Friday, August 22, 2008

నాకు నచ్చిన బ్లాగులు

తాబాసు గారిది తనదైన గరిమము
కలగూరగంపగా కనులవిందు
కొత్తపాళీగారి గుత్తాధిపత్యము
విన్నదీ కన్నదే వింతలేదు
భైరవభట్లవి బహుచక్క వ్రాతలు
తెలుగు పద్యాలను తెలియపరచు
వర్తమాన విషయ వ్యాఖ్యాత చదువరి
లొసుగులన్ కనిపెట్టి లోతుజెప్పు

వాగ్విలాస రాఘవాభిధానుండును
తెలుగుపద్యములకు తేటగీతి
నాకు నచ్చినట్టి చాకులైదుగురని
సీసపద్యమందు చెప్పబోతి


ఇంకా,

మాండలికమ్ములో కథకు మంజిమ నిచ్చెడి రామనాథుడూ,
మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
సుండును
, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులైరి చూడగా..


గరిమము= గొప్పదనము
మంజిమ = మనోజ్ఞత
మేమెయి = సునాయాసంగా

15 comments:

  1. Awesome!! I was waiting for someone to get this creative on the topic.

    Loved it!!

    ReplyDelete
  2. గిరిగారూ,

    చాన్నాళ్లకొచ్చాను మీ బ్లాగుగూటికి.
    'సీసపద్యమందు' మత్తెక్కించింది. :)
    చదువరి గారిని చదువని వారిని - దిమ్మ తిరుగు రీతి తిట్టవచ్చు! :)))

    బ్రహ్మాండం!!

    ReplyDelete
  3. గిరి గారు,
    మీరు అసాధ్యులండీ బాబు. మీ రూటే సెపరేటు :-)

    చాలా బాగుంది.

    ReplyDelete
  4. బావుంది. పై నలుగురూ నిజమైన చాకులు. నేను తుప్పుపట్టిన చాకును ;)

    పైనివారె మాంఛి-పదునైన చాకులు,
    పనికిరాని తుప్పు-పట్టినట్టి
    చాకు నేను లేదు సందేహమిందులో
    విశ్వదాభిరామ వినురవేమ

    అబ్బో, సీసాలే సీసాలు...
    తప్పటడుగులనుచు తనదైన గుర్తింపు
    పొంది చిలుకుకాలమందు సీస
    పద్యకడలిలోన పడి మునకేస్తున్న
    గిరిని కదుపుదామ శరధిధామ? :)

    అన్నట్టు "కొత్తపాళీగారిది గుత్తాధిపత్యము" అన్నచోట "కొత్తపాళీ గారి" చాలేమో! "ది" అని ఇంగ్లీషు అక్కర్లేదనుకుంటా :)

    ReplyDelete
  5. రెండో పద్యం నారాయణస్వామిగారికీ, రామనాథునికీ, శ్రీరామునికీ... ఇంకా ఎవరైనా విష్ణునామధేయులుంటే వారందరికీ. నాక్కూడా. :)

    ReplyDelete
  6. రెండో పాదంలో తేటగీతి అనుండేసరికి, తేటిగీతి లయలో చదవబోయాను. ఏంట్రా కుదరట్లేదూ అనుకునే సరికి ఆటవెలదా అనుకున్నాను. :)
    బాగు బాగు.

    ReplyDelete
  7. అధ్బుతం టపా అదిరింది.

    ReplyDelete
  8. పద్యం చాలా చక్కగా వచ్చిందండీ

    ReplyDelete
  9. పద్యం చాలా బాగుంది.

    ReplyDelete
  10. చక్కగా ఉంది.

    ReplyDelete
  11. మాండలికమ్ములో కథలు మస్తుగ వ్రాసెడి రామనాథుడూ
    మెండుగ హాస్యవల్లరుల మేమెయి పూతకుదెచ్చు శ్రీనివా
    సుండును*, ఊకదంపుడను చోద్యపు పేరుకి పేరుదెచ్చినా
    తండును, నాకునచ్చు మగతా సహ బ్లాగరులౌరి చూడగా..

    * వికటకవి

    ReplyDelete
  12. గిరీ ముందు మీ పద్యాలల్లే చమత్కృతికి హార్దికాభినందనలు. ఆ పై, మీ అభిమానానికి ధన్యవాదాలు.
    సీసంలో ఇలా వరస చెప్పేటప్పుడు ఒక మాదిరి సమాన ధర్మాన్ని పాటించడం పరిపాటి. ఆ దృష్టిలో చూస్తే చదువరి బ్లాగు గురించి రాసిన పాదం పై మూడిటికంటే భిన్నంగా ఉంది. వాక్యంలోని చమత్కారం హాస్య స్ఫోరకంగా ఉన్నా, అసలు పాదంలోని భావం, మిగతా మూడు పాదాల్లో లాగానే, డైరెక్టు పొగడ్తగా ఉంటేనే బాగుంటుంది అని నాకనిపిస్తోంది.

    ReplyDelete
  13. ఇప్పుడు మీ టపా చదివి, మా వ్యాఖ్యలు చూసిన వారు ఏమనుకుంటారంటారు? మిమ్మల్ని కాదు మమ్మల్ని :-)

    ReplyDelete
  14. అందరికీ ధన్యవాదాలు.
    రాఘవా, కొత్తపాళీ గారు, సీసాన్ని సవరించాను
    వికటకవి, మా వీపు మీరు మీ వీపు నేను గోక్కోవడమనుకుంటారేమో :-) ఫర్వాలేదులెండి

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.