Sunday, October 12, 2008

ఏడాది నిండింది

నేను పద్యాలు వ్రాయడం మొదలు పెట్టి అక్టోబర్ పదికి ఏడాది పూర్తయ్యింది. అంతకు పూర్వం ఛందో బధ్ధమైన పద్యాలు వ్రాయాలని కోరికే తప్ప ఎలా వ్రాయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న నాకు ఆ ఆంజనేయస్వామి దయవల్ల కాస్తో కూస్తో గణాల గుణాలు వంటబట్టినాయి.

నేను చూస్తున్న చిత్రాలను గూర్చి వ్రాసిన మొదటి ఉత్పలమాల తరువాత, అమెరికాలో నా కారు నడపడం ఓ కొత్త మలుపున పడిందనే చెప్పచ్చు - సాధారణంగా ఎన్పీఆర్ లేక పాత తెలుగు పాటలు వినేవాణ్ణి పద్యాలల్లడంలోనే గడపడం ప్రారంభించాను. అక్టోబరు, నవంబరు నెలల్లో వీలు దొరికినప్పుడల్లా, మనసుకి నచ్చిన విషయం అందినప్పుడల్లా పద్యాలు కూర్చడానికి ప్రయత్నాలే. ఉల్లాసంగా దొర్లిపోయిన కాల మది.

ఆ ప్రవాహం సింగపూరుకి చేరిన కొత్తలో కొంచెం కుంటువడినా ఇప్పుడు మళ్ళీ వ్రాయడానికి ఉత్సాహం, అవకాశాలు, వ్రాయగలనన్న నమ్మకం ముప్పిరిగొన్నాయి. ఈ సమయంలోనే రెండు అభినవ భువనవిజయంలో పాల్గొనడానికి అవకాశమిచ్చి నా ఉత్సాహానికి ప్రోత్సాహాన్ని అందజేసిన పొద్దు సంపాదకవర్గానికి నా కృతజ్ఞతలు.

నేను వ్రాసిన పద్యాలను మెచ్చుకుని, తప్పులుంటే నిర్మొహమాటంగా తెలిపి కొత్త విషయాలు తెలిపిన బ్లాగ్మిత్రులైన - కొత్తపాళీ గారు, వాగ్విలాసం రాఘవ (కొన్ని టపా వ్యాఖ్యల్లో రాఘవతో ఆడిన గొలుసు వృత్తాల ఆటలు నాకిప్పటికీ గురుతే.), వికటకవి, చదువరి, రానారె, శ్రీరాం, రాకేశ్వర రావు, ఊదం, బ్లాగేశ్వరుడు -వీరందరికీ వేవేల నెనరులు.

పదేళ్ళ పాటు, ముందు పైచదువుల వలన అటుపై వృత్తిరీత్యా ఆంధ్రప్రదేశం బయట నివసించడం వల్ల - ఇంటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడేటప్పుడు తప్ప- తెలుగులో సంభాషించే అవకాశాలు లేక, నెమ్మదిగా తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగే శక్తినే కోల్పోయిన నాలో స్వభాషాభిమానాకి పునర్జన్మనిచ్చిన గొప్పదనం తెలుగు బ్లాగరులే చెందుతుంది. వీరికి నా ప్రేమ పూర్వక ధన్యవాదాలు.

నేను మొదట నేర్చుకున్న ఛందస్సులో తప్పులు ఈ మధ్యనే అవగత మయ్యాయి. తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, భైరవభట్ల కామేశ్వర రావుగారు, చింతా రామకృష్ణారావు గారు - ముఖ్యంగా ఈ మువ్వురి చలువవల్ల నాకు కొత్త విషయాలు నేర్చుకుని, తప్పులని సరిదిద్దుకునే అవకాశం లభించింది. వీరికి నా వందనాలు.

ఇక వీలు దొరికినప్పుడు పూర్వం వ్రాసిన పద్యాలలో దొర్లిన తప్పొప్పులను సరి దిద్దాలనుకుంటున్నాను.

ప్రస్తుతానికి నేను వ్రాసిన వాటిల్లో నాకు కొద్దో గొప్పో సంతృప్తినిచ్చిన పద్యాల లంకెలివిగో.

