ఐదారేళ్ళ క్రితమనుకుంటా ఎంటీవీ లో సైరస్ వేసిన ఎన్ టీ ఆర్ వేషం చూసి నేను, స్నేహితులు పగలబడి నవ్వుకున్నాము. యమగోల లోదేమో ఒక సన్నివేశాన్ని బెల్ బాటం పాంటు, పైబొత్తాలు పెట్టని చొక్కా, విగ్గేకాని ఇంకేదీ కాదని కనిపించే జుత్తు - నుదుటిన పడి మెలిక తిరిగిన రెండు వెంట్రుకలూ, వీటితో పాటు కనుబొమలు ఎగరేస్తూ "అమ్మా అమ్మా" అంటూ పరుగెట్టి వస్తున్న సైరస్ ని చూసి మనవాళ్ళూ అస్సలు ఎన్ టీ ఆర్ లో ఏమి చూసి అంత ఆకాశానికెత్తేసారని అనుమానము కలిగింది. పౌరాణికాలలో శ్రీకృష్ణుడి పాత్రల వలనేమో అని సరిపెట్టుకున్నా.
అంటే పాత సినిమాలు దూరదర్శన్ "తప్పదు రా భగవంతుడా; నాన్నకి ఇవి ఎలా నచ్చుతాయిరా బాబు" అనుకుంటూ చూడడం వల్లో, లేక పేర్లలో "స్టంట్స్" లేని సినిమాలేవీ సరిగ్గా చూడకపోవడం వల్లో - మిస్సమ్మ లాంటి గొప్ప సినిమాలు పెద్దగా గుర్తు లేవు మరి.
==
మళ్ళీ మిస్సమ్మ చూసి రెండు వారాలయ్యింది.
"కావాలంటే ఇస్తాలే, నావన్ని ఇక నీవేలే" పాటలో ఎన్ టీ ఆర్ ని చూసి అర్ధమయ్యింది - మామ్మలు, బామ్మలు, పెద్దత్తలు, పెద్దమ్మలు ఆయనది "చంద్రబింబం" లాంటి ముఖమని ఎందుకంటారో. మరంతటి అందగాడు డెబ్భై,ఎనభై దశకాలలో అంతటి మోటు వేషాలు ఎందుకు వేసాడో అని బాధ కూడా కలిగింది.
==
నాలాగే మీరూ ఐదారేళ్ళ క్రితం ఎంటీవీ చూసి నవ్వి ఉంటే - "మిస్సమ్మ" తప్పకుండా చూడండి. మీ opinions కొద్దిగా మారవచ్చు.