Wednesday, October 17, 2007

Maggi కో మాల

ఉ. పెళ్ళియు కాని ఒంటరికి వేళకు అన్నము నంజుకోను ప
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే
పుళ్ళకు పెర్గుతర్కలిటు పుట్టవు ఊరకె కంచమందు; ఆ
కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా

(ఊకదంపుడు గారు చేసిన మార్పులతో ఈ పద్యం ఇంకా సహజంగా తయారయ్యిందని నా అభిప్రాయం. మార్పులు బోల్డు వత్తుగా టైపాను చూడండి)

ఉ. పెళ్ళియె కాని ఒంటరికి వేళకు అన్నము నంజుకోను ప
చళ్ళిటు ఊరగాయలటు చక్కగ కర్కరలాడు దుంప వే
పుళ్ళకు పెర్గుతర్కలెటు పుట్టవు ఊరకె కంచమందు; ఆ
కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా

మేగి (
Maggi) బ్రహ్మచారులకి చేసే మేలుని ఉత్తిమాటల్లో చెప్పడం సాధ్యం కాదు కనక, ఒక ఉత్పలమాలలో చెప్ప ప్రయత్నించాను. ఇప్పుటంటే తినట్లేదు కానీ, పెళ్ళి కాని రోజుల్లో నా వంటింటి నేస్తం మేగియే మరి. రొట్టె ముక్కల్లొ, కూరల్లొ, ఆఖరికి పెరుగులో కూడా కలుపుకుని తిన్న రోజులున్నాయి. అదంతా వంట రాక చేసిన నిర్వాకాలే. మొక్కజొన్న రేకులు (corn flakes), మేగి లేక పోయుంటే నాగతి ఏమయ్యేదో?

అందుకే ఈ పద్యాన్ని మేగికి అంకితమిస్తున్నాను.

11 comments:

  1. ఇది చాలా దారుణం. ఇలా అందరూ పద్యాలు రాసేస్తుంటే మాలాంటివాళ్ళు ఏం కావాలి...పద్యాలు రాయడానికి పనికిరాని విషయమే లేనట్టుంది మన బ్లాగర్లకి. విహారి కూడా రాస్తాడంట. బాబోయ్!!!!

    ReplyDelete
  2. చివరి పాదం
    "ఆకళ్ళను దీర్చు భోజ్యము బకాసుర పూజ్యము మేగియే కదా" అని ఉండాలి.
    నాకు వంట బాగా వచ్చు, కానీ హాస్టలు, లాడ్జి వంటి చోట్ల, "ఆకటి వేళల" మేగీయే శరణ్యం. ఎంతంటే, నేనూ, నా స్నేహితులు కలిసి ఏకంగా ఒక Maggi cuisine తయారు చేశాము.
    జ్యోతి, మీకెందుకంత ఉలుకు? మీరూ మొదలెట్టండి .. కంఠాభరణంలో లాగా ..
    "చింతపండు దెచ్చి రాచ్చిప్పలో వేసి ...":-)

    ReplyDelete
  3. కొత్తపాళీ గారు,
    ప్రచురించే ముందు భోగ్యము, భోజ్యము మధ్య బొమ్మబొరుసా తీరుగా అయ్యింది నా పని. చివరకి మాంఛి అనుభవించ తగ్గ తిండి సుమా అని చెప్పాలని, భోగ్యమని అన్నాను. ఏమంటారు?

    జ్యోతిగారు,
    నేను మీ(లాంటి)వాడినే (భాగ్యరాజా ఉవాచ!).. అయినా మాలాంటివాళ్ళు, మీలాంటివాళ్ళు ఏమిటండి, దారుణం :) ఎందులోనో రావుగోపాలరావు అన్నట్లుగా ‘మనందరిదీ ఒకే కులం, బ్లాగులం’ (ఆయన అన్నిది నాయకులం).

    ReplyDelete
  4. రోజునకొక్కటి పద్యము
    మోజున జెప్పును గిరి, బహు మోహము తోడన్
    తాజా సరుకును గోరుచు
    రోజూ ఈబ్లాగుకొచ్చి క్లోజుగ జూతున్!

    ReplyDelete
  5. గిరి గారు,
    "పెళ్ళియు" కాని బదులు పెళ్ళియె కాని అంటే అర్ధం మారుతుందా?
    "పెరుతర్కలెటు" అంటే ఇవన్నీ ఎటూ పుట్టవ్ అనే అర్ధం వచ్చేదనుకుంటా.
    నేనూ "భోజ్యం" అనలేదేంటా అనుకున్నాను, మీవ్యాఖ్య చూసినతరువాత అర్ధం అయ్యింది.

    మీ maggi ఆకలి యెలా వున్న, మీ మా పద్యాల ఆకలి తీరుస్తున్నారు , సంతోషం.

