ఎన్నిసార్లని మన డైరక్టర్లు అనలేదు, మనం వినలేదు "మా సినిమలో పాటలు కధని ముందుకి నడుపుతాయని "..."కధ పాతదే ఐనా ట్రీట్మెంట్ డిఫరెంట్" అని వాళ్ళు చెప్పే పాత చింతకాయ లాంటి పచ్చడే అదీనూ.
ఒక రోజు ఇంటికి వస్తూండగా "ఇన్వెన్షన్ ఆఫ్ హ్యూగో కబ్రే" రచయిత బ్రయాన్ సెల్జ్ నిక్, తన పుస్తకం గురించి చెబుతూ "ఇందులో బొమ్మలు కధని ముందుకు తీసుకు వెళతాయి, కేవలం నేను బొమ్మలు గీయగలను కాబట్టి గీసినవి కావు" అని (అర్ధం వచ్చేలా) రేడియోలో చెబితే నాకు మన తెలుగు సినీ డైరక్టర్లే గుర్తుకొచ్చారు కాని ఈ పుస్తకమేంటో చూద్దమన్న కుతూహలమూ కలిగింది - మన సినీ మూస డైరక్టర్లని గుర్తుకు తెచ్చేదని సరిగ్గా పరికించక కొట్టి పారేయడం మంచిది కాదు కదా? అందుకే ఆ రోజు సాయంత్రమే దగ్గరున్న గ్రంధాలయంలో ఈ పుస్తకం కావాలని ఓ అర్జీ పడేసా. ఓ వారం పోయాక అందింది నా చేతికి పుస్తక రాజం - పక్కలన్ని నల్లగా, ఐదొందలాకులంత లావుగా, అబ్బా ఇప్పుడింత పెద్ద పుస్తకమెవడు చదువగలడురా బాబూ అనిపించేలా కనిపించింది. కాని ఒక్కసారి తెరిచి చదవడం మొదలు పెట్టానా, పక్కన పెట్ట బుద్ది కాలేదు. అంతటి లావు ఉన్నా, అనేకమైన పెన్సిల్ స్కెచస్ వల్ల చదవడం చక చక అయిపోయింది.
తండ్రిని కోల్పోయి, తప్పని పరిస్తితులలో బడి వదిలేసి తాగుబోతు మామయ్యతో ఉండడానికి రైల్వే స్టేషన్ కి వచ్చిన "ఓ గడియారాలబ్బాయి" కధ ఇది. హ్యూగోకి గడియారాలే కాదు, ఎటువంటి యంత్రమైనా మరమ్మత్తు చేయడమంటే మహ సరదా. తండ్రి దగ్గరనుంచి నేర్చుకున్న ఆ విద్యలో నైపుణ్యత సంపాదించి విరిగిన ఒక రోబోట్ ని తిరిగి పనిచేసేలా చేయడానికి వాడు పడ్డ కష్టాలు, ఆ ప్రయత్నాల వల్ల వాడి జీవితంలో కలిగిన అనూహ్యమైన మార్పులు - అదండి కధ.చిన్న పిల్లల కధే ఐనా, ఎంతో ఆసక్తికరంగా బొమ్మలతో (మధ్యలో వందేళ్ళ క్రితం నాటి ఫ్రెంచ్ సినిమాలతో) ముందుకు నడిచేస్తుంది. కామిక్ లు, మంచి కధలూ ఇష్ఠం ఉన్నవారు తప్పక చదవాల్సింది ఈ పుస్తకం.
No comments:
Post a Comment