౧.
గణాధిపతి కి నమస్సుమాంజలులు
౨. మిస్సమ్మకు మత్తకోకిలలు
౩. గుండమ్మకి సీసాలు
౪. మాగీకో మాల
౫. తేట తెలుగు పలుకు
౬. పదహారు పాదాల అప్పుల తిప్పల ఉత్పలమాల
౭. పదహారు పాదాల
బీ మూవి మత్తకోకిల
౮.
మా లెక్కల మాస్టారికి చంపకమాలాంజలి
౯. ఒబామకి ఆంగ్ల వృత్తం

12 comments:

  1. Happy anniversary :)
    కొన్ని లింకులు పని చెయ్యడం లేదు, చూడండి

    ReplyDelete
  2. గిరిగారూ,

    అభినందనలు. డబుల్ సెంచరీ ఎప్పుడో కొట్టేసి వుంటారు. అప్పటికీ ఇప్పటికీ మీ పద్యాల్లో నాణ్యతాసాద్రత ఎంతో పెరిగింది. హైలైట్స్ ఇచ్చారు బాగుంది. పద్యాలు వ్రాయడం కొనసాగిస్తూనే వుండండి. మిమ్మల్ని చూసి అడపాదడపా నేనూ ఒకటీ అరా రాస్తూ వుంటా. మీలాగా నేను 'పద్యాలు వ్రాయడం మొదలు పెట్టి ...' అని చెప్పుకోలేకపోయినా 'మొదటి పద్యం వ్రాసి సంవత్సరం దాటింది' అని చెప్పుకోవచ్చు. :-)

    ReplyDelete
  3. ఏటికే మీకు వచ్చె టీనేజి పరుగు
    తప్పడడుగులు కావింక తరుణ యవ్వ
    నంపు హొయలున్న వయ్యారి నడకలేను
    అందుకొనుడివె నా అభినందనలను!

    ReplyDelete
  4. గిరిగారు,

    అభినందనలు..

    ReplyDelete
  5. @ గిరి, అభినందనలు. ప్పుడెప్పుడో కొత్తపాళీ గారన్నట్లు, మీకిక తప్పటడుగులు మరెందులోనైనా పర్లేదుగానీ, ఇలా తెలుగులో మంచి సత్తా ఉన్న పద్యాలు రాసే బ్లాగు పేరుగా మాత్రం తగనే తగదు. మార్చేద్దురూ :-)

    ReplyDelete
  6. గిరిగారు: అభినందనలు. మీ కవితా వాహినిలో సదా మమ్మల్నిలా ఓలలాడించాలని ఆశిస్తూ మరోసారి శుభాకాంక్షలతో

    ReplyDelete
  7. వర్షము నిండెను కవితా
    వర్షము గురియింప దొడగి,పద్యముపై యా
    కర్షణ పెంచిరి బ్లాగుల
    హర్షముతో జెప్పుచుంటి,"హ్యాట్సాఫ్" గిరిధర్!

    ReplyDelete
  8. గిరి గారు,
    సంతోషం.
    తాడేపల్లి వారు ఓ మారు అన్నట్టు గత ఆరుమాసాలలో మీరు సాధించిన పరిణతి మెచ్చుకోవలసినదే .. ఇలానే పద్యధార కురిపిస్తూ ఉండండి
    నాదీ వికటకవి గారి మాటే, పద్యాల్లో పరుగుపందాలు మీవి.
    @ చంద్ర మోహన్ గారు
    "హర్షముతో జెప్పుచుంటి,"హ్యాట్సాఫ్" గిరిధర్!" - వావ్

    ReplyDelete
  9. సింగపూరెళ్ళాక మొదట్లో వడి తగ్గింది గానీ, మళ్ళీ పుంజుకున్నారు. వాడి మాత్రం పెరిగింది. మొన్న చెప్పిన మాటే మళ్ళీ -మీరు తెలుగులోనూ పద్యాలు రాయగలరు.

    ఆంగ్లముననె గాదు ఆంధ్రమందునగూడ
    పద్యమల్లగలుగు పండితుడవు
    సింగపురము జేర చేవదేరిరి మీరు
    పదునుదేరె మీదు పద్య గరిమ

    ReplyDelete
  10. అవసరమైన కొద్ది మార్పులతో..

    ఆంగ్లముననె గాదు ఆంధ్రమందునగూడ
    పద్యమల్లగలుగు పండితుడవు
    సింగపురము జేర చేవదేరితి వీవు
    పదునుదేరె నీదు పద్య గరిమ

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.