    నిన్న గాకా మొన్న మొదటి ఉత్పలమని .. ఇంతచక్కగా పద్యాలు రాస్తున్నారంటే ..అబ్బురంగా ఉంది.
    చదువరి గారు,
    మోహమంటే, పద్యలా మీద మోహమనేనా, లేక...

    ReplyDelete
  6. from CPB
    భోగ్యము bhōgyamu. n. Use, usufruet, enjoyment, or something given in pledge or on mortgage

    adj. Enjoyable, fit to be enjoyed, delicious, agreeable as food. అనుభవింపదగిన. ఆ ప్రసాదము భోగ్యముగానుండలేదు that food was not agreeable.

    భోజ్యము bhōjyamu. adj. Edible, fit to eat, eatable. భుజింపదగిన

    So - I guess both are alid.

    ReplyDelete
  7. మీ బ్లాగును గురించిన చదువరుగారి పద్యం రసమయంగా వుంది. 'మోహము తోడన్' అనగానే నాక్కూడా ఉకదంపుడుగారి సందేహమే కలిగింది. ఊరకనేకాదు, తాజా సరుకును గోరుచు - రోజూ ఈ బ్లాగుకొచ్చి క్లోజుగజూతున్!' అనేశారే!!

    నేను కూడా వంట చెయ్యగలను. నా వంట నాకుమాత్రం చాలా రుచికరంగా అనిపిస్తుంది. కానీ మీరు ఈ పద్యం లో చెప్పినట్లు అన్నీ అలా కంచంలోకి వచ్చేస్తే ఎంత బాగుండును అనిపిస్తుంది. అందరూ చెబుతుంటే చూద్దామని మేగీని ఒకే ఒక్కసారి వాడాను. అది ఉపాహారమేగానీ ఉత్తమాహారం కాదనిపించింది.

    శిష్టచతుష్టయం (మా గురువుగారిమాటల్లో గ్యాంగ్ ఆఫ్ ఫోర్)లో ఒక్కొక్కటీ మత్తేభమంత పరిణామంలో ఉండటం చూస్తే భయమేస్తుంది నాకు.

    ReplyDelete
  8. ఊకదంపుడు గారు (ఈ మారుపేర్ల పక్క గారు పెట్టడం విచిత్రంగా లేదు?)
    మీ చెప్పిన సవరణలు చాలా బావున్నాయి. టపాకి జత చేస్తాను.

    కొత్తపాళీ గారు, భొగ్యాన్ని మరి అలాగే ఉంచుతాను.

    రానారె గారు, ఈ మధ్య నేను వంట నేర్చుకున్నాను.వారానికి ఒకమారైనా వంటింట్లో నాదే అధారిటి. నా వంట ఇతరసగానికి బానే వంటబడుతుంది, నచ్చుతుంది.

    చదువరి గారు, మీ పద్యం బావుంది. నెనరులు..కానీ, అయ్యా, మీ మోహాలు, క్లోజుగా చూడడాలు, తాజా సరుకుల కోసం పొంచి ఉండడాల గురించి ఇతరులకి వచ్చిన అనుమానాలు తీర్చమని మనవి :)

    ReplyDelete
  9. "కళ్ళును దీర్చుభోగ్యము బకాసుర పూజ్యము మేగియే కదా"
    అర్థం ఒక్కటే ఐనప్పుడు పద్యసౌందర్యానికి ప్రాధాన్యత నిస్తే "భోజ్యమే" బాగుంటుంది:)

    ReplyDelete
  10. గిరి గారూ! ఊకదంపుడు గారికి అనుమానం రావడం సహజం. అదాయన నైజం! శ్లేషావతారులు, పన్‌డితులూ కాబట్టి!! కానీ రానారె గారికీ మీకూ అలా అనిపించడమే ఆశ్చర్యం!

    అసలు సంగతి మీకు తెలీనిదేముంది.. అక్కడ పాదం నిండాలి, గణాలు శాంతించాలి, యతి కుదరాలి. నాకు తట్టిన పదాలు రెండే.. మోదం, మోహం. మోదం మామూలుగా తట్టేదే గదా! సంతోషంతో పద్యం చదవడం వేరు, మోహంతో పద్యం చదవడం వేరు. పైగా, మీరు మోజుతో రాస్తున్నప్పుడు నేను మోహంతో చదవడంలో ఆశ్చర్యమేముంది? ఏమంటారు?:)

    రానారె గారూ! అయితే నా మోహం పద్యమ్మీదే గానీ మాగ్గీ మీద కాదు. ;) అదంటే నాకస్సలు పడదు.

    ReplyDelete
  11. గిరిగారు మీ మీద భోళాశంకరుడి వ్యాఖ్య తప్ప ఇంకేమి వ్రాయలేక పోతున్నాను. మీ పద్యాలు నాకు చాలా స్పూర్తిని ఇస్తున్నాయి.

    చదువరిగారు మీ పద్యం సూపర్గా వచ్చింది. అసలు చదువుతుంటే ఒక ప్రవహామే.. ...

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.