడ చదవనిస్తారు?

"పైగా, పిల్లలు ఇంగ్లీష్ కధల పుస్తకాలు చదువుతున్నారంటే అదో గర్వించదగ్గ విషయం కాదటండీ??"

అలా అలా ఇక తెలుగు పుస్తకాలు చదివే అలవాటు తప్పిపోయింది. ఫేమస్ ఫైవూ, సీక్రెట్ సెవెన్లూ మొదలు. ఎప్పుడో ఎదిగిన తర్వాత తెలిసింది కాని 'నేన్సీ డ్రూ' నవళ్ళు అమ్మయిలకోసమని, తెలిసేంత వరకు హార్డి బోయ్స్ తో పాటు అవికూడా చదివేసే వాళ్ళం.

(నేన్సీ డ్రూ నవల వల్ల నాది,స్నెహితుడిది ఓసారి క్లాసులో తలతీసేటట్టి అవమానం జరిగిందిలెండి; అది మరో సారి ఎప్పుడైనా.. )

ఇంజనీరింగ్ చేసే రోజుల్లో ఒక స్నేహితుడి వల్ల కొడవడిగంటి కుటుంబరావు గారి 'చదువు' నవల తప్ప తర్వాత ఇంకేవీ తెలుగు పుస్తకాలు చదవలేదు.

చిక్కు ముళ్ళు లేకుంటే తెలుగు పుస్తకాలు ఇంకా బానే చదివే వాళ్ళమేమో?

===

ఇక చిన్నపటి టీ.వీ విషయానికి వస్తే...

ఒక్కొక రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉండేది, బుధవారమటే చిత్రహార్, గురువారమటే చిత్రలహరి, శనివారం తెలుగు సినిమా, ఆదివారం హింది సినిమా. ఇంట్లోనా టీ.వీ ఉండేది కాదు. ఇంక ఆ సాయంత్రాలు టి.వి. ఉన్న పొరుగింటికే పరుగు;

మాకు తెలిసి ఇంటి పక్కలో రెండు ఇళ్ళకి వెళ్ళచ్చు, ఇద్దరిలో బాగా తెలిసిన వారింటికే ఎక్కువగా వెళ్ళే వాళ్ళం. కానీ అప్పుడప్పుడు, (ఆనాటి కరంట్ దేవుడి విచిత్రాలు కోకొల్లలు) వేరే ఇంటికీ వెళ్ళవలసి వొచ్చేది.

సినిమా రొజులప్పుడు మధ్యలో వార్తలు వచ్చేటప్పుడు ఇంటికి పరిగెట్టడం, భొజనం త్వరత్వరగా కానిచ్చేయడం, తిరిగి పరుగెత్తడం. ఇంట్లో టి.వి. ఉంటే ఎంత బావుండునో అనిపించేది.

అప్పుడప్పుడు ఆటలన్నీ త్వరగా కానిచ్చి కాళ్ళు, చేతులు కడుక్కొని సినిమా కోసం టీ.వీ డబ్బా ముందు కూర్చున్నా,1. అంతరాయంకి చింతిస్తున్నామో2. నలుపు తెలుపు కలగాపులగపు చుక్కలో (అంటే స్టూడియో కరంట్ లేదని అనుకునే వాళ్ళం) 3. కర్ణాటక సంగీతమోప్రసారమయ్యేవి; లేదా ఇంట్లోనే కరంట్ పోయేది.
సాధరణంగా ఆ సమయాల్లో మేమంతా చాలసేపు పట్టు వదలకుండా కూర్చునే ఉండె వాళ్ళం. అయినా గుంపులో మూఢ నమ్మకాలూ ఉండేవి. ఒకడు లేవకుండా కూర్చుంటేనో లేక ఇంకోడు లేచి వెళ్ళిపోతేనో సినిమా మొదలైపోతుందని. అప్పుడప్పుడు అలా కొందరు బలై పోయేవారు.

కొన్నేళ్ళ తర్వాత ఇంట్లో సొంత టీ.వీ (అదీ కలర్ మరి) వచ్చేసరికి మా ఆనందానికి హద్దులు లేవు. కొనాళ్ళ పాటు మహాభారతం లాంటివి కలర్లో చూద్దామని పొరిగింటి వారు మా ఇంటికి వొచ్చేవారు -నెమ్మదిగా అందరిళ్ళళ్ళో కలర్ టీ.వీలు రావడం వల్ల అదీ ఆగి పోయింది.

1 comment:

Naga said...

ఈ టపా వ్రాసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
నేను చిన్నప్పుడు ఈ రాజు-రాణి-మాంత్రికుల వంటి కథల పుస్తకాలు కొన్ని వందలకొద్దీ (అద్దెకు తెచ్చుకొని) చదివి ఎంతో ఆనందాన్ని పొందాను. ఈ టపా మర్చిపోయిన ఆ మధురానుభుతులను మళ్ళీ నాకు గుర్తుకు తెచ్చింది.