Wednesday, September 05, 2007

అబిడ్స్ సందుల్లో స్టీవ్ జాబ్స్

ఒకప్పుడు, హైదరాబాద్లో ఏవైనా సరికొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు (వాక్మాను గట్రా) కొందామంటే అబిడ్స్ సందుల్లో ఉన్న నల్లవిపణులే (బ్లాక్ మర్కెట్లు) గతి. అలా కొనడం కొంత సాహసంతో కూడుకున్న పని, ఎందుకంటే కొనే వస్తువు సరైన ధరేమిటో తెలిసుకునే ఆస్కారం అసలు ఉండదు, ధర విషయం అటు ఉంచితే వస్తువు కొత్తదో కాదో ఎవడైనా హాయిగా ముందే దాన్ని సానపెట్టి తర్వాత కొట్లో పెట్టాడో అనేది కూడా తెలియదు. ఇన్ని అనుమానాలున్నా- విదేశాలలో మనకోసం డబ్బు విరజిమ్మ గల సన్నిహితులు లేని పక్షంలో - గత్యంతరం లేక భగవంతుడి మీద భారంవేసి, రెండు వారలలోనే కొన్న వాటిని పుటుక్కుమనిపించకు తండ్రీ అనుకుంటూ - జనం ఆ కొట్ల మీద విరగ బడేవారు. ఇంతా చేసి కొన్నా మరుసటి రోజే పక్కింటి వాడెవడో అంతకంటే చక్కటి వస్తువు బారుచవకగా కొనే ప్రమాదమూ ఉంది. ఇటువంటి వంచనకు గురై జనం కుమిలి పోవడం తప్ప ఇంకేమీ చేసిన దాఖలాలు లేవు మరి.

స్టీవ్ జాబ్స్ పుణ్యమా అని ఈరోజు, ఏదేశమేగినా ఎందుకాలిడినా కుమలి పోవడం ఒకటే, అనే విషయం పది లక్షలకు పైచిలుకు అమెరికన్జనం తెలుసుకుంటున్నారు. ఎందుకేమిటి? విడుదలై పట్టుమని పది వారాలు కాకుండానే 8GB ఐఫోను ధర రెండొందల డాలర్లు తగ్గించేసి అబిడ్స్ వ్యాపారుల దెబ్బని మరిపించే విధంగా స్టీవ్ జాబ్స్ వారిని హతాశులను చేసాడు కాబట్టి.

కొన్ని చర్చాహారాలలో (forums/discussion threads లో) లోకులు అప్పుడే ఆపిల్ మీద మూకుమ్మడి దావాలు వేద్దామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు ఎంతవరకూ సఫలిస్తాయనేది చర్చనీయాంశమే ఐనా, భవిష్యత్తులో ఆపిల్ విడుదల చేసే వినూత్న పరికరాలని ఎగబడి కొనే వారు తగ్గుతారనే విషయంలో అనుమానం లేదు. ఈ రోజు స్టాక్ విపణిలో ఆపిల్ షేర్ల్ పరిస్థితి చూస్తే ఇది నిజమేనని మనకి అవగతం అవుతుంది - ఐఫోన్ని పోలి ఉన్న ఐపాడ్ టచ్ లాంటి తాయిలాన్ని విడుదల చేసినా షేర్ల ధర పెరగకపోగా కుదింపుకి గురవ్వడమే దీనికి తార్కాణము.

3 comments:

  1. నేను కూడా Apple బాధితుడినే... నేను 9700 పెట్టి iPOD కొన్నతరువాత వారం తిరిగేసరికల్లా దాని ధర 8300 అయ్యింది :(

    ReplyDelete
  2. అంత ధర పెడితే, మార్కెట్లో అధిక్యం దేవుడెరుగని భావించి తగ్గించినట్లున్నారు. జనాదరణ కావాలంటే, స్టాటస్ సింబల్‌ను చేయకుండా ముందే జాగ్రత్తపడాల్సింది.

    ReplyDelete
  3. తొందరపడి కొనలేదులే అని మా వారు తెగ సంబరపడిపోతున్నారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.